Share News

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు!

ABN , Publish Date - Aug 11 , 2026 | 01:51 AM

నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ వీధుల్లోకి వచ్చిన విద్యార్థుల ఆలోచనల్లో ఉందా? లేక ప్రజల తరఫున చట్టాలు చేయాల్సిన పార్లమెంట్, అసెంబ్లీలను నేరాల నుంచి తప్పించుకునే కవచాలుగా..

కాలేజీల్లో కాదు, చట్టసభల్లోనే అసలు నేరస్థులు!

నిజమైన విద్రోహం ఎక్కడుంది? దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ వీధుల్లోకి వచ్చిన విద్యార్థుల ఆలోచనల్లో ఉందా? లేక ప్రజల తరఫున చట్టాలు చేయాల్సిన పార్లమెంట్, అసెంబ్లీలను నేరాల నుంచి తప్పించుకునే కవచాలుగా మార్చుకున్న రాజకీయ నాయకుల్లో ఉందా?

కాక్రోచ్‌ జనతా పార్టీ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను పాలకులు, వారి అనుయాయులు ‘క్రిమినల్స్’, ‘దేశద్రోహులు’, ‘విద్రోహశక్తులు’గా ముద్రవేశారు. ఉద్యమాన్ని అణచివేయడానికి పోలీసు బలగాలు, కేసులు, అరెస్టులు, ప్రచార యంత్రాంగం– అన్నింటినీ రంగంలోకి దించారు. కానీ అదే సమయంలో అసలు నేర చరిత్ర కలిగినవారు ఎక్కడ ఉన్నారన్న ప్రశ్నను పూర్తిగా పక్కన పెట్టేశారు.

దేశాన్ని కాపాడాల్సిన చట్టసభల్లోనే నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు ఉండటం ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు. ఉద్యమం చేస్తున్న యువతను నేరస్థులుగా చిత్రీకరించడం కంటే ఇది మరింత ప్రమాదకరమైన వాస్తవం.

ప్రజాస్వామ్య దేవాలయాలుగా భావించే పార్లమెంటు, శాసనసభల వేదికలపై ప్రజాప్రతినిధులుగా వెలుగుతున్న వారి అసలు రంగు ఏమిటో తాజా గణాంకాలు నిగ్గు తేలుస్తున్నాయి. పవిత్రమైన శాసనాలు చేసే స్థానాల్లో క్రిమినల్ కేసులు ఉన్నవారు, హత్య, హత్యాయత్నం, మహిళలపై దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు సురక్షితంగా కొలువై ఉన్నారు. ప్రజాప్రతినిధుల నేర చరిత్రను ప్రశ్నించని పాలకులు... ప్రశ్నించే విద్యార్థులపై మాత్రం క్రిమినల్ ముద్ర వేయడం కంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా?

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదికల ప్రకారం, భారత పార్లమెంటులోని రాజ్యసభలో 31శాతం మంది సభ్యులు (69 మంది) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు స్వయంగా అఫిడవిట్లలో వెల్లడించారు. వీరిలో 16శాతం మంది (36 మంది) హత్య, హత్యాయత్నం, మహిళలపై దాడుల వంటి అత్యంత తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నవారే. లోక్‌సభలోనైతే ఏకంగా 46శాతానికి పైగా ఎంపీలు క్రిమినల్ కేసులను మోస్తున్నారు. 2009తో పోలిస్తే తీవ్రమైన నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్య రెట్టింపు కావడం మన రాజకీయ వ్యవస్థ ఎటువైపు పయనిస్తోందో సూచిస్తోంది.

రాష్ట్ర శాసనసభల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. దేశవ్యాప్తంగా 45 శాతం మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులలో నిందితులుగా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య 50 శాతానికి పైగా ఉంది. చట్టాలను రూపొందించాల్సిన స్థానాల్లో కూర్చున్నవారే చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణల్లో మునిగి తేలుతుంటే, ఆ స్థానాల పవిత్రత ఏమవుతోంది? న్యాయస్థానాల్లో ఏళ్లకు ఏళ్లు సాగే విచారణ జాప్యాన్ని, తమకున్న ధనబలాన్ని, అంగబలాన్ని వాడుకుని వారు శిక్షల నుంచి తప్పించుకుంటూ చట్టసభలను కవచాలుగా మార్చుకుంటున్నారు. ఈ నేర చరిత్ర కలిగిన నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థలను, విధాన నిర్ణయాలను దెబ్బతీస్తున్నారు.

రాజకీయాల్లోకి నేరస్థులు రావటం వెనుక కోట్లాది రూపాయల ధనబలం దాగి ఉంది. రాజ్యసభ ఎంపీలలో 14శాతం మంది బిలియనీర్లు ఉన్నారు. అధికారం, సంపద, నేరం ముడిపడి ఉన్న ఈ రాజకీయ వ్యూహంలో కేవలం గెలుపే ప్రామాణికంగా రాజకీయ పార్టీలు క్రిమినల్స్‌కు టికెట్లు కేటాయిస్తూ, పవిత్ర చట్టసభలను నేరస్థుల అభయారణ్యాలుగా మారుస్తున్నాయి.


ఈ దారుణ సత్యాన్ని కప్పిపుచ్చేందుకే, పాలకులు తమ దృష్టిని ప్రశ్నించే గొంతులపైకి మళ్లిస్తున్నారు. ఇంతటి తీవ్ర నేరచరిత్ర కలిగిన నాయకులకు పీఠాలు వేస్తూ, సముచిత గౌరవాలు అందిస్తున్న పాలకులు, సమాజంలో అన్యాయాన్ని నిలదీసే విద్యార్థులపై మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు, రాజ్యాంగబద్ధమైన నిరసనలను నేరాలుగా చిత్రీకరించేందుకు రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తున్నారు. తమ భవిష్యత్తు కోసం, విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం పోరాడే విద్యార్థుల చేతుల్లో ఉన్నది పుస్తకాలు, మనసులో ఉన్నది ప్రజాస్వామ్య కాంక్ష. కానీ చట్టసభలను ఏలుతున్న వారి వెనుక ఉన్నది అపరిమితమైన సంపద, అడ్డూ అదుపూ లేని నేరచరిత్ర! వోహ్రా కమిటీ నివేదిక నుంచి సుప్రీంకోర్టు తీర్పుల వరకు ఎన్నో హెచ్చరికలు చేసినా, పొలిటికల్ పార్టీలు గెలుపే ప్రామాణికంగా నేరచరిత్ర ఉన్నవారికే టికెట్లు కట్టబెడుతున్నాయి. ఈ నేరమయ రాజకీయాల వల్ల ప్రజాస్వామ్య పునాదులు కదిలిపోతున్నాయి. చట్టసభల్లో నేరస్థులను కూర్చోబెట్టుకుని, వీధుల్లో పోరాడే విద్యార్థులపై నేర ముద్ర వేసే పాలకుల నైతికతను పౌర సమాజం నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది.

దేశానికి అసలు విద్రోహం ప్రశ్నించే విద్యార్థులు కాదు. ప్రజల విశ్వాసానికి ద్రోహం చేస్తూ చట్టసభలను స్వప్రయోజనాల కోటలుగా మార్చే నేర రాజకీయాలే నిజమైన విద్రోహం. ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు ప్రశ్నించే విద్యార్థుల వల్ల కాదు‌. నేరచరిత్ర కలిగిన శాసనకర్తల వల్లనే! నిజమైన విద్రోహులు కళాశాలల్లో లేరు, రాజ్యాంగ స్ఫూర్తిని మట్టిలో కలుపుతూ చట్టసభల పీఠాలపైనే ఉన్నారు. విద్యార్థుల గొంతును అణచడం కాదు; చట్టసభల్లో నేరాల రాజకీయీకరణను అణచడమే ప్రజాస్వామ్యాన్ని కాపాడే అసలైన దేశభక్తి.

పాలకులు ముందుగా తమ చట్టసభల్లోని నేరస్థుల సంగతి తేల్చాలి. విద్యార్థుల ఆలోచనలపై ‘క్రిమినల్’ ముద్రలు వేసే నైతిక హక్కు ఏ పాలకుడికీ లేదు. చట్టసభలు నేరముక్తమయ్యే వరకు, యువత నిరసన హక్కులకు రక్షణ లభించే వరకు ప్రజాస్వామ్య ప్రేమికుల పోరాటం ఆగదు. పాలకులారా, క్రిమినల్స్ ఎక్కడున్నారో ముందు మీ సభల్లో వెతుక్కోండి, ఆ తర్వాతే చదువుల తల్లుల వైపు వేలు చూపించండి!

కృష్ణ కానూరి

ఈ వార్తలు కూడా చదవండి

ఈ జీవోకు, ఫార్చ్యూన్ ఇండియా కథనానికి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం క్లారిటీ

వైసీపీ నేత చింతాడ రవికుమార్‌కు బిగుస్తోన్న ఉచ్చు

Updated Date - Aug 11 , 2026 | 01:51 AM