Share News

నైరాశ్య యువత నవీన తిరుగుబాటు

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:03 AM

‘మాట మాటకు మండు దూరంలా/ మేం సాగుతాం/ మేం రేగుతాం’.. అంటూ కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ/ బొద్దింకల జనతా పార్టీ) ‘ఝంఝానిల షడ్జధ్వానం’ చేసింది. సీజేపీ ఒక డిజిటల్‌ దృగ్విషయం. నిరుద్యోగ యువతను...

నైరాశ్య యువత నవీన తిరుగుబాటు

‘మాట మాటకు మండు దూరంలా/ మేం సాగుతాం/ మేం రేగుతాం’.. అంటూ కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ/ బొద్దింకల జనతా పార్టీ) ‘ఝంఝానిల షడ్జధ్వానం’ చేసింది. సీజేపీ ఒక డిజిటల్‌ దృగ్విషయం. నిరుద్యోగ యువతను ‘పరాన్న జీవులు’, ‘బొద్దింకలు’తో పోలుస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రజ్వరిల్లిన ఆన్‌లైన్‌ ధిక్కారమది. కనుకనే అపూర్వ సంచలనం సృష్టించింది. అయితే ఆ సంచలనానికి ప్రతిస్పందనలు చాలావరకు స్పష్టంగా కనిపిస్తున్న ఒక సామాన్య సత్యాన్ని గమనించనే లేదు! సీజేపీ ఒక సంప్రదాయ రాజకీయ పార్టీ కాదు. అది ప్రజానీకం కంటే ఎక్కువా కాదు, తక్కువా కాదు. అది ఒక సమాజమూ కాదు. ఒక గుంపు కూడా కాదు, అదొక భావోద్వేగాల సముదాయం. ఒక ఉద్యమ స్థాయికి చాలా చాలా దూరంగా ఉన్నది. అది కేవలం ఒక ప్రభంజన సందర్భం. ఎటువంటి ప్రభంజనమది? ‘ఒక్క క్షణంలో/ మనస్సులో స్మృతి/ తటిన్మణి’పించిన ప్రభంజనమది. ‘మతి వికాసిస్తుంది’ సందేహం లేదు. అధికార నియంతృత్వ దాడి నుంచి మన ప్రజాస్వామిక గణతంత్రాన్ని కాపాడుకోవాల్సిన కర్తవ్యాన్ని నిర్దేశించడమే కాకుండా అందుకు అవసరమైన సంకల్పశక్తిని సమకూర్చిన ప్రభంజన క్షణమది. అందుకే అది ముఖ్యమైనది. ఎట్టి పరిస్థితులలోనూ కొట్టివేయకూడనిది. అలా చేయడమంటే దేశ రాజకీయ వాస్తవాలను విస్మరించడమే అవుతుంది. ఆ ప్రభంజనం ఒక అల కాదు, ఒక రాజకీయ అంతర్వాహిని, ఆగ్రహ రాజకీయ అంతర్వాహిని (అల అనేది పెద్ద శబ్దంతో, కంటికి కనిపించేదిగా, తాత్కాలికమైనదిగా ఉంటుంది. అది త్వరగా విరుచుకుపడి, అంతరిస్తుంది. అలకు భిన్నంగా అంతర్వాహిని అనేది ఉపరితలం కింద నుంచి ప్రభావం చూపే శక్తిమంతమైన, నిశ్శబ్దమైన, స్థిరమైన కదలిక). ప్రాకృతిక ప్రభంజనాలనే కాదు, రాజకీయ, సామాజిక ప్రభంజనాలనూ పట్టుకోవడమనేది అసాధ్యం. సీజేపీ అనే ప్రభంజనాన్ని నియంత్రించాలనేది ఒక మూర్ఖపు ఆలోచన. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే ఆ ప్రభంజనం దేశ రాజకీయ వాతావరణంలో, పాలనా వ్యవస్థలో ఒక మౌలిక మార్పును ఆశించింది. అటువంటి మార్పును అడ్డుకోవడానికి మొండిగా ప్రయత్నించడం వివేకవంతం కానేకాదు.

భారీ మెజారిటీతో అధికారానికి వచ్చిన ప్రభుత్వాలు తమ పదవీ మధ్యకాలంలో సంక్షోభాల పాలవడం ఒక సాధారణ రాజకీయ పరిణామం. ఊహించని రీతిలో నిరసనోద్యమాలు ప్రజ్వరిల్లి అధికారపు చీకటి కోణాన్ని బహిర్గతం చేస్తాయి. 1973–74లో గుజరాత్‌, బిహార్‌ ఉద్యమాలు, 1983లో అసోం ఉద్యమం, 2012లో అన్నాహజారే ఉద్యమం, 2021లో కిసాన్‌ మోర్చా ఉద్యమం మొదలైనవన్నీ అజేయంగా కన్పించిన ప్రభుత్వాలను సవాల్‌ చేశాయి.. మార్పును సాధించాయి. ప్రతిపక్షాలు నిస్తేజం కావడంతో విద్యార్థులు, యువజనుల చొరవతో ఆ ఉద్యమాలు నిర్వహించి మార్పులు సాధించారు. ఆశయం దృష్ట్యా కాక్రోచ్‌ జనతా పార్టీ సంచలనం కూడా తొలి పరిశీలనలో అదే రీతి ఉద్యమంగా కన్పిస్తోంది.


ఈ ‘బొద్దింకల’ ఉద్యమం అపూర్వ ప్రజా చైతన్యాన్ని సృష్టించడంలో చారిత్రకంగా ఇతర సమాంతర ఉద్యమాల కంటే మరింత ప్రభావశీలమైనది. అయితే ఆచరణీయమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ప్రభవింపజేసేందుకు అవసరమైన శక్తిసామర్థ్యాలు దానికి కొరవడ్డాయి. ఎందుకని? ఈ డిజిటల్‌ ప్రతిఘటనలో పాల్గొన్నవారు చాలావరకు నిజ జీవిత రాజకీయ కార్యాచరణలో పాల్గొనడానికి సంసిద్ధంగా ఉన్న కార్యకర్తలు కారు.

కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రారంభదశలో ఉన్నది. ప్రభావవంతమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని సృష్టించగల స్థితికి చాలా దూరంలో ఉన్నది. దానికొక సంస్థాపకుడు ఉన్నాడు. అయితే ఆ వ్యవస్థాపకుడు విధిగా ఒక ఆవశ్యక నాయకుడు కాదు. సీజేపీ అనుయాయుల్లో అత్యధికులు కేవలం ప్రేక్షకులు మాత్రమే. ఆందోళనల్లో అనుభవం లేనివారు. కేవలం ఉత్సాహం ఉంటే సరిపోతుందా? నిజ జీవితంలో రాజకీయ కార్యాచరణ కష్టనష్టాలను భరించి లక్ష్యసాధనకు కడదాకా సాగేందుకు సంకల్పించుకునేవారు ఎంతమంది ఉంటారు? పైగా వారు ఒక అనిర్దిష్ట విరోధికి వ్యతిరేకంగా పరస్పర విరుద్ధమైన ఫిర్యాదులు చేస్తున్నారు. ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సమస్యలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అవన్నీ ప్రజాస్వామ్య డిమాండ్లు, సందేహం లేదు. పాలకులు వాటిని విస్మరించినప్పుడు (ఇదే జరిగి తీరుతుంది) ఆందోళనకారులు తమ ఉమ్మడి శత్రువును గుర్తిస్తారు. వారి ఫిర్యాదులు ప్రజా డిమాండ్లుగా పరిణమిస్తాయి. సీజేపీ వంటి ప్రతి ప్రజా నిరసనోద్యమపు విశిష్ట లక్షణమది. ఆ ప్రత్యేకతే శక్తిమంతమైన, కార్యసాధక ఉద్యమాల నిర్మాణానికి అవసరమైన ప్రాతిపదికలను నిర్మిస్తుందని అర్జెంటీనా రాజకీయ తత్వవేత్త ఎర్నెస్టో లాక్లా (1935–2014) అన్నారు.

నిరంకుశాధికార తత్వం అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు ‘సందిగ్ధ చర్య’ (డైలమా యాక్షన్‌) మార్గాన్ని ఎంచుకోవడం సీజేపీకి మరింత విశిష్టతను సమకూర్చింది. నియంతృత్వ పాలకులను అహింసాత్మకంగా ప్రతిఘటించడంలో హాస్యం, ముందుగా ఊహించవీలులేని పద్ధతిని అనుసరించడం చాలా కీలకమని సెర్బియన్‌ మేధావి, క్రియాశీలి పోపోవిక్‌ వాదిస్తారు. సోఫియా ఎ.మెక్‌ క్లెనెన్‌తో కలిసి ఆమె రాసిన ‘ప్రాంక్‌స్టర్స్‌ వర్సెస్‌ ఆటోక్రాట్స్‌’ అనే పుస్తకం నిరంకుశ ప్రభుత్వాలను ప్రతిఘటించేందుకు ప్రజా నిరసనోద్యమాలు హాస్యాన్ని, సందిగ్ధ చర్యలను ఉపయోగించుకున్న తీరుతెన్నులను విపులంగా వివరించారు. అటువంటి నిరసనోద్యమాలు నిరంకుశ పాలకులను సందిగ్ధంలో పడవేస్తాయి. ఎదుర్కోలేని సంకటాలను కలిగిస్తాయి. ఉద్యమకారుల సందిగ్ధ చర్యలను అనుమతిస్తే పాలకులు బలహీనులుగా కనిపిస్తారు. వాటిని అణచివేసిన పక్షంలో ప్రజల దృష్టిలో క్రూర, అసంబద్ధ పాలకులుగా నిలుస్తారు. సంప్రదాయ ప్రతిపక్షాలు విఫలమైన చోట ఈ వినూత్న నిరసనలు ప్రభావశీలంగా సఫలమవడం కద్దు. నిరంకుశాధికార పాలనపై పోరుకు బొద్దింకను ఒక మీమ్‌గా చేసిన కాక్రోచ్‌ జనతా పార్టీని అందుకొక స్పష్టమైన నిదర్శనంగా చెప్పవచ్చు. మన ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ప్రజాస్వామిక ప్రతిఘటనకు సీజేపీ, బహుశా అనుద్దేశపూర్వకంగానే ఒక ఆదర్శప్రాయ సందిగ్ధ చర్యను ప్రతిపాదించింది.


‘బొద్దింకల ఉద్యమం’ ఒక వినూత్న నిరసన రీతి. అంతేకాదు, అది వర్తమాన భారతదేశ రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టింది. పాలకుల పట్ల ప్రజల్లో ముఖ్యంగా యువతలో గూడుకట్టుకున్న అసంతృప్తిని అది వ్యక్తం చేసింది. జాతీయ అధికార పక్షం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయాలు సాధిస్తూ మరింతగా బలోపేతమవుతోన్నది. ఆ విజయాల గురించి ఆ అధికారపక్షం ఎంతగా గొప్పలకు పోయినా తమ జీవనోపాధుల భద్రత విషయమై ప్రజలు అమితంగా ఆందోళన చెందుతున్నారు. అలాగే తమ భవిష్యత్తు పట్ల యువ భారతీయులు వ్యాకులత అంతా ఇంతా కాదు. ఇవి ఘోర వాస్తవాలని సీజేపీ స్పష్టం చేసింది.

సర్వశక్తిమంతమైన ప్రభుత్వం ఒక మీమ్‌ను నిషేధించేందుకు జాతీయ భద్రతను కారణంగా చూడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సామాజిక మాధ్యమాల్లో ఒక విషయమై విశేషంగా వెల్లువెత్తుతున్న అభిప్రాయాలను అపఖ్యాతిపాలు చేసేందుకు ట్రోల్‌ ఆర్మీ (ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడానికి రూపొందించబడిన సోషల్‌ మీడియా ఖాతాల వ్యవస్థీకృత సమూహం)ను మోహరించాల్సిన అవసరమేమిటి? సీజేపీ విషయంలో ఇలా జరిగిందంటే ప్రభుత్వం కనిపిస్తున్నంత బలంగా లేదనే కాదూ? కాకపోతే ఒక మీమ్‌కు భయపడడమేమిటి? ఎంతగా విజయాలు సాధిస్తుందో అంతగా ఆత్మరక్షణ చేసుకోవల్సిన పరిస్థితులనూ ఎదుర్కొంటున్నదని స్పష్టంగా చెప్పవచ్చు. విచారకరమైన విషయమేమిటంటే పార్లమెంటరీ ప్రతిపక్షం దుస్థితి. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకోవడంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమవుతున్నది. సీజేపీకి కొద్ది రోజుల్లోనే ఇంచుమించు రెండున్నర కోట్ల మంది అనుయాయులు సమకూరడమనేది ప్రతిపక్షాలకు ఒక సందేశాన్నిస్తోంది: సంఘటితమై సమైక్యంగా ప్రభావశీల కార్యాచరణకు పూనుకోవాలి. ఇది జరిగినప్పుడు మాత్రమే ప్రజలు ప్రతిపక్షాలను విశ్వసిస్తారు.


ఈ వాస్తవాల దృష్ట్యా కాక్రోచ్‌ జనతా పార్టీ పట్ల మనం ఎలా ప్రతిస్పందించాలి? రాజకీయ నిరాశావాదం, వ్యూహాత్మకంగా విస్మరించడం లేదా సమాదరించడం ఇత్యాది సాధారణ రీతుల్లో కాకుండా ఒక కొత్త దృక్పథంతో ఆ వినూత్న రాజకీయ శక్తిని చూడాలి. సర్వవ్యాప్త నైరాశ్యాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన రాజకీయ సంఘీభావానికి ఒక కొత్త వ్యాకరణాన్ని రూపొందించుకోవాలని కవి వినోద్‌కుమార్‌ శుక్లా (1937–2025) మనకు ఇలా పిలుపునిచ్చారు: ‘మేము కలిసి నడిచాము/ మాలో ఎవరికీ ఒకరి గురించి ఒకరికి తెలియదు/ కలిసి నడవడమంటే ఏమిటో మాత్రమే మాకు తెలుసు’. ఇది విప్లవోద్యమ సహచరుల పరస్పర సాన్నిహిత్యం కాదు.. అపరిచితుల సాహచర్యం. ఇది ఉమ్మడి గుర్తింపు అనుబంధం కాదు, ఉమ్మడి బలహీనతలను పంచుకునే మానవీయ చైతన్యశీల బంధం. బొద్దింకలుగా ఉద్యమించిన యువజనులకు మనం తెలియకపోవచ్చు. అయితే మనం చాచిన చేతిని వారు తప్పక గుర్తిస్తారు, అందుకుంటారు. మనకు పరస్పరం పరిచయం లేకపోవచ్చుగానీ మనం కలిసి నడవడం నేర్చుకోవచ్చు. ఈ నిరాశామయ లోకంలో ప్రతికూలతలను అలా కాకుండా ఇంకెలా అధిగమించగలం?

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఇవి కూడా చదవండి..

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం

కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే

Updated Date - Jun 04 , 2026 | 01:03 AM