Share News

‘స్త్రీనిధి’లో జీవో 86ను అమలుచేయాలి

ABN , Publish Date - Jun 05 , 2026 | 01:09 AM

గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదల కాలేదు. దీంతో నిరుద్యోగులు నష్టపోయారని భావించిన ప్రస్తుత ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి అభ్యర్థుల...

‘స్త్రీనిధి’లో జీవో 86ను అమలుచేయాలి

గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదల కాలేదు. దీంతో నిరుద్యోగులు నష్టపోయారని భావించిన ప్రస్తుత ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితిని 44 సంవత్సరాలకు పెంచుతూ జీవో 86ను జారీ చేయడం స్వాగతించదగ్గ విషయం. అయితే, స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల నియామకం కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితిని కేవలం 30ఏళ్లుగా నిర్ణయించడం నిరుద్యోగ యువతను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నిర్ణయం కారణంగా.. గ్రామీణ ప్రాంతాలకు చెందిన, పేద–మధ్యతరగతి వర్గాల్లోని అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు.

స్త్రీనిధి ఉద్యోగాల దరఖాస్తుకు మే 29ని తుది గడువుగా నిర్ణయించడం కూడా అభ్యర్థుల్లో అసంతృప్తిని కలిగించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, సమాచారం అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మందికి ఈ నోటిఫికేషన్ గురించి ఆలస్యంగా తెలిసింది. దీంతో అర్హత ఉన్నప్పటికీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఎంతోమంది నిరుద్యోగులు కోల్పోయారు. కాబట్టి కనీసం మరో 15 రోజుల పాటు దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించాలి. అలాగే, తెలంగాణ ప్రభుత్వం జీవో నెం.33 ప్రకారం.. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత స్త్రీనిధి నియామకాలలో.. పెరిగిన ఈ రిజర్వేషన్లను అమలు చేయాలి. వీటితో పాటు స్త్రీనిధి సంస్థలో ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

– మాణిక్ డోంగ్రే

ఇవి కూడా చదవండి...

రెండేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరించండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం

బలమైన భారత్‌ కోసం యువత ఎదురుచూపు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 01:09 AM