Share News

అలసత్వానికి ప్రతీకే... ఢిల్లీ మంటలు!

ABN , Publish Date - Jun 06 , 2026 | 01:51 AM

ఢిల్లీలో మరోసారి మృత్యుఘోష మారుమ్రోగింది. మాలవీయ నగర్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, దేశ రాజధానిలో పాలకుల, అధికారుల నిర్లక్ష్య వైఖరికి...

అలసత్వానికి ప్రతీకే... ఢిల్లీ మంటలు!

ఢిల్లీలో మరోసారి మృత్యుఘోష మారుమ్రోగింది. మాలవీయ నగర్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, దేశ రాజధానిలో పాలకుల, అధికారుల నిర్లక్ష్య వైఖరికి దర్పణం పట్టిన ఒక వ్యవస్థాగత వైఫల్యం. గతంలో జరిగిన ముండ్కా, అనాజ్ మండీ అగ్ని ప్రమాదాలు దేశాన్ని కుదిపేశాయి. కానీ అవి పునరావృతం కాకుండా పాలకులు చిత్తశుద్ధితో చేసిందేమిటి? ప్రమాదం జరిగిన ప్రతిసారీ కొన్ని రోజుల పాటు తనిఖీలు చేయడం, ఆ తర్వాత మామూలు స్థితికి రావడం... ఇంతేనా?!

ప్రస్తుత మాలవీయ నగర్ ఘటనలో కూడా నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఆరు గదులకు అనుమతి ఉన్న భవనంలో, 20 గదులను నడపడం అధికారులకు కనబడలేదా? తనిఖీలు కేవలం మామూళ్ల వసూలుకు మాత్రమే పరిమితం కావడం వల్లనే, పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు ఇలా నిప్పుల పాలవుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత ప్రకటించే ఎక్స్‌గ్రేషియా, మరణించిన వారి ప్రాణాలను తిరిగి తెస్తుందా? వారు చేయాల్సింది మరణానంతరం పరిహారం ఇవ్వడం కాదు, మరణించకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం. ప్రతిసారీ అగ్నిప్రమాదం తర్వాతే తనిఖీలు ఎందుకు చేస్తారు? నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయరు?

ఢిల్లీలో ఇటువంటి ఘటనలు పదేపదే జరగడానికి కారణం, నిబంధనలు పాటించని భవనాల యజమానులకు ఉండే రాజకీయ రక్షణ. ఒక్క బాధ్యుడైన అధికారిపైనా కఠిన శిక్ష పడకపోవడం వల్లనే అధికారుల్లో భయం ఉండటం లేదు. పరిస్థితి మారాలి. పాలకుల చిత్తశుద్ధి కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదు. ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ప్రతి భవనంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. అక్రమ కట్టడాలకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రజల ప్రాణాలకు విలువుంటుంది.

పురుషోత్తం నారగౌని

ఇవి కూడా చదవండి..

టీఎంసీలో చిచ్చు... రెబల్ ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీల మంతనాలు

కాంగ్రెస్‌కు జేఎంఎం ఝలక్.. రెండు రాజ్యసభ సీట్లలో పోటీకి కసరత్తు

Updated Date - Jun 06 , 2026 | 01:51 AM