Share News

ఎవరిది క్రెడిట్ ఎవరిది చోరీ

ABN , Publish Date - Jan 23 , 2026 | 01:48 AM

నెలకో, రెండు నెలలకో కొత్త అంశాలతో రాజకీయ తెరపై ఉండాలని ఉవ్విళ్ళూరుతున్నది వైసీపీ. తాజాగా– మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తాను ఎంతో విజ్ఞతతో...

ఎవరిది క్రెడిట్ ఎవరిది చోరీ

నెలకో, రెండు నెలలకో కొత్త అంశాలతో రాజకీయ తెరపై ఉండాలని ఉవ్విళ్ళూరుతున్నది వైసీపీ. తాజాగా– మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తాను ఎంతో విజ్ఞతతో, పరిపాలనా దక్షతతో సంపాదించుకున్న అపారమైన ‘క్రెడిట్‌’ను 40 ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు చోరీ చేస్తున్నారు అని. నిన్న మొన్నటి దాకా ‘సప్త సముద్రాలు’... గుడ్డలిప్పదీస్తాం... రప్పారప్పాలను జపించారు. తాజాగా క్రెడిట్ చోరీ అంటున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్, భూ సర్వే, వైద్య కళాశాల నిర్మాణం వైసీపీ క్రెడిట్ అనేది వారి ఉద్దేశ్యం కావచ్చు. ఇంతగా క్రెడిట్ గూర్చి మాట్లాడే పార్టీ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? పులివెందుల మినహా మిగిలిన వైద్య కళాశాలను పడుకోబెట్టి, రిషికొండను ఎందుకు పూర్తి చేశారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పరు. గత ఐదేళ్ళ పాలనలో జగన్‌కు పాలనా క్రెడిట్ ఏమైనా ఉందా? ప్రజలు మదిలో పెట్టుకొని మర్చిపోకుండా, మురిసిపోయే పనులు ఏం చేశారు? ప్రజా వేదిక కూల్చివేత, మూడు రాజధానుల మూర్ఖపు విధానం, దోపిడీకి స్వర్గధామంగా ప్రభుత్వ మద్యం పాలసీ మార్పు, ఉచిత ఇసుకను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం, పోలవరం పనులకు ద్రోహం ఇవన్నీ జగన్ ఖాతాలో ‘క్రెడిట్‌’ పనులే కదా? ఇస్తామన్న వెయ్యి రూపాయలు ఐదేళ్ళపాటు సాగదీసి, సాగదీసి ఏడాదికి రూ.250 చొప్పున పెంచుకుంటూ ఇవ్వటం నిజంగా సాహసోపేతమైన క్రెడిట్ అందామా?


రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని నిర్మాణం క్రెడిట్ కాదా? అందుకు ప్రణాళికలు, పనులను ఏమంటారు? రెండేళ్ళలోనే రైతులను ఒప్పించి 34 వేల ఎకరాలను నష్టపరిహారం ఇవ్వకుండా భూ సమీకరణ విధానంలో సేకరించటాన్ని ఏమంటారు? అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటి ప్రధాన పాలనా భవంతులను పూర్తి చేసి ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకుని రావటాన్ని? దశాబ్దాల కల పోలవరం సాకారం కోసం అడ్డంకులను అధిగమించటం క్రెడిట్ కిందకు రాదా? ఉపాధి అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం, పారిశ్రామిక ప్రగతి కోసం చేస్తున్న ప్రయాణాలు, సంప్రదింపులు, కుదుర్చుకుంటున్న ఎంఓయూలను ఏమని పిలుద్దాం?

పోతుల బాలకోటయ్య

ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు

Also Read:

అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..

మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 23 , 2026 | 01:48 AM