Share News

ఇది కుట్రపూరిత డీలిమిటేషన్!

ABN , Publish Date - Apr 17 , 2026 | 02:06 AM

భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతి వారసత్వంతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం కీర్తించబడుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాల మధ్య,...

ఇది కుట్రపూరిత డీలిమిటేషన్!

భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతి వారసత్వంతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం కీర్తించబడుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాల మధ్య, దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది. ఇంతకాలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్, ఐటీ, ఈడీ సంస్థలను దుర్వినియోగపరచిన నరేంద్ర మోదీ సర్కారు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లును అడ్డుపెట్టుకొని అశాస్త్రీయంగా నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు సిద్ధమైంది.

దేశంలో మహిళా రిజర్వేష‌న్ల బిల్లును కాంగ్రెస్‌తో సహా ఏ ఇతర పార్టీలూ వ్యతిరేకించడం లేదు. అయితే ఈ బిల్లును అడ్డం పెట్టుకొని దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన పేరిట‌ బీజేపీ కుట్రలకు తెరదీసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వీటిపై సమగ్రంగా చర్చించి స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. మహిళల సాధికారతకు కట్టుబడిన కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ విషయంలో మాత్రం దేశ సమగ్రతను, సమతౌల్యాన్ని కాపాడాలని కోరుతోంది.

2024 లోక్‌సభ ఎన్నికల ముందు 2023లో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని చేసి చేతులు దులుపుకుంది బీజేపీ. మహిళా రిజర్వేషన్లను 2024 ఎన్నికల‌ నుంచే అమలు చేయాలని కాంగ్రెస్ కోరినప్పటికీ పెడచెవిన పెట్టింది. 2026 జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేసి అనంతరం మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని కప్పదాటు వైఖరిని ప్రదర్శించింది. 2021లో చేయాల్సిన జనగణనను కోవిడ్ కారణంగా వాయిదా వేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ తాత్సారం చేసింది. ఇప్పుడు హడావిడిగా జనాభా లెక్కలు తేలకముందే 50శాతం పెంపుతో నియోజకవర్గాల పునర్విభజన చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో కుట్ర దాగి ఉంది. అది బయటపడకుండా మహిళా రిజర్వేషన్లకు లింకు పెట్టి పొలిటికల్ గేమ్ ప్రారంభించింది.

ఉత్తరాది హిందీ బెల్ట్‌ పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీ ప్రభుత్వం 50శాతం సీట్ల పెంపు ప్రతిపాదనతో డీలిమిటేషన్ చేసి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. దేశంలో లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కు పెంచాలని నిర్ణయించింది. ఉదాహరణకు ప్రస్తుతం 20 లోక్‌సభ స్థానాలున్న కేరళకు, 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌కు మధ్య సీట్ల వ్యత్యాసం 60 లోక్‌సభ స్థానాలు. ప్రస్తుతం ప్రతిపాదించినట్టు యాభై శాతం ప్రకారమైతే కేరళకు 30, యూపీకి 120 సీట్లు వస్తాయి. అంటే రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం 90 స్థానాలుగా ఉంటుంది. మొత్తం మీద దక్షిణాదిలో 130 నుంచి 195 స్థానాలయితే, ఉత్తరాదిలో 413 నుంచి 621 స్థానాలవుతాయి. రెండు ప్రాంతాల మధ్య అంతరం భారీ స్థాయిలో ఉండి, దేశంలో ఉత్తరాది ప్రాంతాల ఆధిపత్యం పెరుగుతుంది. ఇప్పటికే దక్షిణాదిపై చిన్న చూపుతో ఉన్న బీజేపీ మరింత వివక్ష చూపించే అవకాశాలు పెరుగుతాయి. కేవలం దక్షిణాది ప్రాంతాలే గాక, దేశంలోని చిన్న రాష్ట్రాలన్నీ ఈ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక స్థానాలు గెలిచి అన్ని రాష్ట్రాలపై పెత్తనం చలాయించేందుకు నియోజకవర్గాల డీలిమిటేషన్‌ను బీజేపీ అస్త్రంగా చేసుకుంటుంది.


దేశంలో పదేళ్లకోసారి జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని స్వాతంత్య్రానంతరం పునర్విభజన కమిషన్ల ఏర్పాటు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. అందుకు తగ్గట్టు 1951, 1962, 1972లో కమిషన్లు ఏర్పాటు చేసి లోక్‌సభ స్థానాలను 494 నుంచి 522కు, అనంతరం 543కు పెంచారు. ఇదే సమయంలో జనాభా నియంత్రణ కోసం 1970లో నాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించడంలో దేశంలో జనాభా కట్టడి ఫలితాలిచ్చినా, ప్రాంతాల మధ్య సమతుల్యం దెబ్బతిన్నది. యూపీ, బిహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా కట్టడి విఫలమవగా, దక్షిణాది రాష్ట్రాలన్నీ జనాభా నియంత్రణలో సఫలమైనాయి. అయితే ఇప్పుడు అదే అంశం దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారడం విచారకరం. జనాభాపరంగా ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరిగి, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశాలుండడంతో– నాటి ప్రధాని ఇందిరాగాంధీ ముందు చూపుతో 1976లో 42వ రాజ్యాంగ సవరణతోను, తర్వాత వాజపేయి ప్రభుత్వం 2002లో 84వ రాజ్యాంగ సవరణతోను జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపును అడ్డుకున్నారు. కేవలం భౌగోళిక సరిహద్దుల మార్పుతోనే నియోజకవర్గాల పునర్విభజన చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనతో దేశంలో సమతుల్యం దెబ్బతింటుందని గుర్తించిన ఇందిరాగాంధీ, వాజపేయి ప్రతిపాదనలను ఇప్పుడు మోదీ ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తోంది.

రాజకీయ సమానత్వం లేకుండా తొందరపాటు నిర్ణయంతో సంఖ్యాపరంగా దేశంలో నియోజకవర్గాల డీలిమిటేషన్ చేయాలన్న ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం. దేశంలోని అన్ని రాష్ట్రాల‌తో, రాజకీయ పార్టీలతో, మేధావులతో, ప్రజాసంఘాలతో చర్చించకుండా హడావిడిగా గందరగోళంగా ఇంతటి కీలక నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఏప్రిల్ 16 నుంచి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్టు భారీగా ప్రచారం చేస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వం ఇదే ముసుగులో డీలిమిటేషన్ కుట్రకు పాల్పడుతోంది. ఒకపక్క కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే ఈ రెండు బిల్లులను తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధం. కనీసం ఎన్నికలు ముగిసేవరకైనా వాయిదా వేయాలని కోరుతున్నా మోదీ ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకెళ్లడంలో మోసపూరిత కుట్రలు దాగున్నాయి.


మహిళలకు 33శాతం రిజర్వేషన్లపై కూడా బీజేపీది మొసలికన్నీరే. 2024 ఎన్నికల నుంచి అమలు చేయమని కోరితే పట్టించుకోలేదు. మహిళా రిజర్వేషన్లలో కాంగ్రెస్ పార్టీ పాత్ర చరిత్రాత్మకమైనది. 1990లోనే రాజీవ్‌గాంధీ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసింది. పీవీ నరసింహారావు ప్రభుత్వం 73, 74 రాజ్యాంగ సవరణలు చేయడంతో ప్రస్తుతం గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో 14 లక్షలకు పైగా మహిళా ప్రతినిధులు ఎన్నికై సేవలందిస్తున్నారు. 2010లో మన్మోహన్‌సింగ్ ప్రభుత్వ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఆమోదించడం చరిత్రాత్మకం. కాబట్టి, బిల్లు ప్రస్తుతం ఈ దశకు చేరుకుందంటే ఆ ఘనత కాంగ్రెస్ పార్టీదే. అయితే డీలిమిటేషన్‌పై బీజేపీ కుట్రలను కాంగ్రెస్ పార్టీ బట్టబయలు చేస్తుంటే మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలు రెండూ వేర్వేరని కాంగ్రెస్ చెబుతున్న వాస్తవాలను ప్రజలు గ్రహించి బీజేపీకి తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయం.

కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారిత కోసం మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లుపై సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నది. అదే సమయంలో దేశంలో ప్రాంతాల మధ్య సమతుల్యత దెబ్బతినకుండా, అన్ని రాష్ట్రాలు సమాన స్థాయిలో అభివృద్ధి చెందేలా, పారదర్శకంగా నియోజకవర్గాల డీలిమిటేషన్ జరగాలని కోరుతున్నది. ఈ అంశంలో బీజేపీ నియంతృత్వ వైఖరిని అడ్డుకునేందుకు పోరాటానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్‌తో ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి రావాలి.

బి. మహేశ్‌కుమార్‌గౌడ్

టీపీసీసీ అధ్యక్షులు

ఇవీ చదవండి:

మహిళా రిజర్వేషన్ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్య: ఒవైసీ

డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిష్ఠంభన.. ఎంపీలంతా హాజరుకావాలని కాంగ్రెస్ విజ్ఞప్తి

Updated Date - Apr 17 , 2026 | 02:06 AM