Share News

ధర్మపోరాటాల ధర్మభిక్షం

ABN , Publish Date - Mar 26 , 2026 | 01:06 AM

స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ప్రజల మనిషి ధర్మభిక్షం. ‘‘చీకట్లో నుంచి వెలుతురు వైపు నడవాలన్న నా కోరిక మేరకు ఆ మార్గంలో నా నడకను...

ధర్మపోరాటాల ధర్మభిక్షం

స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ప్రజల మనిషి ధర్మభిక్షం. ‘‘చీకట్లో నుంచి వెలుతురు వైపు నడవాలన్న నా కోరిక మేరకు ఆ మార్గంలో నా నడకను కొనసాగించాను. అప్పుడు నాకు స్వాతంత్ర్య పోరాటంలో ధైర్యంగా ప్రాణాలు ఎదురొడ్డి పోరాడుతున్న వీరయోధులు ఎందరో కనిపించారు. దేశం కోసం స్వాతంత్య్రం, స్వేచ్ఛ, హక్కుల కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల తూటాలకెదురు నిలిచి ప్రాణాలర్పిస్తున్న త్యాగమూర్తుల జీవితాలు కనిపించాయి. అందుకే నేను సైతం పోరాటంలో దూకాను. అమరవీరులు, సమరయోధులు ఎత్తిపెట్టిన స్వాతంత్ర్య నినాదపు జెండా లాగా సింహగర్జన చేశాను’’ అని ధర్మభిక్షం దశాబ్దాల క్రితం మాకు రాజకీయ పాఠశాలలో చెప్పిన ఉద్వేగవంతమైన, స్ఫూర్తిదాయకమైన మాటలు గుర్తుకొస్తున్నాయి.

తెలంగాణ ప్రజలను పోరాట లక్ష్యంతో, తపనతో నిరంకుశత్వాన్ని తరిమికొట్టే వీరులుగా తయారు చేయాలనుకున్నాడు ధర్మభిక్షం. అందుకే నిజాం ఏలుబడిలో నలిగిపోతున్న పల్లెలు, పట్టణాల్లోని ప్రజానీకం వెట్టి, బానిస జీవన పరిస్థితులను అధ్యయనం చేశాడు. వారికి జీవన సత్యాలను చెప్పాడు. జీవించాలంటే పోరాడాలి, నిజాం నిరంకుశత్వ పాలన నుంచి విముక్తులం కావాలి అనే తపనను పుట్టించాడు. వారి చేత తుపాకీ పట్టించాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అశేష జన ప్రవాహాన్ని నడిపించాడు. ఆ పోరాటంలో భాగంగానే తన కుటుంబ నేపథ్యమైన గీత వృత్తి కార్మికుల బతుకు బాగు కోసం కూడా ఆలోచించాడు. ‘‘దున్నేవాడికే భూమి, గీసే వాడికే చెట్టు’’ అనే నినాదాన్ని తెచ్చి, సింహగర్జన చేశాడు. దూరదృష్టితో, శాస్త్రీయమైన ఆలోచనలతో సమాజంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, మానవ హక్కులు, సంక్షేమం, ప్రగతి విరబూయాలని తపించాడు. ఎన్నో త్యాగాలు, పోరాటాలు, లాఠీ దెబ్బలు, జైలు జీవితం, అజ్ఞాతవాసాలు, కారాగార శిక్షలు, అనుభవించిన గొప్ప త్యాగమయి, ఆదర్శనీయుడు ఆయన. లీడర్ అంటే ధర్మభిక్షం లాగా ఉండాలి అని సగర్వంగా ప్రజలు చెప్పుకునేంత గొప్పగా జీవితాన్ని గడిపాడు. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాడు. నిజాం ఏలుబడిలోని పాఠశాల విద్యార్థులను ధైర్యంగా వీధుల్లోకి రప్పించి నిజాం నవాబు పుట్టినరోజు వేడుకలను బహిష్కరించి, నిరసన ప్రదర్శన చేయగలిగేటంత ధైర్యవంతులుగా విద్యార్థులను తయారు చేశాడు. వారిని దేశభక్తులుగా తీర్చిదిద్దాడు. వారికి హాస్టల్‌ను స్థాపించాడు. విద్యార్థుల్లో స్వాతంత్ర్య పోరాట స్పృహను రగిలించడమే కాకుండా తెలంగాణ సాయుధ పోరాటయోధులుగా, నాయకులుగా, సమాజంలో అభ్యుదయవాదులుగా తీర్చిదిద్దటంలో ప్రత్యేక భూమికను పోషించాడు.


గీత పనివారల సంఘం రాష్ట్ర మహాసభలు (బహుశా 1970లో) సూర్యాపేటలో జరిగినప్పుడు ఒక సంఘటన జరిగింది. ధర్మభిక్షం సహచర నాయకుడు తన ఇంట్లో ఆ ఆరు నెలల పసిబిడ్డకు అస్వస్థతగా ఉన్నప్పుడు ఆయన భార్య ‘పిల్లోడికి జరగరానిది జరిగితే ఎట్లా’ అని ఏడ్చిందట. దానికి ఆయన ‘‘నేను రాష్ట్ర మహాసభకు వెళ్తున్నాను. మా నాయకుడు ధర్మభిక్షం చెప్పిన మాటే నాకు ముఖ్యం. అబ్బాయి మంచిగా ఉంటే పేరు పెట్టండి, చచ్చిపోతే బొంద పెట్టండి, నాకు కబురు చేయండి’’ అని భార్యకు చెప్పి సభకు హాజరయ్యాడు. ధర్మభిక్షం తన ఉద్యమ సహచరులలో కూడా అంకితభావం, త్యాగం, తపన కల్పించిన విషయం ఈ ఘటన రుజువు చేస్తుంది.

ప్రజలకు, కార్మికులకు సంఘాలను నిర్మిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీని ధర్మభిక్షం బలోపేతం చేశాడు. దేశవ్యాప్తంగా గీత వృత్తిదారులను ఏకం చేసి భారత గీత పనివారల, కార్మిక సమాఖ్యను స్థాపించాడు. దానికి ఆల్ ఇండియా అధ్యక్షుడిగా సేవలందించాడు. సూర్యాపేట, నకిరేకల్ నియోజకవర్గాలకు తొలి శాసనసభ్యుడిగా, నల్లగొండ శాసనసభ్యునిగా, రెండుమార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. 2011, మార్చి 26న ధర్మభిక్షం మరణించినా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఆయన జయంతిని, వర్ధంతిని పార్టీలకతీతంగా ప్రజలు, కార్మికులు, మహిళలు నిర్వహిస్తున్నారు. ఆయన జీవిత చరిత్ర, పోరాటాలు, త్యాగాలను తెలియజేస్తూ ఎన్నో పుస్తకాలు, పాటలు, కవితలు, క్యాసెట్లు వచ్చాయి.

ఇప్పుడు ధర్మభిక్షం బ్రతికి ఉంటే ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న యుద్ధ వాతావరణం గురించి, అందులో విధ్వంసం అవుతున్న మానవత్వం, నాగరికత, ధన, మాన, ప్రాణ నష్టాల గురించి చర్చలు పెట్టి ప్రపంచ శాంతి సాధన వైపు ప్రజలను కదిలించేవాడు. డ్రగ్స్ మహమ్మారి బారిన పడి మత్తులో కూరుకుపోతున్న యువతను మేల్కొల్పటానికి కార్యాచరణను రూపొందించేవాడు. ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి సమాజ మార్పునకు, ధర్మభిక్షం ఆశయాల సాధనకు పోరాట పటిమ, అంకిత భావంతో కృషి చేయటమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.

కె.వి.ఎల్

(అభ్యుదయ రచయితల సంఘం)

(నేడు ధర్మభిక్షం వర్ధంతి)

ఇవి కూడా చదవండి..

నిలకడగా ఇంధన భద్రత, మరిన్ని నౌకలు వస్తున్నాయి.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం భరోసా

డీజిల్, పెట్రోల్‌కు ఎలాంటి కొరత లేదు: కేంద్రం ప్రకటన

Updated Date - Mar 26 , 2026 | 01:09 AM