అవినీతి కట్టడికి లాకర్లలో సొమ్ముపై పన్ను
ABN , Publish Date - Aug 04 , 2026 | 02:28 AM
ప్రపంచీకరణ తర్వాత భారతదేశ ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థల దగ్గర వేల కోట్లలో సంపద పోగుపడుతోంది. వందల కోట్లలో ప్రభుత్వ ఉద్యోగస్థుల దగ్గర అవినీతి సొమ్ము..
ప్రపంచీకరణ తర్వాత భారతదేశ ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థల దగ్గర వేల కోట్లలో సంపద పోగుపడుతోంది. వందల కోట్లలో ప్రభుత్వ ఉద్యోగస్థుల దగ్గర అవినీతి సొమ్ము బయటపడుతోంది. అవినీతి అనేది పెట్టుబడిదారీ వ్యవస్థ సాఫీగా నడవడానికి గ్రీజు లాంటిది అంటారు. ఈ అవినీతి వలన సంపన్నులకు వచ్చే నష్టమేమీ లేదు. బడుగు, పేద, బలహీన వర్గాలవారు మాత్రమే నష్టపోతారు. ‘అవినీతి సూచీ–2026’ ప్రకారం, అవినీతిలో.. ప్రపంచంలోని 182 దేశాల్లో మన దేశం 91వ స్థానంలో నిలిచింది. భారత్‌కు వంద పాయింట్లకు గాను 39 పాయింట్లు వచ్చాయి. ఇదే జీరో పాయింట్‌కు దిగిపోతే ఆ దేశాన్ని అత్యంత అవినీతిమయ దేశంగా పరిగణిస్తారు. వంద పాయింట్లకు చేరుకుంటే దాన్ని అవినీతిరహిత దేశంగా పరిగణిస్తారు.
మన దేశంలో అన్ని శాఖలలోను అవినీతి ఉంది. కానీ పోలీసు, రెవెన్యూ, మున్సిపాలిటీ, రవాణా, విద్యుత్తు, ఆరోగ్యం లాంటి శాఖలు ప్రముఖంగా ఉన్నాయి. అవినీతిని రూపుమాపలేకున్నా దాన్ని కట్టడి చేయగల యంత్రాంగం మన చేతిలో ఉంది. ప్రపంచంలోని కొన్ని దేశాల పాలనలో పారదర్శక పరిపాలన, కఠిన చట్టాలు, డిజిటల్ సేవలు, స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. అవి చైతన్యవంతమైన పౌర సమాజం ద్వారా అవినీతిని తగ్గించగలిగాయి. ఈనాడు పెరిగిన సాంకేతికతతో ప్రభుత్వ సేవల్లో డిజిటల్ విధానాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. సమాచార హక్కు చట్టం (RTI) వంటి చట్టాలను బాధ్యతాయుతంగా వినియోగించగలగాలి. లంచం ఇవ్వకుండా, తీసుకోకుండా ఉండే సామాజిక సంస్కృతిని పెంపొందించడానికి ప్రోత్సాహం ఉండాలి. ఎన్నికల్లో అభ్యర్థుల పనితీరు ఆధారంగా, నిజాయితీ ఆధారంగా ఓటు వేయాలి. ప్రజాప్రతినిధుల అవినీతిపై గ్రామసభలు, వార్డు సభలు వంటి ప్రజా పర్యవేక్షణ వ్యవస్థలు బలంగా ఉండాలి. అవినీతి ఆరోపణలను చట్టబద్ధమైన ఆధారాలతో సంబంధిత అధికారులకు తెలిసేలా చేయాలి. అవినీతి వ్యతిరేక పోరాటం ఒక్క నాయకుడు లేదా ఒక్క సంస్థతో సాధ్యం కాదు. అది ప్రజలు, ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, మీడియా, విద్యాసంస్థలు, పౌర సమాజం కలిసి చేసే నిరంతర కృషి.
అవినీతి కట్టడిలో భాగంగా– ప్రైవేటు, పబ్లిక్ అన్ని బ్యాంకులలోని లాకర్లను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వరాదు. లాకర్లను పూర్తిగా బ్యాంకులే మేనేజ్ చేయాలి. లాకర్లలోని డైమండ్స్, బంగారం, వెండి వాటి బరువు ఆధారంగా నెలవారీ ఆర్నమెంట్ టాక్స్ వసూలు చేయాలి. లాకర్‌లో దాచుకున్న నగదును లెక్కించాలి. నగదు మొత్తంపై కొంత శాతం పన్ను వసూలు చేయాలి. ప్రస్తుతం బ్యాంకులు సంవత్సరానికి కొంత లాకర్ ఫీజును వసూలు చేసి సంతృప్తి పడుతున్నాయి. అది అంత వరకే సరిపోదు. స్థిరాస్తులు, ఇళ్లు, బంగళాలు, ఫ్లాట్ల కాగితాలు దాచుకున్నట్లయితే వాటికి విలువ కట్టాలి. విలువ ఆధారంగా పన్నులు వసూలు చేయాలి. దీనివలన కొంత పారదర్శకత పెరుగుతుంది. అవినీతి సొమ్మును దాచిపెట్టుకోవడం కష్టం అవుతుంది. దీనివలన కొంతమేరకు మార్పు రావచ్చు.
వి. బాలరాజు
రిటైర్డు తహసీల్దారు
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..