Share News

ఒక క్యూబన్‌ తల్లి ఆవేదన!

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:52 AM

ప్రపంచంలోని తల్లులందరికీ, సరిహద్దులు లేని వైద్యులకూ, స్వాభిమానమున్న జర్నలిస్టులకూ, మానవత్వాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికీ నా విన్నపం: ప్రపంచమంతా చూడనట్లు...

ఒక క్యూబన్‌ తల్లి ఆవేదన!

క్యూబా ద్వీపం నుంచి ప్రపంచానికి ఒక బహిరంగ లేఖ.

పంపినవారు: ఒక సాధారణ క్యూబా మహిళ.

స్వీకర్తలు: ప్రపంచ ప్రజలు, మాతృమూర్తులు, మానవతా సంస్థలు, మాకై న్యాయం కోరే ప్రభుత్వాలు.

పీఠిక: ఒక నిశ్శబ్ద నేరంపై నా గొంతు విప్పుతున్నాను.

ప్రపంచంలోని తల్లులందరికీ, సరిహద్దులు లేని వైద్యులకూ, స్వాభిమానమున్న జర్నలిస్టులకూ, మానవత్వాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికీ నా విన్నపం: ప్రపంచమంతా చూడనట్లు నటిస్తున్న ఒక మహా నేరాన్ని నేను ఖండిస్తున్నాను.

నా పేరు, లక్షలాది మంది పేర్ల లాగే ఓ మామూలు పేరు. నాకు ప్రసిద్ధి లేదు, పెద్ద పదవి లేదు. నేను ఒక మామూలు క్యూబన్‌ పౌరురాలిని. ఒక కూతురిని, ఒక సోదరిని, ఒక దేశభక్తురాలిని. గాయపడిన హృదయంతో, వణుకుతున్న చేతులతో ఈ లేఖ రాస్తున్నాను. ఈ రోజు చమురు సరఫరా నిలిపివేత వల్ల క్యూబా ఎదుర్కొంటున్నది కేవలం ఒక సంక్షోభం కాదు; ఇది వాషింగ్టన్‌ చాలా ప్రణాళికాబద్ధంగా, నింపాదిగా చేస్తున్న హత్య.

మా వృద్ధుల తరఫున నా ఆరోపణ! క్యూబాలో వృద్ధులు హృదయ సంబంధిత వ్యాధులతో, రక్తపోటుతో, మధుమేహంతో అకాల మరణం పొందుతున్నారు. ఆంక్షల వల్ల వారికి మందులు అందడం లేదు. ఇది వనరుల కొరత కాదు, ఉద్దేశపూర్వక నిషేధం. మందులు అమ్మే కంపెనీలను బెదిరిస్తున్నారు. దీనిపై ఆయా దేశాలు నిశ్శబ్దం వహిస్తున్నాయి. సామాన్య క్యూబా తాత గుండె నొప్పితో మరణిస్తున్నాడు. ఆంక్షలు ముందు చెప్పి విధిస్తారు, కానీ చావు ముందు చెప్పి రాదు!

మా పసిబిడ్డల తరఫున నా ఆరోపణ! ఇంధనం లేక ఇంక్యూబేటర్లు ఆగిపోతున్నాయి. పుట్టిన శిశువులు ఊపిరి కోసం పోరాడుతున్నారు. వాషింగ్టన్‌లో ఒక అధికారి సంతకం చేసిన ఆదేశానికి, మా బిడ్డల ప్రాణాల కంటే ఎక్కువ విలువ ఏర్పడిపోయింది. ఇలాంటి స్థితిలో అంతర్జాతీయ మద్దతు ఎక్కడ! బాలల సంక్షేమ సంస్థలు ఎక్కడ! క్యూబన్‌ పిల్లలకు జీవించే హక్కు లేదా!

ఉద్దేశపూర్వకంగా మోపిన ఆకలిపై నా ఆరోపణ! క్యూబాలో నేడు ఆకలి అనేది యాదృచ్ఛికం కాదు. ఇది అరవై ఏళ్లుగా కొనసాగుతున్న రాజకీయ వ్యూహం. దీనిని వారు ‘ఆర్థిక ఆంక్షలు’ అంటారు, కానీ నేను దీనిని ‘ఆకలి ద్వారా ఉగ్రవాదం’ అంటాను.

మా వైద్యుల తరఫున నా ఆరోపణ! కోవిడ్‌ మహమ్మారి కోరలు చాచిన సమయంలో ప్రపంచాన్ని కాపాడిన మా వైద్యులకు ఈ రోజు సిరంజీలు లేవు, అనస్థీషియా లేదు. స్వయంగా ఐదు వ్యాక్సిన్లు తయారు చేసిన మా శాస్త్రవేత్తల ప్రతిభను ఆంక్షలతో అణచివేస్తున్నారు.


ప్రపంచానికి నా పిలుపు!

క్యూబా దానం కోరటం లేదు, సైనిక సహాయం కోరటం లేదు! మేము కోరుతున్నది కేవలం న్యాయం. మా ప్రజల బాధను సాధారణంగా చూడటం ఆపండి. ‘‘ఆంక్షల’’ను వాటి అసలు పేరుతో పిలవండి, అవి ‘‘మానవాళిపై జరుగుతున్న నేరం’’.

చివరి హెచ్చరిక! నేడు మౌనం పాటిస్తున్న ప్రభుత్వాలకు: చరిత్ర మిమ్ములను బోనులో నిలబెడుతుంది. అబద్ధాలు చెప్పే మీడియాకు: ఏదో ఒక పగులు లోంచి నిజం బయటపడుతుంది. ఆంక్షలపై సంతకాలు చేసేవారికి: మేము మర్చిపోము, మిమ్మల్ని క్షమించము.

నేను ఒక సాధారణ మహిళగా చెబుతున్నాను: నేను లొంగను. ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే, వీటిని ప్రపంచమంతా వినబడేలా చేయండి. ఇది సరదా కోసం రాసిన వ్యాసం కాదు, ఆవేదనతో కూడిన తల్లి కేక! కేకలు ఎప్పుడూ మౌనంగా ఉండవు.. అవి జనసంద్రంగా మారి తీరుతాయి.

మా గొంతుకగా మారండి!

ఈ ఖండనను ప్రపంచానికి వినిపించండి!

సహృదయంతో,

ఒక క్యూబా మహిళ

ఇవి కూడా చదవండి..

5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నాం.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదు: ఇరాన్

Updated Date - Mar 25 , 2026 | 04:52 AM