Share News

‘సీపీఎస్ ఉద్యోగి’ వెతలు

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:16 AM

సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చి, వ్యవస్థను సజావుగా నడిపించేది ప్రభుత్వ ఉద్యోగులు. అయితే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్‌) పరిధిలోకి...

‘సీపీఎస్ ఉద్యోగి’ వెతలు

సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చి, వ్యవస్థను సజావుగా నడిపించేది ప్రభుత్వ ఉద్యోగులు. అయితే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్‌) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు– తీవ్రమైన అభద్రతాభావంతో, నిరాశా నిస్పృహల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు, పదవీ విరమణ తర్వాత కూడా వారు ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు ఒక ఉద్యోగికి ప్రభుత్వం 33 నెలల డీఏ ఎరియర్స్ బాకీపడింది. మొత్తంగా ఒక్కొక్క ఉద్యోగికి సగటున రూ.1,25,000 ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. రావలసిన భత్యాలు సకాలంలో అందకపోవడంతో ఉద్యోగులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది. దీంతో వారు ఆర్థిక, మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఇది వారి రోజువారీ విధి నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ప్రజల చేత ఎన్నుకోబడే ఒక ప్రజాప్రతినిధి కేవలం ఐదేళ్లు పదవిలో ఉంటే చాలు, వారు జీవితాంతం పెన్షన్ పొందుతారు. ఒకటి కంటే ఎక్కువసార్లు గెలిస్తే మల్టిపుల్ పెన్షన్లు అందుతాయి. కానీ, మూడు దశాబ్దాల పాటు సమాజ సేవలో అలసిపోయిన ఒక సాధారణ ఉద్యోగికి మాత్రం వృద్ధాప్యంలో సామాజిక భద్రత కరువవడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ. ప్రతి నెలా ఉద్యోగి జీతం రాకపోయినా, డీఏలు ఆలస్యమైనా, జీతం నుంచి క్రమం తప్పకుండా 1.5శాతం సొమ్మును ప్రభుత్వం ఈహెచ్ఎస్ కింద కోత విధిస్తోంది. ఈహెచ్ఎస్ కార్డ్స్‌ పట్టుకుని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే, ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదనే నెపంతో నెట్‌వర్క్ ఆసుపత్రులు ఉచిత వైద్యం నిరాకరిస్తాయేమో అనే భయం వెంటాడుతోంది. ఇక సీపీఎస్ ఉద్యోగికి, పదవీ విరమణ తర్వాత ఎలాంటి వైద్య భరోసా ఉండదు. మానవ జీవితంలో వైద్య సాయం, ఆరోగ్య రక్షణ అవసరమయ్యేది వృద్ధాప్యంలోనే. సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. పదవీ విరమణ తర్వాత కూడా ఉద్యోగికి, ఆయన జీవిత భాగస్వామికి ఉచిత నాణ్యమైన వైద్యసేవలు అందేలా ఈహెచ్ఎస్ పరిధిని చట్టబద్ధం చేయాలి.

జుర్రు నారాయణ యాదవ్

ఈ వార్తలు కూడా చదవండి..

సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం

రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్

Updated Date - Jul 08 , 2026 | 05:16 AM