ప్రజాస్వామ్యం ఎన్నికలతో మాత్రమే నిలబడదు!
ABN , Publish Date - Aug 06 , 2026 | 03:07 AM
కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం విద్య, ఉపాధి, పరీక్షల పారదర్శకత, పరిపాలనా జవాబుదారీతనం వంటి అంశాలపై ప్రారంభమైన సామాజిక నిరసనగా ప్రచారంలోకి వచ్చింది. రాజ్యాంగపరంగా పరిశీలిస్తే–
కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం విద్య, ఉపాధి, పరీక్షల పారదర్శకత, పరిపాలనా జవాబుదారీతనం వంటి అంశాలపై ప్రారంభమైన సామాజిక నిరసనగా ప్రచారంలోకి వచ్చింది. రాజ్యాంగపరంగా పరిశీలిస్తే– ప్రజలకు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు ఆర్టికల్ 19(1)(a) కింద భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగం. అలాగే ఆర్టికల్ 19(1)(b) శాంతియుత సమావేశాల హక్కును, ఆర్టికల్ 19(1)(c) సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కును గుర్తిస్తుంది. అయితే రాజ్యాంగం హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్దేశిస్తుంది. శాంతియుత నిరసన రాజ్యాంగబద్ధమైన హక్కు. అయినా హింస, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఇతరుల హక్కులకు భంగం కలిగించే చర్యలు రాజ్యాంగ రక్షణ పొందవు. అదే విధంగా, ప్రభుత్వం కూడా ప్రజా శాంతి పేరుతో ప్రతి నిరసనను అణచివేయలేదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, పౌరుల మధ్య సంబంధం శక్తి–ప్రయోగంపై కాకుండా రాజ్యాంగబద్ధమైన సంభాషణపై ఆధారపడాలి. విద్యా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేకపోతే అది వ్యక్తిగత నష్టమే కాదు; రాజ్యాంగ పరిపాలనపై విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది.
ప్రభుత్వం ఏ నిరసననైనా చట్టపరంగా నియంత్రించవచ్చు. కానీ ఆ నియంత్రణ అవసరమైనంత మాత్రమే ఉండాలి. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ‘సముచితత్వం’ అనే రాజ్యాంగ సూత్రాన్ని ప్రముఖంగా గుర్తించింది. బలప్రయోగం చివరి మార్గం కావాలి; మొదటి ప్రతిస్పందన కాదు. ఒకవేళ శాంతియుత నిరసనకారులపై అధిక బలప్రయోగం జరిగితే అది స్వతంత్ర న్యాయపరమైన పరిశీలనకు లోబడి ఉండాలి. అదే విధంగా, నిరసనకారులు కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి కూడా చట్టమే వర్తించాలి. న్యాయపాలన అంటే ప్రభుత్వం చట్టానికి లోబడి ఉండటమే కాదు, పౌరులు కూడా చట్టాన్ని గౌరవించడమే.
కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని కేవలం ఒక రాజకీయ సంఘటనగా చూడటం సరికాదు. ఇది యువతలో పెరుగుతున్న ఆందోళనలు, ఉపాధి భద్రత, విద్యా న్యాయం, ప్రభుత్వ జవాబుదారీతనం, ప్రజాస్వామ్య భాగస్వామ్యం వంటి విస్తృత ప్రశ్నలను లేవనెత్తిన సామాజిక ప్రక్రియగా అధ్యయనం చేయవచ్చు. ఉద్యమం విజయవంతమైందా లేదా అన్నదాని కంటే, అది ప్రజాస్వామ్య చర్చను ఎంతవరకు విస్తరించింది అన్నదే రాజ్యాంగపరంగా ముఖ్యమైన ప్రమాణం.
పౌర హక్కుల దృక్పథంలో చూస్తే, ప్రభుత్వం ప్రజల శత్రువు కాదు; అలాగే ప్రజలు కూడా ప్రభుత్వ శత్రువులు కాదు. ప్రభుత్వం ప్రజలను భయపెట్టి పాలన చేయకూడదు. రాజ్యం ప్రజలపై హింసకు పాల్పడకూడదు. ప్రజలు శాంతియుత పద్ధతిలో ఉద్యమాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు వారిని శత్రువులుగా పరిగణించి హింసకు పాల్పడటం ప్రజాస్వామ్యం కాదు. ప్రభుత్వం విమర్శను వినాలి; ప్రజలు రాజ్యాంగ మార్గాన్ని అనుసరించాలి; న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాలి; మీడియా వాస్తవాలను ధ్రువీకరించాలి. ఈ నాలుగు స్తంభాలు బలంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం జీవిస్తుంది.
ఈ ఉద్యమం మనకు ఇచ్చిన అతిపెద్ద పాఠం ఏమిటంటే– ప్రజాస్వామ్యం ఎన్నికలతో మాత్రమే నిలబడదు. ప్రజల అప్రమత్తత, రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధత, ప్రభుత్వ జవాబుదారీతనం, పౌర హక్కుల పరిరక్షణ– ఈ నాలుగు అంశాలు కలిసినప్పుడే ప్రజాస్వామ్యం సజీవంగా ఉంటుంది. రాజ్యాంగం అధికారాన్ని సృష్టించింది; కానీ ఆ అధికారానికి పరిమితులను కూడా విధించింది. ప్రజలకు హక్కులను ఇచ్చింది; అదే సమయంలో బాధ్యతలను కూడా గుర్తుచేసింది. ఈ సమతుల్యతను కాపాడటం ప్రతి పౌరుడి, ప్రతి ప్రభుత్వ సంస్థ రాజ్యాంగ విధి.
నంబూరి శ్రీమన్నారాయణ
సుప్రీంకోర్టు అడ్వకేట్
ఇవీ చదవండి:
'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్ జీకి రూ.2 వేల కోట్లు