Share News

మన కాలపు మనస్సాక్షి

ABN , Publish Date - Jul 13 , 2026 | 01:46 AM

మలయాళ కవిత్వాన్ని ఒక విశాల నదిగా ఊహిస్తే, సచ్చిదానందన్ సుదూర మానవ అనుభవాల నుంచి సంద్రాల నుంచి ఆ నదిలో కలిసే ప్రవాహంలా కనిపిస్తాడు. చరిత్రలోని చేదు, ప్రవాసాల ధూళి, అనేక భాషల మాధుర్యం...

మన కాలపు మనస్సాక్షి

మలయాళ కవిత్వాన్ని ఒక విశాల నదిగా ఊహిస్తే, సచ్చిదానందన్ సుదూర మానవ అనుభవాల నుంచి సంద్రాల నుంచి ఆ నదిలో కలిసే ప్రవాహంలా కనిపిస్తాడు. చరిత్రలోని చేదు, ప్రవాసాల ధూళి, అనేక భాషల మాధుర్యం, మానవత్వపు అశాంత స్వప్నాలను వెంట తెచ్చుకునే కవితా ప్రవాహం అది. ఆయన కవిత్వ హృదయంలో మానవ స్వేచ్ఛ పట్ల అచంచలమైన నిబద్ధత ధ్వనిస్తుంది. రాజకీయ, సామాజిక, మత, భాషా, సాంస్కృతికాల్లో ఏ రూపంలో వచ్చిన అణచివేతనైనా ఆయన కవిత్వం ప్రశ్నిస్తుంది, ప్రతిఘటిస్తుంది. అయితే ఆ ప్రతిఘటన కేవలం నినాదంగా ఉండదు. కవిత్వంగా రూపాంతరం చెందుతుంది. మౌన నైతిక శక్తితో, లోతైన మానవీయతతో పాఠకుని మనసు తాకుతుంది.

సచ్చిదానందన్ ఊహాజగత్తులో ప్రకృతిది కేంద్రస్థానం. చెట్లు, నదులు, పక్షులు, వర్షాలు, విత్తనాలు, ఋతువులు ఆయన కవితల్లో అలంకార వస్తువులు కావు. జీవంతో నిండిన రూపాలు. అవి మనుషులతో సంభాషిస్తాయి. వారి విధుల్లో భాగస్వాములవుతాయి. ఆయన కవిత్వంలో ప్రకృతి భూమితో విడిపోయిన మన బంధాన్ని గుర్తుచేసే జీవశక్తి.

రవీంద్రనాథ్ ఠాగూర్ మానవ ఆత్మ వికాసంలో అనంతాన్ని అన్వేషించాడు. పాబ్లో నెరూడా సంఘర్షణలో చరిత్రను, ఆకలిలో విప్లవాన్ని కనుగొన్నాడు. ఆక్టావియో పాజ్ భాషా–ఏకాంతాల చిక్కుముడుల్లో దాగి ఉన్న ఆత్మను వెతికాడు. సచ్చిదానందన్ ఈ మూడు సంప్రదాయాలతో సంభాషిస్తూనే తన దైన ప్రత్యేక స్వరం నిలబెట్టుకున్నాడు.

సచ్చిదానందన్ కవిత్వ చూపు భూమి వైపు, ఎడారులు దాటుతున్న శరణార్థుల వైపు, కనిపించని భారాలు మోస్తున్న కార్మికుల వైపు, దురాశ ఫలితంగా ముప్పులో ఉన్న అడవుల వైపు, యుద్ధ ఛాయల కింద చిక్కిన పిల్లల వైపు చూస్తుంది. నెరూడాలాగే అన్యాయాల పట్ల కవిత్వం మౌనంగా ఉండకూడదని సచ్చిదానందన్‌కు తెలుసు. అయితే ఆయన మంద్ర స్వరంలోని శక్తిని ఎంచుకుంటాడు. సచ్చిదానందన్ కవిత్వంలో ప్రతిఘటన బిగించిన పిడికిలి కాదు, తెరిచి ఉన్న గాయం. ఆయన అరిచి ఒప్పించడు, నిశ్శబ్దాన్నే మాట్లాడిస్తాడు.


సచ్చిదానందన్ కవిత్వ ప్రత్యేకత ‘నైతికతను’ శ్రద్ధగా మలచడంలో ఉంది. ప్రతి జీవికి వినిపించే హక్కు ఉందన్న భావంతో రాస్తాడు. ఆయన కవితల్లో పక్షులు ప్రకృతి అలంకారాలు కావు, అవి స్వేచ్ఛగల పౌరులు. చాలామంది కవులు ప్రపంచం గురించి రాస్తారు. సచ్చిదానందన్ ప్రపంచాన్ని వింటాడు. అదే ఆయనను ప్రత్యేకంగా నిలబెడుతుంది. నేటి ప్రపంచం ఒక మహా విమానాశ్రయంలా కనిపిస్తే దానినుండి లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. కానీ చాలా కొద్దిమంది మాత్రమే నిజంగా గమ్యాన్ని చేరుకుంటున్నారు. దేశాలు తమ చుట్టూ కంచెలు కట్టుకుంటున్నాయి. మతాలేమో గోడల్ని నిర్మిస్తున్నాయి. మార్కెట్లు ప్రతిదాన్నీ వస్తువుగా మారుస్తున్నాయి. ఈ గందరగోళాల నడుమ సచ్చిదానందన్ కవిత్వం రాజకీయాల సరిహద్దుల్ని దాటి పలకరిస్తుంది పలవరిస్తుంది. కేరళ నుంచి పాలస్తీనాకు, లాటిన్ అమెరికా నుంచి ఆఫ్రికాకు, ఒక గ్రామీణ దారి నుంచి ప్రపంచ సంక్షోభాల వరకూ ప్రయాణిస్తూ మానవ గౌరవం అవిభాజ్యమన్న సందేశాన్ని మోస్తుంది. ఆయన కవితలు బాధకు జాతీయత ఉండదని గుర్తుచేస్తాయి. అందుకే అవి భాషల సరిహద్దులను దాటి ప్రతిధ్వనిస్తాయి.

ఆయన కవిత్వమంతటా లోతైన పర్యావరణ చైతన్యం ప్రవహిస్తుంది. ప్రపంచంలో పర్యావరణ విపత్తు ముఖ్యమైన ప్రమాదంగా దేశాలు గుర్తించకముందే ప్రకృతి విధ్వంసమంటే మానవ విధ్వంసమే అని ఆయన గ్రహించాడు. ఆయన కవిత్వంలో ఒక చెట్టు నరికివేత కేవలం పర్యావరణ సంఘటన కాదు. భూమి మనిషి చరిత్రలో ఒక అధ్యాయం చెరిపివేయడమే. ఆ సున్నితత్వమే ఆయన కవిత్వానికి అరుదైన నైతిక స్పృహను స్పర్శను అందిస్తుంది. ఆయన మనిషిని ప్రకృతి నుంచి వేరుగా చూడడు, ప్రకృతిలో భాగంగానే చూస్తాడు. మానవ నాగరికతలో భాగంగా పక్షులు, నదులు, అడవులు, మన చుట్టూ నిశ్శబ్దంగా జీవించే అనేక జీవులతో మనం మరచిపోయిన బంధాన్ని పునరుద్ధరించడంలోనే మనిషి మనుగడ వుందని ఆయన కవితలు సూచిస్తాయి. ఆయన రచనల్లో– చెట్లు జ్ఞాపకాల భాండాగారాలు. నదులు కాలంలో ప్రవహించే జీవిత చరిత్రలు.

స్థానికతకూ విశ్వజనీనతకూ మధ్య, వేర్లకూ వృక్షానికీ మధ్య, సాంస్కృతిక అస్తిత్వానికీ ప్రపంచ చైతన్యానికీ మధ్య నిరంతర సంభాషణ జరిపిన అరుదైన భారతీయ రచయితల్లో ఆయన ఒకరు. ఆయన కవిత్వం– విభజనలతో నిండిపోతున్న ఈ కాలంలో ఆతిథ్యంగా నిలుస్తుంది, గోడలు కడుతున్న చోట కిటికీలు తెరుస్తుంది, ఎడారులు విస్తరిస్తున్న చోట చెట్లను నాటుతుంది, పంజరాలు పెరుగుతున్న చోట పక్షులను విడుదల చేస్తుంది– బహుశా ఇదే కె. సచ్చిదానందన్ రచనల శాశ్వత ప్రాసంగికత.


గడిచిపోయిన ప్రతి కాలం రాతి, ఉక్కులపై రాతల్ని, స్మారకాలను నిర్మిస్తుంది. కానీ కొద్ది కాలాల్లోని సృజనకారులే సజీవమైన మనస్సాక్షిని సృష్టిస్తారు. తమ భాషకే కాకుండా తమ కాలపు మనస్సాక్షిగా ఎదుగుతారు. అలాంటి అరుదైన మనస్సాక్షులలో కె. సచ్చిదానందన్ ఒకరు. సాహిత్యానికి నిజమైన మాతృభూమి దేశమో భాషో కాదని, మానవ హృదయమేనని నిరంతరం మనకు బోధిస్తున్న కవి సచ్చిదానందన్.

(సినారె ‘విశ్వంభర పురస్కారా’నికి కె. సచ్చిదానందన్‌ ఎంపికైన సందర్భంగా)

వారాల ఆనంద్‌

94405 01281

Also Read:

ఫిరంగి కోసం పోరాటం

వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు

Updated Date - Jul 13 , 2026 | 01:46 AM