Share News

బుడగలు బుడగలుగా బురద

ABN , Publish Date - Jul 13 , 2026 | 01:43 AM

ఊరి బయటి బావుల్లో దూకి ఈదులాడిన, ఈతకు ఈతకు మధ్య బర్రెగొడ్లు గాసిన ఆ పిల్లోన్ని నేనే. ఊహల సముద్రాల పన్నీటిలో...

బుడగలు బుడగలుగా బురద

ఊరి బయటి బావుల్లో దూకి ఈదులాడిన,

ఈతకు ఈతకు మధ్య బర్రెగొడ్లు గాసిన

ఆ పిల్లోన్ని నేనే.

ఊహల సముద్రాల పన్నీటిలో

ఆ బటర్ ఫ్లై స్ట్రోక్స్ నా చేతులవే.

తేనెటీగల చురుకు గాట్లకు భయపడకుండా

ఈగలు దాచిన తేనెలలో తలమునకలయ్యిందీ,

చేతులు కోసుగా ముందుకు చాచి

పల్చని రెక్కల్లాంటి భుజాల మధ్య

దాగిన చిన్ని శిరస్సునయ్యిందీ నేనే.

సీతాకోకచిలుకనై తేలినా, గుండె లోపలికి దిగిన

గాయాలకు మందుగా తేనెపూతలు పూసినా,

బాల్యం మునగ-బెండ్లను నడుముకు కట్టి

నిర్భయంగా బావి పైగట్టు మీంచి దూకినా,

తేనెల తీపి తలపుల బూడిద వొళ్లంతా రాసుకుని

కుట్ట వచ్చిన తేనెటీగలను మాయపుచ్చి పంపినా,

ఊహలే కదా, ఇవేమీ శాశ్వతం కాదనే చావు తెలివితో

పన్నీటి మోహంలో పడి మునిగిపోకుండా బైట పడినా...

అవేం పెద్ద విశేషాలు? మన్వంతరాల మానవ సాహసాలే కదా?!

నా ఈత బాగా కొత్తగా వుండాలనుకుని, ఈ సారికి బావిగా

బురదను ఎన్నుకున్నాను, అటు సముద్రమూ కాదు

ఇటు మట్టీ కాదు, ఆ రెండూ కలిసిన బురద.

నీటికి తీరం మట్టి, మట్టికి తీరం నీరు

ఇప్పుడు నేను తీరం లేని బురదలో ఈదుతున్నాను.

ఈదుతూనే ఉన్నాను.

తీరం కనిపించకున్నా ఈ ఈతను ఆపలేను.

ఆపితే మునిగిపోతాను.

నా చేతుల తాకిడికో, పొరుగు మనిషి ఊపిరికో

గాలిలో ఎగిరి పడే బురద,

కాసేపు గట్టిపడి పగుళ్లు వారుతూ

తేమను పీల్చి లోపలికి కరుగుతూ

బుడగలు బుడగలుగా

భయంకర అభయంకర

రూపాలు ధరిస్తూ బురద...

కె. హనుమంతరెడ్డి

95023 45716

Also Read:

ఫిరంగి కోసం పోరాటం

వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు

Updated Date - Jul 13 , 2026 | 01:43 AM