రాజ్యసభను రసభరితం చేసిన సినారె
ABN , Publish Date - Jul 29 , 2026 | 02:16 AM
ఒక కవి.. ప్రజాప్రతినిధి అయితే ఎలా ఉంటుంది? సామాజిక సమస్యలపై బయట గళం ఎత్తే, పదాలతో విన్యాసం చేసే కవి, భావుకుడు చట్టసభల్లో ప్రవేశిస్తే ఏ విధంగా వ్యవహరిస్తారు? అందునా ఒక తెలుగు కవి సభలో ప్రవేశిస్తే...
ఒక కవి.. ప్రజాప్రతినిధి అయితే ఎలా ఉంటుంది? సామాజిక సమస్యలపై బయట గళం ఎత్తే, పదాలతో విన్యాసం చేసే కవి, భావుకుడు చట్టసభల్లో ప్రవేశిస్తే ఏ విధంగా వ్యవహరిస్తారు? అందునా ఒక తెలుగు కవి సభలో ప్రవేశిస్తే ఏ విధంగా విజృంభిస్తారో నిరూపించిన వ్యక్తి సినారె. 1997 నుంచి 2003 వరకూ రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుడిగా ఉన్న ఆయన సామాజిక, సాంస్కృతిక సమస్యలపై ఏ విధంగా గళమెత్తారో చాలా మందికి తెలియదు. కానీ 1996లో రాజ్యసభలో సభ్యుడినైన నాకు ఆ మహాకవిని చట్టసభలోకి ఆహ్వానించి, ఆయన అనర్గళంగా హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కవితాత్మకంగా మాట్లాడుతుంటే చూసే అదృష్టం లభించింది.
సినారెను నామినేట్ చేసినప్పుడు ఆయనతోపాటు పలువురు లబ్ధప్రతిష్ఠులు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. వారిలో పంజాబీ కవి కర్తార్ సింగ్ దుగ్గల్, సినీ దర్శకుడు మృణాల్ సేన్, సంఘ సేవకురాలు నిర్మలాదేశ్ పాండే, జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్, శాస్త్రవేత్త రాజా రామన్న, పత్రికా రచయిత చో రామస్వామి వంటి హేమాహేమీలు ఉన్నారు. ఆ రోజుల్లో రాజ్యసభలో చర్చల స్థాయి, ప్రమాణాలు భిన్నంగా ఉండేవి. పలువురు సభ్యులు మాట్లాడే విషయం, భాష ఉన్నత ప్రమాణాలతో ఉండేది. ఏ అంశం తీసుకున్నా అందులో వారికున్న అమోఘమైన పరిజ్ఞానం ఆశ్చర్యాన్ని కలిగించేది.
ఏదో నామినేటెడ్ పదవి కదా అని సినారె కాలక్షేపం చేస్తూ పదవీకాలాన్ని గడిపేయలేదు. పార్లమెంట్ ఉన్నన్ని రోజులూ ఆయన ఢిల్లీలో ఉండేవారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రశ్నలు గుప్పించేవారు. ప్రత్యేక ప్రస్తావనల విషయంలో ఆయనది అందెవేసిన చేయి. సినారె లేచి నిలబడ్డారంటే సభ అంతా ఆసక్తితో చెవులు రిక్కించి వినేది. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ మధ్యమధ్యలోనో, చివరిలోనో ఒక ఉర్దూ గజల్ వాక్యాల్ని చదివి సభను రసభరితం చేసేవారు. కవి, మేధావి కనుక సభలో ప్రస్తావించే అంశాల్లో ఎక్కువగా సాహిత్య, సాంస్కృతిక అంశాలు ఉండేవి. జర్నలిస్టులతో ముచ్చటించి ఎప్పటికప్పుడు తాజా విషయాలను తెలుసుకునేవారు.
పాఠశాలల్లో తెలుగుభాషను బోధించడం మానేయడంపై సినారె అనేకసార్లు తన ఆక్రోశాన్ని వ్యక్తపరిచారు. త్రిభాషా సూత్రాన్ని కచ్చితంగా పాటించాలని వాదించారు. తెలుగు ఫాంట్స్, సాఫ్ట్‌వేర్, ఈ–పాలనలో తెలుగుకు ప్రాధాన్యమివ్వడం కోసం ఆయన ప్రశ్నలు గుప్పించేవారు. దేశం నుంచి పెద్ద ఎత్తున మేధోవలస, విదేశీ మ్యూజియంలలో హిందూ దేవతలను అపహాస్యంగా ప్రదర్శించిన తీరుపై ఆయన ఆవేదన వెలిబుచ్చారు. గాంధీజీ విద్యాభ్యాసం చేసిన రాజ్‌కోట్ పాఠశాల శిథిలావస్థలో ఉండడంపై ఆయన సభలో మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సుభాష్ చంద్రబోస్ జన్మించిన కటక్‌లోని జానకీనాథ్ భవన్‌ను ఒక జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రముఖ హిందీ రచయిత మున్షీ ప్రేమ్‌చంద్ జన్మస్థలం వద్ద జాతీయ స్మారక చిహ్నాన్ని నిర్మించాలని కోరారు. బ్రిటిష్ మ్యూజియంలో అత్యంత విలువైన మన పురావస్తు చిహ్నాలు, ప్రాచీన దస్తావేజులు ఉన్నాయని, వాటిని కాపాడాలని సినారె ఆందోళన వ్యక్తం చేశారు. టెలివిజన్లలో హింసాకాండ, ఇంటర్నెట్‌లో అశ్లీలత, అవాంఛనీయమైన ప్రకటనల జారీ పెరిగిపోతున్నదని, దాన్ని అరికట్టాలని కోరారు. తుంగభద్ర ప్రాజెక్టుల వద్ద కట్టే వంతెనల వల్ల చరిత్రాత్మకమైన హంపీ నిర్మాణాలు దెబ్బతింటాయేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
భారతదేశంలో అన్ని చారిత్రక, సాహిత్య ఆధారాలను పద్ధతి ప్రకారం కేటలాగింగ్ చేసి భవిష్యత్ తరాల కోసం భద్రపరచాలని కోరారు. జాతీయ సాంస్కృతిక నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. పిల్లల కోసం ప్రత్యేక టీవీ చానెల్ ఏర్పాటు చేయాలని, నేషనల్ బుక్ ట్రస్ట్ నుంచి పిల్లల పుస్తకాల విభాగాన్ని వేరు చేసి ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలని కోరారు. గోల్కొండ కోటను యునెస్కో ప్రపంచ చరిత్రాత్మక స్థలంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని పార్లమెంట్‌లో పోరాడింది ఆయనే. ఒక దేశానికి గుర్తింపు దాని సంస్కృతే అని సినారె విస్పష్టంగా ఒక సందర్భంలో ప్రకటించారు. విద్య అనేది సమాచారపు కుప్ప కాదని, జీవితం జీర్ణించుకోలేని విద్యకు సార్థకత లేదని ఆయన స్పష్టీకరించారు. మన విలువలు దిగజారకుండా చూసుకోవడం ముఖ్యమని చెప్పారు.
ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో సినారె ముందుండేవారు. అంగన్‌వాడీ వర్కర్లకు గౌరవ వేతనం, ఇతర సౌకర్యాలు పెంచాలని ఆయన వాదించారు. రెండో లేబర్ కమిషన్ నివేదికను అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో కరువు పరిస్థితులు విలయతాండవం చేయడంపై ఆయన సభలో తీవ్ర ఆవేదన వ్యక్తంచేసి కేంద్రాన్ని ఆదుకొమ్మని కోరారు. కేరళలో పర్యావరణానికి జరుగుతున్న హానిని కూడా ఆయన ప్రస్తావించారు. మానవ వనరుల శాఖకు సంబంధించి పార్లమెంట్ స్థాయీ సంఘం నివేదికలను ఆయన పలుమార్లు సభకు సమర్పించారు. వాటిలో ప్రభుత్వాలకు విలువైన సూచనలు చేశారు. కేవలం కమిటీలు వేయడం వల్ల పని జరగదని, సూచనలు అమలు చేయాలని సభలో ఆయన గట్టిగా ప్రభుత్వానికి హితవు చెప్పారు.
అప్పటి ఉప ప్రధాని లాల్‌కృష్ణ అద్వానీ అధ్యక్షులుగా, నేను ఉపాధ్యక్షుడిగా ఉన్న పార్లమెంటరీ అధికార భాషా సంఘంలో నారాయణరెడ్డి సభ్యులుగా ఉండటం, దేశవ్యాప్తంగా ఇన్‌స్పెక్షన్ల సందర్భంగా పర్యటనలు చేయడం నాకు జీవితంలో దక్కిన మధురానుభూతులు. ఆయన లాగా తాను కవిత్వ భాషలో మాట్లాడలేనని, అంత భాష తనకు లేదని, ఉర్దూలో ఆయన ప్రావీణ్యం చెప్పుకోదగ్గదని శాస్త్రవేత్త రాజా రామన్న పలు సందర్భాల్లో ప్రశంసించారు. పార్లమెంటరీ చర్చలకు సినారె ప్రసంగాలు వన్నె తెచ్చాయని ఆయన మెచ్చుకున్నారు. సినారె పదవీ విరమణ చేసినప్పుడు ఆయనను సభలో తామెంతగా పోగొట్టుకుంటున్నామో ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకున్నారు. తనకు రాజకీయాలు లేవని, ఒక రచయితగా తాను సభలో ప్రవేశించానని సినారె పలు సందర్భాల్లో ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సినారె చేసిన ప్రసంగాలే ఆయన నిష్పాక్షిక ధోరణికి అద్దం పడతాయి.
తాను ఆశావాదినని, నిరాశ అనేది తన శబ్దకోశంలోనే లేదని సినారె సభలో పలుసార్లు వక్కాణించారు. ‘‘పూలు వాడిపోయాయని బాధపడను, ఫలాల కోసం ఎదురుచూస్తాను. ముళ్లపై నడిచి భావిని ఆహ్వానిస్తాను’’ అని ఆయన ఉర్దూ గజల్స్ వినిపించేవారు. తన రాజ్యసభ సభ్యత్వం ముగిసిన సందర్భంగా ఆ సభలో సినారె చివరిగా చేసిన ప్రసంగం ఎంతో ఆర్ద్రవంతంగా ముగిసింది. ఫిరోజ్ షా రోడ్‌లోని తన ఇంటి పిట్టగోడపై ఈ రోజు ఉదయం ఆరు పక్షులను చూశానని, అంతలోనే అవి ఎగిరిపోయాయని, అదే విధంగా రాజ్యసభలో తాను గడిపిన ఆరేళ్లూ పక్షుల్లా ఎగిరిపోయాయని సినారె చెప్పారు. ఆయన అనేక పక్షులకు ఆశ్రయం ఇచ్చే ఒక మహావృక్షం. నిత్య వసంతంతో కళకళలాడే ఆకుపచ్చటి ఆకులతో పథికులను ఆశీర్వదించే కల్పవృక్షం.
అప్పుడప్పుడూ పార్లమెంట్ ఇన్నర్, ఔటర్ లాబీలలో మెల్లగా నడిచి వెళ్తుండే ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయిని ఆపి, ఆయనకు సినారె గజల్స్ వినిపించేవారు. అప్పుడు నేను వారి పక్కనే ఉండటం.. వారానికి కనీసం రెండు, మూడు సాయంత్రాలు ఆయన సన్నిధిలో రసవంతం చేసుకోవటం వంటి అనేక అనుభవాలు కలగటం నా అదృష్టం.
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
(నేడు సి.నారాయణరెడ్డి 95వ జయంతి. హైదరాబాద్ రవీంద్రభారతిలో
డాక్టర్ కె.సచ్చిదానందన్‌కు సినారె జాతీయ సాహిత్య పురస్కారం ప్రదానం)
ఇవి కూడా చదవండి..
విదేశీయులే లక్ష్యంగా కోట్ల రూపాయల సైబర్ మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్
నేనెక్కడికీ పారిపోలేదు: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
Read Latest Telangana News And Telugu News