కులం గోడలు ఆ ఒక్కచోటేనా?
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:28 AM
విద్య ద్వారా కులం అడ్డుగోడలు కూల్చుతామని రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడటాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఊహించలేం! సర్వాంతర్యామిలా కులం అన్నిరంగాల్లో పాతుకుపోయిన పరిస్థితుల్లో...
విద్య ద్వారా కులం అడ్డుగోడలు కూల్చుతామని రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడటాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఊహించలేం! సర్వాంతర్యామిలా కులం అన్నిరంగాల్లో పాతుకుపోయిన పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దాన్నొక అడ్డుగోడగా భావించటమే కాదు, దాన్ని కూల్చటానికంటూ ఒక కార్యాచరణనూ మొదలుపెట్టారు. ఒక కోణం నుంచి చూస్తే కారుచీకట్లో కాంతిరేఖలాగా ఇది కనిపిస్తుంది. మరో కోణం నుంచి చూస్తే ఇదొక ముందడుగు లాగానే కన్పిస్తుంది తప్ప గమ్యాన్ని చేరుకోగలమా? లేదా? అన్న సందేహాన్నీ కలగచేస్తుంది. ఇప్పటివరకూ విద్యావ్యవస్థను ఎంతగా దారితప్పించామో నిశితంగా పరిశీలిస్తే ఈ సందేహంలో సముచితతత్వం కొంతవరకూ అర్థమవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు విడివిడిగా రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటుచేయటం ద్వారా సమాజంలో ఉన్న కుల/వర్గ విభజనలను మరింతగా స్థిరీకరిస్తున్నామని రేవంత్ పదేపదే విమర్శిస్తున్నారు. విద్యార్థి దశలోనే పిల్లల్లో కులాల అడ్డుగోడలను కట్టటం ద్వారా వాళ్లలో సామాజిక సమానత్వ భావన, సౌభ్రాతృత్వం అభివృద్ధికావటం లేదని రేవంత్ వ్యక్తంచేస్తున్న ఆందోళనలో సహేతుకతను కాదనలేం. దీనికి విరుగుడుగా రేవంత్ ప్రభుత్వం ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ ప్రాజెక్టును చేపట్టింది. నియోజకవర్గానికి ఒకటిచొప్పున 119 స్కూళ్లు ఏర్పాటుచేయాలన్నది ఆ ప్రాజెక్టు లక్ష్యం. ఇప్పటికే చాలాచోట్ల వీటి నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. కొన్నిచోట్ల నిర్మాణాలూ మొదలయ్యాయి. ఒక్కో స్కూలుకు దాదాపు రూ.200 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అన్ని స్కూళ్లకు కలిపి రూ.21,000 కోట్లను వ్యయంచేయటానికి ప్రణాళికలూ తయారయ్యాయి. భారీ వ్యయమయ్యే ఏ ప్రాజెక్టుకూ స్వంత నిధులను కేటాయించలేని పరిస్థితి ఉండటంతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం విదేశీ, స్వదేశీ అప్పులనూ తీసుకువస్తున్నారు.
ఈ స్కూళ్లల్లో విద్యార్థులను ఎలా కలిపి ఉంచుతారో, అంటే ఒక తరగతిలో అన్ని వర్గాల పిల్లలూ ఉండే విధంగా ఎలాంటి ఏర్పాటుచేస్తారో ఇంకా స్పష్టంకాలేదు. ఇప్పుడున్న వర్గాలవారీ స్కూళ్లను అలాగే కొనసాగిస్తూ ఒకే కాంపౌండ్‌వాల్ పరిధిలోకి వాటిని తీసుకువచ్చినంత మాత్రాన పెద్దగా ప్రయోజనం ఉండదనే వాదనను కొన్ని ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆలోచనే ఇదైతే ఈ వాదనను అంత తేలికగా కొట్టేయలేం. విద్యాబోధనలో విడివిడిగానూ ఆటపాటల్లో మాత్రం కలివిడిగానూ ఉంచే ఏర్పాట్లు అనుకున్న ఫలితాలను ఇవ్వవు. కులరహిత ఆలోచనలనూ, హేతుబద్ధ అభిప్రాయాలనూ విద్యార్థుల్లో కలగచేయటానికి తరగతిగదులు ఉపయోగపడినట్లుగా మిగతావి ఉపయోగపడవు. ప్రబలంగా ఉండే అభిప్రాయాలను ప్రశ్నించే తత్వాన్నీ, కొత్త విషయాల పట్ల జిజ్ఞాసనూ తరగతి గదిలోనే పెంపొందించటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆటపాటల సమయంలో పోటీయే ప్రధానంగా ఉంటుంది తప్ప ఇతర ఆలోచనలపై అంతగా శ్రద్ధచూపే అవకాశం ఉంటుందని అనుకోలేం. కాస్త మంచి సౌకర్యాలతో మెరుగైన బోధనను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన రెసిడెన్షియల్ స్కూళ్లు సాధారణ ప్రభుత్వ పాఠశాలలతో పోల్చితే కొంతకాలం ఆశించిన ఫలితాలను ఎంతోకొంత అందించాయి. కానీ క్రమేపీ వాటికీ ఆదరణ తగ్గుతోన్న దృశ్యమే కనపడుతోంది. ఆ స్కూళ్లలోనూ సీట్లు మిగిలిపోతున్నాయి. ప్రమాణాలూ పడిపోతున్నాయి. వీటికి తోడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనారిటీలనే అడ్డుగోడలు విద్యార్థుల మధ్య స్థిరంగా ఉండటానికి అవి తోడ్పడుతున్నాయన్న వ్యాఖ్యలూ ఎక్కువయ్యాయి. బయట అన్నిరంగాల్లో కులం ఆధారంగా వ్యవహారాలు చేస్తూ, రాజకీయాలనే కులం లెక్కల చుట్టూ తిప్పుతున్న నేపథ్యంలో విద్యకు సంబంధించిన ఒక విభాగంలో కులాల అడ్డుగోడలను కూల్చివేయటమూ అంతతేలిక కాదు. ఈ పరిమితి ఉన్నా విద్యార్థుల్లో వ్యక్తిత్వం రూపొందే దశలో కులం అడ్డుగోడగా మారుతోందని గ్రహించి, దాన్నొక తీవ్రసమస్యగా పరిగణించటం స్వాగతించాల్సిన విషయమే!
పౌరులుగా అందరమూ సమానమన్న భావన పిల్లల్లో కలగటానికి పాఠశాలలకు మించిన వేదిక మరొకటి లేదు. పాఠ్యాంశాలను ఆ లక్ష్యంతో తయారుచేసి, కులం ఆధారంగా ఉండే మన సామాజిక వ్యవస్థతో కలిగే నష్టాన్ని అక్కడ చెప్పగలిగితే దానివల్ల కలిగే మేలు చాలా ఉంటుంది. కానీ మొత్తంగా పాఠశాల విద్యను మనంత దారుణంగా ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశాన్ని తీసుకున్నా అక్కడ ప్రభుత్వరంగంలోని పాఠశాలలు పటిష్ఠంగా ఉన్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఏడాదేడాదికి ప్రభుత్వ పాఠశాలను పిల్లలు వదిలేస్తున్న స్థితిని అక్కడ చూడలేం. వ్యక్తిత్వం పాదుకుని అదొక స్థిరత్వాన్ని సంపాదించుకునే దశ వరకూ అన్నివర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. సామాజిక సమానత్వ భావనకు బలమైన పునాదులు అలాగే పడుతున్నాయి. ఆర్థికంగా తారతమ్యాలున్న కుటుంబాల నుంచి వచ్చినా ఒకే పాఠశాలల్లో ఏళ్లపాటు కలిసి చదువుకోవటం వల్ల ఏర్పడిన సాహచర్యంతో ఒకొళ్ల పరిస్థితి మరొకళ్లు సహానుభూతితో అర్థంచేసుకునే వీలుంటుంది. అమెరికా అంటే అంతా ప్రైవేటుమయం అని అనుకుంటాం. కానీ అక్కడ 90శాతం పిల్లలు ప్రభుత్వరంగంలోని పాఠశాలల్లోనే చదువుతున్నారు. పన్నెండో తరగతి వరకూ ఉన్న పాఠశాలలు అక్కడ 1,37,000 ఉంటే, వాటిల్లో 30,500 మాత్రమే ప్రైవేటు స్కూళ్లు. వాటిల్లో చదివే విద్యార్థులు పదిశాతానికి మించరు. ఆ ప్రైవేటు స్కూళ్లు కూడా ప్రభుత్వం, స్థానిక సంస్థలు నిర్దేశించిన నిబంధనల మేరకే నడుస్తాయి. తెలంగాణలోనైనా, ఆంధ్రాలోనైనా 60శాతం మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలలను నిబంధనల ప్రకారం నడిపేలా చూస్తే చాలావరకూ మూతపడతాయి. మొత్తంగా పాఠశాల విద్యలో నాణ్యమైన విద్యను అందించటంలో ప్రభుత్వరంగంతో పాటు ప్రైవేటురంగం కూడా దిగజారేలా ప్రభుత్వ యంత్రాంగం తోడ్పడింది. కొంచెం అటూఇటూగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నిబంధనలమేరకు నడిచేలా ప్రైవేటురంగాన్ని నియంత్రించలేని అసమర్థత ఒక్క విద్యారంగానికే పరిమితం అవ్వలేదు. కానీ విద్యారంగంలో కనపడే ఆ అసమర్థత తెచ్చిపెట్టే విపరిణామాల ప్రభావం చాలాకాలంపాటు ఉంటుంది. ప్రాథమిక విద్యకు కొంచెం మెరుగ్గా ప్రాధాన్యం ఇచ్చిన రెండుమూడు రాష్ట్రాలు మానవాభివృద్ధిలో ముందున్నాయి. కేరళ, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌ను చూస్తే ఇదే అర్థం అవుతుంది. ఈ విషయాన్ని పాతికేళ్ల క్రితమే అమర్త్యసేన్, జాన్‌డ్రేజ్‌లు విశ్లేషించి చెప్పారు. ఇతర ప్రజాస్వామ్యదేశాలైన జర్మనీ (90–92శాతం), స్వీడన్ (85–90శాతం), ఫ్రాన్స్ (80–85శాతం), యునైటెడ్ కింగ్‌డమ్ (93శాతం)ల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే ఎక్కువ. నెదర్లాండ్స్, బెల్జియం లాంటి దేశాల్లో స్వల్పసంఖ్యలో ఉన్న ప్రైవేటు స్కూళ్లకు కూడా ప్రభుత్వ నిధులు అందుతాయి. అందుకే అవన్నీ నిబంధనలను కచ్చితంగా పాటిస్తాయి.
ఆగ్నేయాసియా దేశాలను తీసుకున్నా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించేవారే ఎక్కువ కనపడతారు. సింగపూర్ (90–95శాతం), మలేసియా (80–90శాతం), థాయిలాండ్ (75–85శాతం), ఇండోనేసియా (70–80శాతం) వియత్నాం (95శాతం), ఫిలిప్పీన్స్ (80–90శాతం) లాంటి దేశాలు కూడా భారత్ కంటే చాలా మెరుగైన స్థితిలోనే ఉన్నాయి. జపాన్‌లో అయితే 90శాతం పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. దక్షిణ కొరియాలో అయితే 98శాతం పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళుతున్నారు. అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, మెక్సికో, కొలంబియా, పెరు లాంటి దేశాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే ఎక్కువ.
పాఠశాల విద్యకు సముచిత ప్రాధాన్యాన్ని ఇవ్వనందుకు మనం చాలా మూల్యం చెల్లించాం. 1960ల నాటికే పాఠశాల విద్యకు ప్రాధాన్యాన్ని ఇచ్చిన దేశాలు ఆర్థికాభివృద్ధిలో దూసుకువెళ్లాయి. పటిష్ఠంగా పాఠశాల విద్యను పూర్తిచేసుకున్న దేశాల్లో నైపుణ్యం ఉన్న శ్రామికులు తొందరగా తయారవుతారు. ఆ సౌలభ్యం ఉంటే ప్రపంచమార్కెట్‌లో పోటీపడే రీతిలో వస్తూత్పత్తిచేయటానికి సాధ్యమవుతుంది. హాంకాంగ్, సింగపూర్, దక్షిణకొరియా, తైవాన్‌లు అలాగే ప్రపంచ మార్కెట్‌పై పట్టుని సాధించాయి. జపాన్ ఆ సామర్థ్యాన్ని 20వ శతాబ్దం ఆరంభం నాటికే సాధించింది. తొలినుంచీ మనం పాఠశాల విద్యకు అవసరమైన ప్రాధాన్యం ఇవ్వకుండా యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంల వైపు అధిక మొగ్గు చూపించాం. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ ఇముడ్చుకోలేని సంఖ్యలో ఉన్నత విద్యారంగం నుంచి విద్యార్థులు తయారయ్యారు. అందుకే ఈ వర్గం విద్యార్థుల చూపు విదేశాల వైపు మళ్లింది. వలసపోవటం వల్ల ఉన్నత శాస్త్ర, సాంకేతిక విద్యావంతుల నుంచి అవసరమైన ఆవిష్కరణలూ దేశంలో తగినంతగా రాలేదు. ఉన్నత విద్యకు అతిగా ప్రాధాన్యం ఇవ్వటంతో దాన్ని అగ్రకులాల పిల్లలే ఎక్కువగా అందిపుచ్చుకున్నారు. విదేశాలకు వెళ్లిన వాళ్లలో ఆ కులాల పిల్లలదే సింహభాగమైంది.
విడివిడి గురుకులాల వల్ల కులం గోడలు గట్టిపడుతున్నాయని గుర్తించటం వరకూ బాగానే ఉంది. ఇతరత్రా గట్టిపడుతున్న కులం గోడలను కూడా గుర్తించి విరుగుడు చర్యలు తీసుకోకపోతే అవింకా గట్టిపడతాయి. కులాలు, మతాలు అవాంఛనీయంగా బలపడటానికి రాజకీయాలే ప్రధానకారణం. మందిర్–మసీదు చుట్టూ వివాదాలు చెలరేగి వైమనస్యాలు పెరగటానికి రాజకీయాలే కీలకపాత్రను పోషించాయి. నిజమైన వెనుకబాటుతనాన్నీ, ఆర్థిక అంతరాలనూ పరిగణనలోకి తీసుకోకుండా, గుండుగుత్తగా కులాల జనాభా ప్రకారమే పదవులూ, ఉద్యోగాల్లో వాటాలు నిర్ణయం కావాలన్న రాజకీయ నినాదాలు... బలహీనమవుతున్న గోడలను బలోపేతమే చేస్తున్నాయి. పార్టీలు టిక్కెట్లను కులాల లెక్కల ఆధారంగా కేటాయించటం గోడలను కూలిపోకుండా కాపాడుతున్నాయి. ప్రతికులానికి ఒక కార్పొరేషన్ పెట్టి భూములనూ నిధులనూ కేటాయించి, పదవులను పంచిపెట్టటం గోడలు పటిష్ఠం అవ్వటానికే దోహదం చేస్తున్నాయి. ఆధునిక పరిశ్రమల ధాటికి కకావికలు అయిపోయిన సంప్రదాయ వృత్తులను కాపాడటానికి కార్పొరేషన్లను ఏర్పాటుచేస్తే అర్థంపర్థం ఉంటుంది. ఎటువంటి సంప్రదాయ వృత్తుల్లో లేని అగ్రకులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటుచేసి పదవులను కట్టబెట్టటం ఆ గోడలను కాపాడే రాజకీయాలే అవుతాయి. కులాన్ని ఒకచోట బలహీనపరచటం సంతోషించాల్సిన విషయమే అయినా దాని ఊడలు అన్నిరంగాల్లోనూ వ్యాపించాయి. ఊడలు సమస్యే కావచ్చు కానీ వృక్షమే మూల సమస్య! దానికి అన్నిరకాల పోషకాలు అందించటమే అసలు విషాదం!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఇవి కూడా చదవండి..
‘నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో
ఆధ్యాత్మిక, సనాతన పరిరక్షణ కేంద్రాలుగా ఆలయాలు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
Read Latest AP News And Telugu News