భయంతో నడిచిన బీఆర్‌ఎస్ పాలన !
ABN , Publish Date - Feb 11 , 2026 | 01:15 AM
‘ఫోన్ ట్యాపింగ్’ ఆరోపణలు నిజమైతే, బీఆర్ఎస్ పాలనలో పౌరుడు ఒక స్వేచ్ఛాయుత వ్యక్తిగా కాదు, ఒక అనుమానితుడిగా జీవించినట్టే! ఇదే పోలీస్ స్టేట్ మొదటి లక్షణం. ఇక్కడ...
‘ఫోన్ ట్యాపింగ్’ ఆరోపణలు నిజమైతే, బీఆర్ఎస్ పాలనలో పౌరుడు ఒక స్వేచ్ఛాయుత వ్యక్తిగా కాదు, ఒక అనుమానితుడిగా జీవించినట్టే! ఇదే పోలీస్ స్టేట్ మొదటి లక్షణం. ఇక్కడ ‘‘గోప్యత’’ అన్నది కేవలం ఫోన్ కాల్స్‌కు సంబంధించిన విషయం కాదు; వ్యక్తి ఆత్మ గౌరవానికీ, నిర్భయంగా మాట్లాడే స్వేచ్ఛకూ సంబంధించిన విషయం. తెలంగాణ రాజకీయ చరిత్రలో బీఆర్ఎస్ పాలన ‘బలమైన ప్రభుత్వం’గా కాదు, ‘భయంతో నడిచిన పాలన’గా గుర్తుకొచ్చే పరిస్థితి ఏర్పడింది.
రాజకీయంగా ఇది కేసీఆర్ పాలనా శైలిని బహిర్గతం చేస్తుంది. ఆయన పాలన వ్యవస్థలపై కాదు, వ్యక్తులపై ఆధారపడి సాగింది. పోలీస్, ఇంటెలిజెన్స్, టెలికాం తదితర వ్యవస్థలన్నీ ఒకే శక్తి కేంద్రానికి లోబడి పనిచేశాయన్న ఆరోపణలు బీఆర్ఎస్‌ను ఒక పార్టీలా గాక, ఒక నెట్‌వర్క్ ఆఫ్ పవర్‌లా చూపిస్తున్నాయి. ఈ నెట్‌వర్క్‌లో రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, టెక్నాలజీ మధ్యవర్తులు ఒకే లక్ష్యానికి పనిచేశారా అన్నదే అసలు దర్యాప్తు ప్రశ్న.
ఈ కేసులో అత్యంత కీలకమైనది డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలు. ఫోన్ ట్యాపింగ్ నేరం ‘‘ఆదేశం ఇచ్చారా లేదా?’’ అనే రాజకీయ ప్రశ్న కాదు; ‘‘ఎవరి ఐపీ అడ్రస్ నుంచి?’’ ‘‘ఏ సర్వర్ ద్వారా?’’ ‘‘ఏ టెలికాం గేట్‌వేలో?’’ అనే శాస్త్రీయ ప్రశ్న. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిని మీడియా ట్రయల్‌గా కాకుండా, డేటా ట్రయల్‌గా తీసుకెళ్తోంది. ఇది కాంగ్రెస్ పాలనలో చట్టం పైనే రాజకీయాలు ఉంటాయన్న సంకేతం. బీఆర్ఎస్ దీనిని ‘రాజకీయ వేధింపులు’ అని వాదిస్తున్నా, ఒక నిజం మారదు, రాజకీయ వేధింపులకు డిజిటల్ లాగ్స్ ఉండవు. నేరాలకు ఉంటాయి. ఆ లాగ్స్ ఎక్కడున్నాయి? ఎవరు తుడిచేశారు? ఎందుకు తుడిచేశారు? ఈ మూడు ప్రశ్నలే కేసీఆర్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించవచ్చు.
ఇక్కడ మరో కీలక కోణం ఉంది: అది మీడియా స్వేచ్ఛ. జర్నలిస్టుల కాల్స్ ట్యాప్ చేయడం అంటే, అది వార్తలను కాదు, నిజాన్ని ట్యాప్ చేయడమే. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరమైన చర్య. ఎందుకంటే మీడియా భయపడే దేశంలో ప్రజలు పూర్తి అంధకారంలో ఉంటారు. తెలంగాణలో ఒక దశలో మీడియా మౌనంగా మారిందంటే, దానికి ఈ నిఘా సంస్కృతీ కారణమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కేసును ముందుకు తీసుకెళ్తుండటంతో ఒక కొత్త రాజకీయ ప్రమాణం ఏర్పడుతున్నది: గత పాలకులు కూడా చట్టానికి లోబడి ఉంటారు. ఇది కాంగ్రెస్‌కు ఒక నైతిక మూలధనం. ప్రతీకారం కాదు– పరిపాలన శుద్ధి. ఇదే తేడా.
చనగాని దయాకర్
టీపీసీసీ జనరల్ సెక్రటరీ
ఇవి కూడా చదవండి..
సవరణతో తిరిగి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విపక్షాలు
బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: యోగి ఆదిత్యనాథ్