చైనా విజయం మనకు చెబుతున్నదేమిటి?
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:18 AM
ఇరవయ్యో శతాబ్ది రెండు మహాయుద్ధాల మధ్యకాలంలో (1919–39) మూడు రకాల ప్రభుత్వ వ్యవస్థలు ప్రపంచ ఆధిపత్యం కోసం పోటీపడ్డాయి. జర్మనీలో హిట్లర్, ఇటలీలో ముస్సోలినీ ఫాసిస్ట్ సమాజాల్ని నిర్మించారు...
ఇరవయ్యో శతాబ్ది రెండు మహాయుద్ధాల మధ్యకాలంలో (1919–39) మూడు రకాల ప్రభుత్వ వ్యవస్థలు ప్రపంచ ఆధిపత్యం కోసం పోటీపడ్డాయి. జర్మనీలో హిట్లర్, ఇటలీలో ముస్సోలినీ ఫాసిస్ట్ సమాజాల్ని నిర్మించారు. స్వల్పకాలంలోనే నివ్వెరపరిచే ప్రగతిని సాధించారు. పూర్వ వైభవాన్ని సాధించిన జర్మనీలో ద్రవ్యోల్బణం పూర్తి నియంత్రణలోకి వచ్చింది. మౌలిక వసతులు భారీగా విస్తరించాయి. పనిచేయగల వారందరికీ ఉపాధి అవకాశాలు లభించాయి. సైనిక పాటవం తేరిపార చూడలేని స్థాయికి పెరిగింది. జాతీయతా భావం తిరిగి ప్రజలను ఉద్విగ్న పరచసాగింది. కమ్యూనిజానికి కేంద్రబిందువుగా నిలిచిన సోవియట్ యూనియన్... మౌలిక వసతులను పెద్దఎత్తున నిర్మించటం, సమష్టి సంపద సృష్టి కార్యక్రమాలు, సైనికీకరణ, క్షిపణి, వైజ్ఞానిక సామర్థ్యాలు, విద్య, ప్రజల నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తేవటం వంటి మార్గాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉదార ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక పోటీ, వినియోగదారులకు ఎంపిక స్వేచ్ఛ, మార్కెట్ క్యాపిటలిజం మార్గాన్ని కొనసాగించాయి. ఆ క్షణాన ఫాసిజం అజేయమైన శక్తిగా ప్రపంచానికి కనిపించింది.
ఫాసిజం చిత్తుగా ఓడిపోవటంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. అమెరికా ప్రపంచ ఆర్థిక, సైనిక సూపర్ పవర్‌గా ఆవిర్భవించింది. బ్రిటన్ తన రవి అస్తమించని సామ్రాజ్యాన్ని, ప్రపంచ రాజకీయాల్లో పలుకుబడిని కోల్పోయింది. ఫాసిజంను ఓడించటంలో, నిలువరించటంలో వీరోచిత పోరాటం, అసమాన త్యాగాలు చేసిన దేశంగా సోవియట్ యూనియన్ అమెరికా గుత్తాధిపత్యానికి ఏకైక సవాలుదారుగా నిలిచింది. మరోవంక, తన కమ్యూనిస్టు విప్లవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో సోవియట్ యూనియన్ ప్రారంభించిన అంతర్జాతీయ కమ్యూనిజం కార్యక్రమాన్ని నిలువరించే ఏకైక శక్తిగా అమెరికా మోహరించింది. దీంతో ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. దేశాల మధ్య పోరాటంగా కాకుండా.. మానవ ఆకాంక్షల్ని ఏ రాజకీయ వ్యవస్థ మెరుగ్గా నెరవేర్చగలుగుతుంది? సోవియట్ కమ్యూనిజమా, అమెరికా స్వేచ్ఛా మార్కెట్ క్యాపిటలిజమా? అనే వాదోపవాదాలు వివిధ దేశాలు, రంగాలకు విస్తరించాయి. 1959లో సోవియట్ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కృశ్చేవ్, అమెరికా ఉపాధ్యక్షుడు నిక్సన్‌ల మధ్య జరిగిన సుప్రసిద్ధ వంటింటి సంవాదం (కిచెన్ డిబేట్) అంతా ‘‘ఏ వ్యవస్థ వల్ల అభివృద్ధి జరిగింది, ఏది నిలదొక్కుకుంటుంది?’ అన్న విషయం చుట్టూ తిరిగింది.
చివరికి, రాజుగారి గంగాళంలో పాలు పోసిన తరహాలో గుంపులో గోవిందం పనిసంస్కృతి, రాజ్యవ్యవస్థ గుత్తాధిపత్యం సోవియట్ ప్రజల జీవితాలను ఎలా దుర్భరం చేశాయో ప్రపంచానికి వెల్లడైంది. 1991 పరిణామాలతో పాశ్చాత్య దేశాలు ఈ సైద్ధాంతిక పోరాటంలో విజయం సాధించాయనే అభిప్రాయం ఏర్పడింది. తూర్పు జర్మన్ల పదఘట్టనలే ఓట్లుగా మారి బెర్లిన్ గోడ గత కాలపు చిహ్నంగా మిగిలిపోయింది. గోడకు పేర్చిన ఇటుకలు మ్యూజియం వస్తువులయ్యాయి. దేశం తర్వాత దేశం కమ్యూనిస్టు నియంతృత్వాలపై తిరుగుబాటు చేయటంతో ఇనుప తెర కాస్తా పేకమేడలా కూలిపోయింది. చివరికి, అనూహ్యరీతిలో సోవియట్ యూనియన్ తనను తాను రద్దు చేసుకుంది. ఒక్క తుపాకీ గుండు కూడా పేలకుండా డిసెంబర్ 26, 1991న ఆ చారిత్రక పతనం సంభవించింది. కమ్యూనిజం నామమాత్రమవటంతో పాశ్చాత్య ప్రభుత్వ నమూనా అజేయమన్న అభిప్రాయం కలిగింది.
1945 నుంచి 2010 వరకు చాలా ఏళ్లపాటు ఉదార ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా మార్కెట్లు, పెట్టుబడిదారీ వ్యవస్థ చెట్టాపట్టాలుగా సాగాయి. సంపద సృష్టిలో ఈ సమీకరణ పైచేయి కూడా అనివార్యమన్నట్లు కొనసాగింది. ఆ విశ్వాసాన్నే ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత సుప్రసిద్ధ రాజకీయ ఆర్థికవేత్త ఫ్రాన్సిస్ ఫుకుయామ చాలా నిశ్చితంగా వినిపించారు. అయితే, ఇప్పుడు 21వ శతాబ్దంలో చైనా మరో నమూనాను విజయవంతమైనదిగా నిరూపించింది. భౌతిక ప్రగతి, సాంకేతిక ఆవిష్కరణలు, సైనిక పాటవంలో అమెరికాను సైతం ఆత్మరక్షణలోకి నెట్టింది. మావో నమూనా వైఫల్యం తర్వాత డెంగ్ జియావో పింగ్ 1978లో నాలుగు గొప్ప ఆధునిక, సంస్కరణ ప్రక్రియల్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంతో, చైనా అద్భుత ప్రగతి 2001 నుంచి మొదలైంది. ఆ ఏడాది చైనా ప్రపంచ వాణిజ్య సంస్థలోకి ప్రవేశించటం ఇందుకు దోహదం చేసింది. 2010 నాటికి చైనా ప్రపంచంలోనే వస్తు తయారీ రంగంలో అగ్రస్థానం సాధించింది. ఎగుమతుల్ని ఇబ్బడిముబ్బడిగా చేసింది. ఏ దేశంలో, ఏ విభాగంలో, ఏ మారుమూల ప్రాంతంలో చూసినా చైనా వస్తువులే.
2025 వచ్చేసరికి గణాంకాలు చైనా బలిమిని ఇంకా స్పష్టంగా చాటాయి. ఇప్పుడు ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో చైనా వాటా 35 శాతానికి పెరిగింది. తయారీ రంగంలో ఎగుమతులు 20 శాతానికి చేరాయి. మొత్తం అంతర్జాతీయ వాణిజ్యంలో 13 శాతం చైనీయులదే. ప్రపంచంలోనే అత్యధిక వాణిజ్య మిగులు 1.2 ట్రిలియన్ డాలర్లు సాధించిన దేశం చైనా. ఉక్కు (53 శాతం), లిథియం ఇయాన్ బ్యాటరీలు (75 శాతం), సౌర పలకలు (80 శాతం), యంత్రాలు, పరికరాలు (33 శాతం), విద్యుత్ ఉపకరణాలు (40 శాతం), అరుదైన ఖనిజాల వెలికితీత (రేర్ ఎర్త్ మైనింగ్) (60 శాతం), అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్ (91 శాతం), శాశ్వత అయస్కాంతాలు (94 శాతం), విద్యుత్ వాహనాలు (75 శాతం), లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (95 శాతం), బ్యాటరీ సెల్స్ (80 శాతం), సౌర విద్యుత్తు (40 శాతం), థర్మల్ విద్యుత్తు (53 శాతం), బొగ్గు (58 శాతం), సిమెంట్ (53 శాతం)... మొదలైన వాటికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలిచింది. కళ్లు చెదిరే అంకెలివి. ఉదార ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా మార్కెట్లు, పెట్టుబడిదారీ వ్యవస్థను చైనా నమూనా మెరుగుపరిచిందా? అవుననే అభిప్రాయాన్ని ఆ గణాంకాలు ఎవరిలోనైనా స్థిరపరిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలో, గత ఎనిమిది దశాబ్దాల సంప్రదాయ అభిప్రాయాల్ని పాశ్చాత్య ఉదారవాద దేశాలు పునః సమీక్షించుకోవాలి. చరిత్ర అంతం కాలేదన్నది సుస్పష్టం! ఈ వాస్తవాల నుంచి రెండు ప్రశ్నలు తలెత్తుతాయి. చైనా ఈ స్థాయి విజయాన్ని ఎలా సాధించింది? ఉదార ప్రజాస్వామ్యాలు ఆధిపత్యాన్ని ఎలా కోల్పోయాయి? ఈ రెండు ప్రశ్నల్నీ కొంత పరిశీలిద్దాం.
మొదటిది, చైనా పెరగటం కంటే ముందు.. ఉదారవాద ప్రజాస్వామ్యాలు మాత్రమే అధిక వృద్ధిని, సాటిలేని ఆవిష్కరణల్ని నమోదు చేశాయన్న వాదన సరికాదు. ఈనాటి ఉదార ప్రజాస్వామిక వ్యవస్థలు, ఆ రకమైన పద్ధతులు లేకుండానే దక్షిణ కొరియా, తైవాన్ గణనీయ ప్రగతిని, ఆవిష్కరణల్ని సాధించాయి. కొంతవరకు, సింగపూర్ ప్రగతిని కూడా ప్రజాస్వామిక నమూనాగా చెప్పలేం. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీ, జపాన్ సాధించిన గొప్ప ప్రగతి సైతం ప్రజాస్వామ్యం ద్వారా వచ్చినది కాదు. కాబట్టి.. ఆవిష్కరణలు, పోటీ, అభివృద్ధికి తగిన విధానాలు, వాతావరణం ఉదార ప్రజాస్వామ్యం లేకున్నా సాధ్యమని హేతుబద్ధంగా భావించవచ్చు. చైనా ప్రగతి ఇదే విషయాన్ని రుజువు చేస్తుంది.
చైనా జీవనశైలి బలమైన కుటుంబ వ్యవస్థ గల ఆసియా సాంస్కృతిక విలువలను అనుసరిస్తున్నది. అలాంటి సమాజంలో పిల్లల ప్రతిభా పాటవాలను వికసింపజేయటానికి అత్యధిక ప్రాధాన్యమిస్తారు. ఇందుకోసం మంచి చదువు, నైపుణ్యాలు, వ్యక్తిగత హక్కుల కన్నా ఉమ్మడి హితానికి పెద్దపీట వేశారు. ఆధునిక సాంకేతికతను, మార్కెట్ ఆర్థిక వ్యవస్థను, స్వేచ్ఛా వాణిజ్యాన్ని అత్యంత సమర్థంగా వినియోగించటం ఈ నమూనాలో భాగం. నాణ్యమైన విద్య, నైపుణ్యాలపై చైనా నిరంతరం దృష్టి కేంద్రీకరించింది. పెద్ద అంశాలు, జాతీయ ప్రాధాన్యం గల విషయాలపై విధాన నిర్ణయాలు పై స్థాయిలో తీసుకున్నా.. వాటి అమలు అత్యధికంగా స్థానిక స్థాయిలోనే జరుగుతుంది. చైనా ప్రభుత్వ వ్యయంలో 54 శాతానికి పైగా స్థానిక ప్రభుత్వాలే నియంత్రిస్తాయి, ఖర్చు చేస్తాయి. ఇది ప్రపంచంలోనే అత్యధిక వాటా! ఒక అర్థవంతమైన విధానంతో, అభివృద్ధి, ఆవిష్కరణలకు దోహదం చేసే పోటీ ఆర్థిక నమూనాకు.. కమ్యూనిస్టు పాలన నుంచి వచ్చే సుస్థిరతను, క్రమశిక్షణను చైనా జోడించింది. తక్షణ రాజకీయ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే భయం లేకుండా దీర్ఘకాల లక్ష్యాలను సాధించే హేతుబద్ధ విధానాలను అనుసరించటానికి చైనా సమాజంపై కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) నియంత్రణ దోహదం చేసిందనటంలో అనుమానం లేదు.
నిర్ణీత పదవీకాలం తర్వాత ఎన్నికలను ఎదుర్కోక తప్పని ఉదార ప్రజాస్వామ్యంలో... దీర్ఘకాల విధానాన్ని కొనసాగించటం తరచూ ప్రతికూలతగా మారే అవకాశముంది. ప్రజలకు తాత్కాలిక ఉపశమనం, సంతృప్తి కలిగించటం రాజకీయ మనుగడకు కీలకం కావటం ఈ నమూనాలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణం. అది ప్రజాస్వామ్యం తప్పు కాదు. వర్తమాన అవసరాలు, దీర్ఘకాల ప్రయోజనాల మధ్య సమతూకం పాటించే వ్యవస్థీకృత ఏర్పాట్లు చేయకపోవటం మన లోపం. తక్షణ, స్వల్పకాల రాజకీయ మూల్యం సమస్యను ఎదుర్కోవటానికి పటిష్ఠమైన వికేంద్రీకరణే మార్గం. స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు, అక్కడుండే వివిధ సమూహాలకు (కమ్యూనిటీలు) దీర్ఘకాల ప్రగతిలో క్రియాశీల పాత్ర, భాగస్వామ్యం కల్పిస్తాయి. అటువంటి హేతుబద్ధ నిర్ణయాల వల్ల తమకు కలిగే పలు రకాల లాభాలను ప్రజలు గ్రహించగలుగుతారు. దురదృష్టవశాత్తూ, భారత్‌లో ప్రభుత్వ వ్యయంలో కేవలం 3 శాతం స్థానిక ప్రభుత్వాల్లో ఖర్చు చేస్తున్నారు. జీ 20 దేశాలన్నిటిలోకీ ఇది అత్యంత తక్కువ! విద్యాప్రమాణాల్లో, చట్టబద్ధపాలనలో మన ఘోర వైఫల్యం ప్రజాస్వామ్యం వల్లా? కాదు. అసమర్థ, ఉదాసీన ప్రభుత్వాల వల్ల. అంటే, మన వైఫల్యాలకు ప్రజాస్వామ్యాన్ని సాకుగా చెప్పి తప్పించుకోవటం సాధ్యం కాదు. పటిష్ఠ ప్రజాస్వామ్యంలో ఈ లొసుగులన్నిటినీ హేతుబద్ధ బహిరంగ చర్చతో అధిగమించగలం. మన ఎన్నికల వ్యవస్థను, రాజకీయ పార్టీలను విద్య, చట్టబద్ధపాలనను సంస్కరించటం ద్వారా మాత్రమే మన సామర్థ్యాన్ని వికసింప చేసుకోగలం.
డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్
లోక్‌సత్తా వ్యవస్థాపకులు
ఈ వార్తలూ చదవండి
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ డివిజన్లో పలు రైళ్ల రద్దు
మురసు తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్డీఎంఏ