Share News

ప్రజా పాలనకు బ్రహ్మరథం

ABN , Publish Date - Feb 19 , 2026 | 01:33 AM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా పాలనను రాష్ట్ర ప్రజలు మరోసారి అభిమానంతో ఆదరించారు. 11౩ మున్సిపాలిటీలలో 90 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 5 కార్పొరేషన్లను హస్తగతం చేసుకొని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో తనకు తిరుగులేదని...

ప్రజా పాలనకు బ్రహ్మరథం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా పాలనను రాష్ట్ర ప్రజలు మరోసారి అభిమానంతో ఆదరించారు. 11౩ మున్సిపాలిటీలలో 90 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 5 కార్పొరేషన్లను హస్తగతం చేసుకొని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో తనకు తిరుగులేదని నిరూపించుకుంది. కాంగ్రెస్ పాలనపై ప్రజలు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారని ఈ ఫలితాలతో మరోసారి రుజువైంది. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా దూసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు మరోసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్‌ఎస్ గోబెల్స్ ప్రచారం చేసినా ప్రజలు వాస్తవాలు తెలుసుకొని కాంగ్రెస్‌ను గెలిపించడంతో, ఆ పార్టీలు నామమాత్రపు స్థానాలకే పరిమితమయ్యాయి. తొమ్మిదేళ్లకు పైగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్, పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ రెండూ తెలంగాణకు చేసిందేమీ లేదనే సత్యాన్ని గ్రహించిన ప్రజలు పుర ఎన్నికల్లో ఆ పార్టీలను చావుదెబ్బ కొట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, పంచాయతీ ఎన్నికల్లో, ఇప్పుడు పుర ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందంతో పనిచేశాయి. ఆ పార్టీల కపట నాటకాలను పసిగట్టిన ప్రజలు ప్రతి ఎన్నికలోనూ వారికి తగిన బుద్ధి చెప్పారు. బీసీలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను కూడా ఈ పార్టీలు తెరవెనుక ఒకటై అడ్డుకున్నాయి.

పురపాలక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని వైపులా కాంగ్రెస్ ఆధిపత్యం కనబర్చింది. బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలున్న చోట్ల కూడా కాంగ్రెస్ భారీ విజయాలు సాధించడం విశేషం. బీజేపీ జాతీయ అధ్యక్షులు పర్యటించిన మహబూబ్‌నగర్‌లో, ఆ పార్టీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించిన ఆదిలాబాద్ జిల్లాలో కూడా కాంగ్రెస్ తిరుగులేని విజయాలు నమోదు చేసింది. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో లభిస్తున్న విజయాల వెనకున్న రహస్యం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమాలే.


రాష్ట్రంలో రెండు దఫాలు అధికారంలో ఉన్న కేసీఆర్, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా తన కుటుంబ సభ్యులకే ప్రాధాన్యమిచ్చారు. ఆయన పాలనలో భారీ అవినీతి, అక్రమాలు వెలుగు చూశాయి. నిరుద్యోగులను మోసం చేశారు. పేదలకు రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ–కార్ రేసింగ్ వంటి స్కామ్‌లతో విసిగిపోయిన ప్రజలు, అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని అన్ని ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌ను ఓడిస్తున్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం కేసీఆర్ పాలనలో అప్పులపాలైంది. కాంగ్రెస్ అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా హామీలను నెరవేర్చేందుకు కట్టుబడ్డారు రేవంత్‌రెడ్డి. ఆయన సారథ్యంలో భారీగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలో రికార్డు సృష్టించింది.

కేంద్రంలో వరుసగా 12 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నది. రాష్ట్రంపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతూ, న్యాయంగా దక్కాల్సిన పథకాలను, ప్రాజెక్టులను, నిధులను మంజూరు చేయడంలేదు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులందరూ కేంద్రానికి ఎన్ని విన్నపాలు చేసినా, ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందే. మూసీ సుందరీకరణ, మెట్రో రైలు విస్తరణకు అనుమతులు, రావాల్సిన నిధులు రావడం లేదు. రాజకీయ కక్షతో రాష్ట్రానికి దక్కాల్సిన కంపెనీలు, ప్రాజెక్టులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ తెలంగాణపై వివక్ష చూపించారు. ఈ పక్షపాతంతో విసిగిపోయిన ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారు.

మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆడపడుచులు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తూ రూ.6,671 కోట్లు ఆదా చేసుకున్నారు. రూ.500 గ్యాస్ సబ్సిడీ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకంతో 50 లక్షలకుపైగా పేదల ఇండ్లలో కాంతులు వెలుగుతున్నాయి. రూ.10 లక్షల వరకు ‘ఆరోగ్యశ్రీ’ కల్పించారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ వేగవంతంగా జరుగుతోంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తోంది. దేశంలో ఉచితంగా సన్నబియ్యం పథకం అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ.


‘ఇందిరా మహిళా శక్తి’ ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ స్ర్తీ సాధికారితకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. కోటి మంది తెలంగాణ మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 70వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు రావడంతో యువతకు ఉద్యోగ అవకాశాలు భారీగా పెరగనున్నాయి. రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా యువతకు రూ.5 లక్షల వరకూ రుణాలు అందించనుంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరికి బోనస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలే కాకుండా, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంది. కులగణన, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అమలుతో కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది.

కాంగ్రెస్‌కు తెలంగాణలో వరుసగా లభిస్తున్న విజయాలతో పార్టీపై మరింత బాధ్యత పెరిగింది. ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించడంతోపాటు, వారికి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరింత కృషి చేసి, ప్రజాభిమానాన్ని చూరగొంటోంది.

బి.మహేశ్ కుమార్‌గౌడ్

టీపీసీసీ అధ్యక్షులు

ఈ వార్తలు కూడా చదవండి...

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

Updated Date - Feb 19 , 2026 | 01:34 AM