దోపిడీ రూపం మారింది.. సారంలో కాదు!
ABN , Publish Date - Nov 21 , 2026 | 02:00 AM
డిజిటల్ భూస్వాములు.. క్లౌడ్ పాలేర్లు!’ శీర్షికతో నవంబర్ 10న ఎం.కె.కుమార్ రాసిన వ్యాసంలో ఆయన చెప్పిన విషయాలు భూస్వాములకూ, పాలేర్లకూ సంబంధించినవి...
డిజిటల్ భూస్వాములు.. క్లౌడ్ పాలేర్లు!’ శీర్షికతో నవంబర్ 10న ఎం.కె.కుమార్ రాసిన వ్యాసంలో ఆయన చెప్పిన విషయాలు భూస్వాములకూ, పాలేర్లకూ సంబంధించినవి కావు. ఆన్లైన్లో వర్తకం చేసే పెట్టుబడిదారులను ‘డిజిటల్ భూస్వాములు’ అనీ, వినియోగదారులను ‘క్లౌడ్ పాలేర్లు’ అనీ ఒక సంస్కరణవాద ఆర్థికవేత్త ప్రతిపాదించిన పదాలను పొరపాటుగా ఉపయోగించారు. అందువల్లనే, ఇప్పుడున్నది ‘కొత్త దోపిడీ వ్యవస్థ’ అని, ‘అస్థిరమైన కొత్త కార్మికవర్గం ఆవిర్భవించింది’ అనీ కొన్ని పొరపాటు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఏ వస్తువు కొనాలి? అన్న స్వేచ్ఛ కొనుగోలుదారులకు గతంలో ఉండేదనీ, ఆన్లైన్ వ్యాపారం వచ్చాక ఆ స్వేచ్ఛపోయిందన్నారు వ్యాసకర్త. అది కరెక్టు కాదు. అప్పుడైనా ఇప్పుడైనా ఏ వస్తువు కొనాలనే స్వేచ్ఛ కొనుగోలుదారులకు లేదు. పెట్టుబడిదారులు ఏ సరుకులు తయారు చేయిస్తారో, ఏ సరుకుల గురించి ప్రకటనలు విరివిగా ఇస్తారో, దానికి లోబడే కొనుగోళ్లు జరుగుతాయి. కాకపోతే, అప్పుడు షాపులకు వెళ్లి కొనుక్కోవడం ఉండేది, ఇప్పుడు ఆన్లైన్లో కొనుక్కునే పద్ధతి కూడా వచ్చింది.
‘ఇప్పుడున్నది సంప్రదాయ పెట్టుబడి కాదు, అది క్లౌడ్ క్యాపిటల్’ అన్నారు వ్యాసకర్త. ఈ ‘క్లౌడ్ క్యాపిటల్’ అనేది, సరుకుల్ని తయారు చేయించడానికి పెట్టే ‘పారిశ్రామిక’ పెట్టుబడి కాదు. ‘పెట్టుబడి’ గ్రంథంలో మార్క్సు ప్రస్తావించిన ‘వర్తక పెట్టుబడి’ తప్ప, వేరుకాదు. వర్తక లావాదేవీలు షాపుల్లో జరుగుతున్నాయా, ఆన్లైన్లో జరుగుతున్నాయా అన్నదే తేడా. కుమార్ ప్రస్తావించిన కంపెనీలన్నీ వర్తక పెట్టుబడిదారీ కంపెనీలే. ఆన్లైన్లో వర్తకం చేసే కంపెనీల యజమానుల్ని ‘డిజిటల్ భూస్వాములు’ అనకూడదు. ‘డిజిటల్ వర్తక పెట్టుబడిదారులు’ అనాలి. ఆ కంపెనీలు 30–40శాతం కమీషన్ లాక్కుంటాయన్నారు. అవును మరి, పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో అది సహజం. సరుకులు తయారు చేయించిన పారిశ్రామిక పెట్టుబడిదారులు, తమ సరుకుల్ని తామే అమ్ముకునే ఏర్పాటు లేనప్పుడు, ఆ సరుకుల్ని అమ్మిపెట్టమని వర్తక పెట్టుబడిదారులకు ఇస్తారు. ఆ వర్తక పెట్టుబడిదారీ కంపెనీలు ఆ సరుకుల్ని వాటి పూర్తి విలువలకే అమ్మి, అలా అమ్మినందుకు కమీషన్ మినహాయించుకుని, మిగతాది సరుకు యజమానులకు ఇస్తాయి. ఇది పెట్టుబడిదారీ విధానం పుట్టినప్పటినించీ ఉన్నదే. తేడా ఏమంటే ఆన్లైన్ అనే కొత్త రూపమే. ఇంకా, వర్తక కమీషన్ అనేది ‘మధ్యయుగాల నాటి భూస్వామి రైతుల నుంచి వసూలు చేసే శిస్తు’ లాంటిదే’ అని కుమార్ పొరపాటుపడ్డారు. ఏ శ్రమా చేయకుండా కౌలురైతుల నుంచి భూస్వామి లాగేది ‘శిస్తు’ కాదు. భూమి కౌలు. భూమి యజమాని ప్రభుత్వానికి చెల్లించే దానిని ‘శిస్తు’ అంటారు. అమెజాన్ వంటి ఆన్లైన్ వర్తక కంపెనీలకు చిన్న స్థాయి సరుకు పెట్టుబడిదారులు చెల్లించేది సామంతులు చెల్లించే కప్పం లాంటిది అని కుమార్ చాలా పొరపాటుగా పోల్చారు. అది ‘వర్తక కమీషన్’.
కుమార్ తెచ్చిన ఇంకో పెద్ద తప్పు పోలిక ఏమిటంటే, కోట్లాదిమంది వినియోగదారులను ‘క్లౌడ్ పాలేర్లు’ అనడం. ఇంటర్నెట్ ముందు ఎన్ని వేల గంటలు గడిపినా, ఎన్ని వేల వీడియోలు చూసినా, ఏ సరుకూ తయారుకాదు. సరుకు తయారీకి కొన్ని ఉత్పత్తి సాధనాలూ, కొంత శ్రమా కావాలి. వినియోగదారులు ఏ సాధనాలతో, ఏ శ్రమ చేసి, ఏ సరుకును తయారుచేస్తున్నట్టు? ఇలా భావించడం అంటే, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి సంబంధించి, మార్క్సు చెప్పినదానిని సరిగా గ్రహించలేదని అర్థం.
పెట్టుబడిదారుల రాబడి రేటు పెరగడాన్ని అర్థం చేసుకోవడానికి, కుమార్ ఇచ్చిన ఉదాహరణ పూర్తిగా తప్పు. ఒక కంపెనీ యజమానికి, స్టాక్ మార్కెట్లో తన కంపెనీ షేర్ల విలువ పెరగడం వల్ల వచ్చిన డబ్బు తన దగ్గర పనిచేసే కార్మికుల నుంచి సంపాదించిన అదనపు విలువ కాదు. అది షేర్లు కొన్నవారి డబ్బు. దానిని మార్క్సు ‘కల్పిత పెట్టుబడి’ అన్నాడు. ఆ కంపెనీ యజమాని, ఆ కల్పిత పెట్టుబడిని, కొత్త ఉత్పత్తి కార్యంలో పెడితే, దాని ద్వారా కొత్త అదనపు విలువను సంపాదించవచ్చును. అది వేరే సంగతి. ‘‘ఇంతటి బహిరంగ దోపిడీ జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?’’ అని ఒక అమాయకపు ప్రశ్న వేశారు కుమార్. జవాబు చాలా సింపుల్. ఇవి పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలను రక్షించే ప్రభుత్వాలు గనక!
ఒక ఆర్థికవేత్త చేసిన విశ్లేషణను ప్రస్తావించి, ‘నేటి సమాజంలో కొత్త వర్గం పుట్టుకొచ్చిందని’ కుమార్ అమాయకంగా చెపుతున్నారు. ఉద్యోగ భద్రత లేని స్థితి వల్ల నిరంతరం ఏర్పడుతున్న నిరుద్యోగుల్నీ, పార్టు టైం ఉద్యోగుల్నీ, ఇంకా అలాంటివారిని ఉదాహరణలుగా చూపారు. ఇది ‘కొత్త వర్గం’ కానేకాదు. పెట్టుబడిదారీ విధానం ఎప్పటికప్పుడు, కార్మికులలో ఒక భాగాన్ని నిరుద్యోగంలోనో, చిరుద్యోగంలోనో ఉంచుతుందనీ, వారిని ‘అదనపు జనాభా’గా పెట్టుబడిదారులు భావిస్తారనీ మార్క్సు ఏనాడో చెప్పాడు. వాళ్లకే, ఈనాటి కొత్త ఆర్థికవేత్తలు కొత్త పేర్లు పెడతారు. వ్యాసకర్త భావిస్తున్నట్టు, ఇప్పుడున్నది ‘కొత్త దోపిడీ వ్యవస్థ’ కాదు. దాని రూపమే మారింది తప్ప, సారం ఏమీ మారలేదు. దాన్ని సమూలంగా మార్చడానికి, మార్క్సు చూపిన మార్గాన్ని మించి, ‘‘కొత్త తరహా పోరాటమార్గం’’ ఏదీ లేదు.
కె.రమ
వర్కింగ్ ఎడిటర్, ‘విప్లవ ప్రజాపంథా’
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..