తరం మారుతోంది, తమిళుల ఆలోచనా మారుతోంది
ABN , Publish Date - Jan 23 , 2026 | 02:03 AM
భారత రాజకీయాల్లో 2026 కీలకమైన సంవత్సరం. అసోం, పశ్చిమబెంగాల్, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలు ఎలా ఉన్నా... అందరి దృష్టి తమిళనాడు పైనే ఉంది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా రెండోసారి పదవీ...
భారత రాజకీయాల్లో 2026 కీలకమైన సంవత్సరం. అసోం, పశ్చిమబెంగాల్, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలు ఎలా ఉన్నా... అందరి దృష్టి తమిళనాడు పైనే ఉంది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా రెండోసారి పదవీ ప్రమాణం చేస్తారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆయన నాయకత్వానికి ఇళయ దళపతి విజయ్ నేతృత్వంలో ఆవిర్భవించిన కొత్త పార్టీ టీవీకే సవాలుగా తయారైంది.
పెరియార్ రామస్వామి నాయకర్ మార్గనిర్దేశంలో పుట్టి, పెరిగి, పెద్దదై, స్థిరపడిన ద్రవిడ ఉద్యమానికి తమిళనాడు నేలపై ఇంకా జవసత్వాలు ఉన్నాయా లేవా అన్నది ఈ ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి. డీఎంకే, అన్నాడీఎంకే, ఎండీఎంకే లాంటి పార్టీలు ఆవిర్భవించిన ఉద్యమస్ఫూర్తి క్రమంగా సన్నగిల్లుతోందన్న ఆందోళన ఒక వర్గం తమిళ మేధావులను వెంటాడుతున్నది. ఎందుకా ద్రవిడ ఉద్యమం అనేవారితోపాటు, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో విసిగిపోయి, ఇక చాలు అనుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.
ఎంజీఆర్, కరుణానిధి హయాంలోని రాజకీయాలు వేరు, జయలలిత కాలంలోని రాజకీయాలు వేరు, ఇప్పుడున్న ద్రవిడ నేతలు చేస్తున్నది వేరు. ఎంజీఆర్, కరుణానిధి పేద పీడిత వర్గాల కోసం పోరాడారు. అప్పట్లో ద్రవిడ సిద్ధాంతాలను నమ్మిన యువతరం సామాజిక ఉద్యమాల్లో భాగస్వామి అయ్యింది. రెండు గ్లాసుల విధానంపైన, ఆలయాల్లోకి దళితుల ప్రవేశం కోసమూ జరిగిన ఉద్యమాలు, దాడులు– ప్రతిదాడులు అప్పటి పరిస్థితులకు నిదర్శనం. ఎంజీఆర్, కరుణానిధి టైమ్‌లో అవినీతి లేదు. జయలలిత పాలనా కాలానికి వచ్చేసరికి ఆకాశమే హద్దుగా అవినీతి వేళ్లూనుకుంది. అన్నాడీఎంకే నేతలు గ్రామాల్లో అప్రకటిత పోలీసులుగా మారి ప్రభుత్వ వ్యవస్థలనే మార్చేశారు. ఆ పార్టీ సృష్టించిన కట్ట పంచాయత్ (గుంపు పంచాయతీ) పట్ల ప్రజల్లో వెగటు పుట్టింది. ఆ నేతలు జనాన్ని దోచుకునేందుకు కట్ట పంచాయత్ ఒక వాహకంగా ఉపయోగపడింది. (తర్వాతి కాలంలో అనివార్యంగా ఇతర పార్టీలు సైతం అదే ధోరణిలో కొనసాగాయి. ప్రస్తుత డీఎంకే పాలనలోనూ అక్కడక్కడా కట్ట పంచాయత్ జరుగుతోంది.) అవినీతి కారణంగా పాలన గాడి తప్పింది. పార్టీ అధిష్ఠానానికి జిల్లా స్థాయి, క్షేత్రస్థాయి నేతలపై పట్టు లేకుండా పోయింది. అధినాయకత్వం కూడా పార్టీపైనా, నాయకులపైనా పూర్తి పట్టు కోసం కొన్ని వ్యవహారాలను చూసీ చూడకుండా ఊరుకునేది. అదే ఇప్పుడు ద్రవిడ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమైంది.
జాతీయస్థాయిలో బీజేపీ స్థిరపడిపోయిన తర్వాత తమిళుల్లో కూడా మార్పు వచ్చింది. దేవుడు లేడు అనే ద్రవిడ ఉద్యమ ఆలోచన సన్నగిల్లుతూ, రాముడే దేవుడని విశ్వసించేవాళ్లు పెరుగుతున్నారు. నిన్నటి దాకా అన్నాడీఎంకే ఓటు బ్యాంకులుగా ఉన్న కొన్ని వర్గాలు ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. అందుకే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కమలం పార్టీకి 18శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్ సరళి కొంచెం మారినా బీజేపీకి గణనీయమైన సీట్లు వచ్చేవి.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న దళపతి విజయ్ మొదటిసారిగా సర్వశక్తులూ ఒడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒంటరి పోటీకి ఆయన ధైర్యంగా ముందుకెళ్తున్నారా? కేసులతో భయపెట్టి దారికి తెచ్చుకోవాలనుకునే జాతీయ పార్టీలతో కలిసిపోతారా? అన్నది ఇప్పుడే చెప్పలేం. జెన్–జీ యువత మాత్రం మార్పును కోరుకుంటూ విజయ్ వైపు చూస్తున్నది. తమిళనాట 27 సంవత్సరాల లోపు వయసున్న ఓటర్లు కోటిమందికి పైగా ఉన్నారు. మొత్తం ఓట్లలో వారిది దాదాపు 20 శాతం వాటా. వీరిలో మెజార్టీ ఓటర్లు విజయ్ వైపు ఉన్నారు. రెండు పార్టీల స్పర్థ నుంచి తమిళనాడును సంపూర్ణ పొలిటికల్ పోటీ మార్కెట్‌గా మార్చిన ఘనత విజయ్‌దే!
తమిళనాట శక్తిమంతులైన యువ రాజకీయ నాయకుల సంఖ్య పెరుగుతోంది. డిప్యూటీ సీఎం, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే పాతుకుపోయారు. పీఎంకేకు చెందిన అణ్బుమణి రాందాస్, ఎన్కేటీ చీఫ్ సీమాన్, దళిత పాంథర్స్ అధ్యక్షుడు తోల్ తిరుమావలవన్, బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలైతో దళపతి విజయ్ పోటీ పడుతున్నారు. ఆయనకున్న ఇమేజ్ ఆధారంగా ఓట్ల శాతాన్ని లెక్కిస్తే మాత్రం ఉదయనిధితో మాత్రమే పోటీ అనుకోవాలి. విజయ్ పార్టీ ఇప్పటికే నాలుగు లక్షల వాట్సాప్ గ్రూపులను ప్రారంభించి ఆయన స్పీచులను జనంలోకి తీసుకెళ్తోంది. మూడు దశాబ్దాలుగా విజయ్ చేసిన సేవా కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పిస్తోంది. ఉదయనిధిని భవిష్యత్ ముఖ్యమంత్రిగా జనంలోకి తీసుకెళ్లేందుకు డీఎంకే యువజన విభాగం పనిచేస్తోంది. 76వ పడిలోకి ప్రవేశించిన డీఎంకే 50లక్షల మంది యువ సభ్యులతో బలోపేతం కావాలని చూస్తున్నది. వాళ్లంతా 35 ఏళ్ల లోపు వారే. పార్టీలో పనిచేసే ప్రతీ యువకుడు 20 ఓట్లు వేయించాలన్నది ఉదయనిధి స్టాలిన్ ఆలోచనా విధానం. అదే జరిగితే డీఎంకేకు 200 స్థానాలు (మొత్తం 234) దక్కడం ఖాయం. ‘‘స్టాలిన్ కొనసాగాలి. తమిళనాడు గెలవాలి’’ ఇదీ అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే నినాదం. మరోపక్క విజయ్ ‘‘డీఎంకే ఒక దుష్టశక్తి’’ అంటూ, ‘‘దుష్ట శిక్షణ... శిష్ట రక్షణ’’ కోసమే తమ పార్టీ ఆవిర్భవించిందని ప్రకటించారు. ఏ నినాదాలు ఎంతమందిని ఆకర్షిస్తున్నాయో తెలియాలంటే మరో మూడు నెలలు ఆగాల్సిందే.
ఏ. బొల్లంరాజు
సీనియర్ జర్నలిస్టు
Also Read:
అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..
మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..