Share News

‘డీలిమిటేషన్’పై వక్రీకరణలు!

ABN , Publish Date - May 14 , 2026 | 12:55 AM

‘డీలిమిటేషన్: దక్షిణాది రాష్ట్రాల సెల్ఫ్‌గోల్’ శీర్షికతో 28.4.2026 తేదీన ఆంధ్రజ్యోతిలో డా. జయప్రకాశ్ నారాయణ రాసిన వ్యాసంలో, ‘‘1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతి రాష్ట్రానికీ కేటాయించిన సీట్లను 25 ఏళ్ల పాటు...

‘డీలిమిటేషన్’పై వక్రీకరణలు!

‘డీలిమిటేషన్: దక్షిణాది రాష్ట్రాల సెల్ఫ్‌గోల్’ శీర్షికతో 28.4.2026 తేదీన ఆంధ్రజ్యోతిలో డా. జయప్రకాశ్ నారాయణ రాసిన వ్యాసంలో, ‘‘1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతి రాష్ట్రానికీ కేటాయించిన సీట్లను 25 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగించారు. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆ చర్య తీసుకున్నారు. 2001లో సీట్ల సంఖ్యలో ఆ స్తంభన వ్యవధి ముగిసింది. అయితే రాష్ట్రాలకు కేటాయించిన సీట్లలో యథాతథ స్థితిని మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలని అప్పటి వాజపేయి ప్రభుత్వాన్ని ఒప్పించటంలో నేను కీలకపాత్ర పోషించాను’’ అని రాశారు. కానీ, ఇప్పుడు ఆయన వైఖరి మార్చుకోవడానికి ప్రస్తావించిన అంశాలు సమర్థనీయంగా లేవు. 1976 నుండి 2025 వరకు యాభై ఏళ్లలో వచ్చిన మార్పు ఏంటో కూడా గమనించాలి కదా!

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కుటుంబ నియంత్రణ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేసిన రాష్ట్రాల్లో జనాభా తగ్గింది, అమలు చేయని రాష్ట్రాల్లో జనాభా పెరిగింది. ఈ వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన 2011 నాటి జనగణన గణాంకాలే వెల్లడించాయి. తాజాగా 2026 జనగణన గణాంకాలు అధికారికంగా వెల్లడైన మీదట రాష్ట్రాలవారీగా జనాభా పెరుగుదల లేదా తరుగుదలపై స్పష్టత వస్తుంది. జనాభా ప్రాతిపదికపై లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేయాలని భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది. దాన్ని పరిగణనలో ఉంచుకునే 1976లో ఇందిరాగాంధీ (కాంగ్రెస్), 2001లో వాజ్‌పాయి (బీజేపీ) ప్రభుత్వాలు దేశ ప్రయోజనాలు, సమస్య సంక్లిష్టత దృష్ట్యా హేతుబద్ధమైన నిర్ణయం తీసుకుని యథాతథ స్థితిని కొనసాగించాయి. 1976–2001 మధ్య కాలం కంటే 2001–25 మధ్య కాలంలో రాష్ట్రాలవారీగా జనాభా పెరుగుదల – తరుగుదల విషయంలో మరింత ఎక్కువ తారతమ్యాలు ఉండవచ్చు. ఇది విస్మరించలేని వాస్తవం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ సమతుల్యత, సామాజిక న్యాయం... ఈ దృక్కోణంతో రాజకీయాలకు అతీతంగా డీలిమిటేషన్ అంశంపై నిర్ణయం తీసుకోవాలి.

ఈ పూర్వరంగంలో జయప్రకాష్ నారాయణ ఒక చిట్కా పరిష్కారాన్ని సూచించారు: ‘‘కొన్నేళ్లలో వలసలు అసమతుల్యతలను సరిచేస్తాయి. ఇప్పటికే కోట్లాది కార్మికులు దక్షిణాదిన, పశ్చిమ, ఉత్తరాదిన పలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్ని నిర్మిస్తున్నారు, సుస్థిరపరుస్తున్నారు. ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లటాన్ని మనం సులభతరం చేయాలి. వారు ఎక్కడుంటే అదే వారి రాష్ట్రం కావాలి. అలా వారి జీవితాల్ని సౌకర్యవంతంగా, సురక్షితంగా మార్చాలి. ఆ మార్పు మన జనాభా సవాళ్లను పరిష్కరిస్తుంది.’’ ఇదీ వారు వ్యక్తం చేసిన అభిప్రాయం.


అంటే, జనాభా పెరిగిన రాష్ట్రాల నుండి జనాభా తగ్గిన రాష్ట్రాలకు వలసలు పెరిగితే, వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తే, కాలచక్రంలో సమస్య పరిష్కారం అవుతుందని వారి అభిప్రాయం. ఇది వినడానికి బానే ఉంది. మరి హైదరాబాద్‌ నుండి లండన్ – వాషింగ్టన్ వరకు వలసదారులకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలను, తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వలసదారులను అవమానిస్తూ తన ‘ట్రూత్ సోషల్’లో షేర్ చేసిన పోస్ట్‌ను జయప్రకాష్ నారాయణ ఎలా చూస్తున్నారు? అమెరికాలో ఇటీవల 3,300 కేంద్రాలలో జరిగిన ‘నో కింగ్స్’ ర్యాలీల్లో పాల్గొన్న దాదాపు 80 లక్షల మందిలో అత్యధికులు వలసదారులే. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వలసదారుల సమస్య. ఆంధ్రప్రదేశ్‌లో మారుమూల గ్రామాల్లో కూడా బిహార్, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారే వ్యవసాయ కూలీలుగా మొదలుకొని హోటల్‌ పని దాకా పనిచేస్తున్నారు. దక్షిణాది నుంచి వలస వెళ్ళిన వారికి వ్యతిరేకంగా 1960–70లలో ముంబై కేంద్రంగా శివసేన చేసిన విద్వేషపూరితమైన ఆందోళనా చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలాంటి ఆందోళనలు చిన్నవో పెద్దవో దేశంలో పలు రాష్ట్రాలలో జరుగుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు దారితీసిన కారణాల్లో ఇది కూడా ఒకటి.

మోదీ ప్రభుత్వం ‘‘జనాభా పరంగా సీట్లు కోల్పోతున్న ఏడు రాష్ట్రాలకూ ఊహించని బహుమతిని ప్రతిపాదించింది’’ అని జయప్రకాష్‌ నారాయణ అంటున్నారు. లోక్‌సభలో మాట్లాడిన సందర్భంలో ప్రధానమంత్రి మోదీ, హోం మంత్రి అమిత్ షా చెప్పిన మాటలు జయప్రకాష్ నారాయణగారికి ఈ విశ్వాసం కలిగించి ఉండవచ్చు. కానీ అవి కేవలం నోటి మాటలే, బిల్లులో ప్రస్తావించలేదు. సమకాలీన చరిత్ర ఏం చెబుతోంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడానికి నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ‘ప్రత్యేక తరగతి హోదా’ కల్పిస్తామని వాగ్దానం చేస్తూ రాతపూర్వక ప్రకటనను పెద్దల సభలో చదివి వినిపించారు. సభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్తీకరణ చట్టం–2014లోనే కడప ఉక్కు కర్మాగారం, ఓడ రేవు, వెనుకబడిన రాయలసీమ – ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అభివృద్ధి ప్యాకేజీ, రాజధాని నిర్మాణానికి – మౌలిక సదుపాయాల కల్పనకు సంపూర్ణంగా ఆర్థిక తోడ్పాటు, పారిశ్రామికాభివృద్ధికి రాయితీలు... వగైరా వాగ్దానలు చేశారు. ఆచరణలో వీటన్నింటినీ ఎగ్గొట్టిన మోదీ ప్రభుత్వంపై జయప్రకాష్ నారాయణగారికి ఎంత విశ్వాసమో! ఇది చూస్తే ‘‘వాగ్దానం ఎందరో అవివేకులను తృప్తిపరుస్తుంది’’ అనే తెలుగు సామెత గుర్తుకు వచ్చింది. ఇప్పుడు దానికి ఒక సవరణ: ‘‘మేకవన్నె పులి తరహా రాజకీయ నేతల వాగ్దానాలు మేధావులను కూడా సంతృప్తిపరుస్తాయి’’.


మహిళా రిజర్వేషన్స్ అమలు అంశాన్ని ‘డిలిమిటేషన్’తో ఎందుకు ముడిపెట్టారన్నదే అసలు ప్రశ్న. దానికి జయప్రకాష్ నారాయణ వ్యాసంలో సముచితమైన ప్రస్తావనే లేదు. మరొక ముఖ్య విషయం చట్టసభల నాణ్యతా ప్రమాణాలు. లోక్‌సభ సభ్యుల సంఖ్యను 550 (రాజ్యాంగం గరిష్ఠంగా అనుమతించిన సంఖ్య) నుండి 850కి పెంచడం వల్ల ‘‘మంది ఎక్కువైతే మజ్జిగ పలచన’’ అన్న సామెత తీరుగా లోక్‌సభ పనితీరు మరింత దిగజారుతుందేమోనన్న భావన వ్యక్తమవుతున్నది. సమగ్ర ఎన్నికల సంస్కరణలు అత్యవసరం. దామాషా ఎన్నికల విధానంతో సహా పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. 2023లోనే చట్టం చేసిన 33శాతం మహిళా రిజర్వేషన్స్ అమలును డిలిమిటేషన్‌తో పాటు లోక్‌సభ సభ్యుల సంఖ్య పెంపుదలతో ముడిపెట్టడంలోని మతలబు ఏంటి? దానిపై జయప్రకాశ్ నారాయణగారి డొంకతిరుగుడు సమర్థన ఆశ్చర్యాన్ని కలిగించింది.

టి. లక్ష్మీనారాయణ

ఇవి కూడా చదవండి..

ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే.. : అమెరికా ఉపాధ్యక్షుడు

ఐఆర్‌జీసీకి నిధులు ఎలా వస్తున్నాయి.. చెబితే రూ.145 కోట్లు ఇస్తామంటున్న అమెరికా..

Updated Date - May 14 , 2026 | 12:55 AM