కొత్త భాగ్యపథం భోగాపురం..
ABN , Publish Date - Aug 01 , 2026 | 01:10 AM
ఒకప్పుడు పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే భూమి, నీరు, విద్యుత్ చాలు అనుకునేవారు. నేడు ప్రపంచ పెట్టుబడిదారుడు ముందుగా అడిగేది ఒక్కటే... మీ ప్రాంతానికి అంతర్జాతీయ కనెక్టివిటీ ఎంత? ఆ ప్రశ్నకు ఇకపై...
ఒకప్పుడు పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే భూమి, నీరు, విద్యుత్ చాలు అనుకునేవారు. నేడు ప్రపంచ పెట్టుబడిదారుడు ముందుగా అడిగేది ఒక్కటే... మీ ప్రాంతానికి అంతర్జాతీయ కనెక్టివిటీ ఎంత? ఆ ప్రశ్నకు ఇకపై ఆంధ్రప్రదేశ్ గర్వంగా చూపించబోయే సమాధానం... భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది కేవలం మరో విమానాశ్రయం కాదు. ఉత్తరాంధ్ర భవిష్యత్తును ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించే స్ట్రాటజిక్ గేట్‌వే. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం విమానాశ్రయం, ఆంధ్రప్రదేశ్ విమానయాన చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతోంది.
దాదాపు రూ.4,700 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, తొలి దశలోనే సంవత్సరానికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను చేరవేసే సామర్థ్యంతో రూపొందింది. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దీన్ని మరింత విస్తరించేలా ప్రణాళిక సిద్ధమైంది. ప్రారంభం నుంచే అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న టెర్మినల్, బోయింగ్ 777, ఎయిర్ బస్‌లు దిగే దీర్ఘమైన రన్‌వే, తుపానులను తట్టుకునే పటిష్ఠమైన నిర్మాణం, 136 ఎకరాలలో ఏరోస్పేస్ యూనివర్సిటీ, విస్తృత కార్గో సదుపాయాలు, భవిష్యత్ విస్తరణకు అవసరమైన భూ సామర్థ్యం... ఇవి భోగాపురాన్ని సాధారణ ప్రాంతీయ విమానాశ్రయం కంటే ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
ప్రతిపాదిత ఏరోసిటీలో విమానాశ్రయం మాత్రమే కాదు, ఏరోస్పేస్– డిఫెన్స్ పార్క్, కార్గో– లాజిస్టిక్స్ హబ్, పరిశోధన–అభివృద్ధి కేంద్రాలు, డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, శిక్షణా క్యాంపస్‌లు, వాణిజ్య– నివాస ప్రాంతాలను ఒకే మాస్టర్‌ప్లాన్‌లో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో సుమారు 500 ఎకరాల ఏరోస్పేస్–డిఫెన్స్ పార్క్ కూడా ప్రతిపాదిత భాగంగా ఉంది.
కానీ భోగాపురం విమానాశ్రయ అసలు విలువ ప్రయాణికుల సంఖ్యలో లేదు. దాని భౌగోళిక స్థానంలో ఉంది. ఒకవైపు తూర్పు తీరంలోని ప్రధాన సముద్ర ద్వారం విశాఖపట్నం పోర్టు. మరోవైపు దేశంలో వేగంగా ఎదుగుతున్న ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు. భారత ఐటీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాఖ ఐటీ ఎకోసిస్టమ్. దేశ భద్రతలో అత్యంత కీలకమైన తూర్పు నౌకాదళ కమాండ్. హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, విశాఖ రిఫైనరీ, పెట్రోలియం నిల్వలు, స్టీల్ ప్లాంట్, ప్రత్యేక ఆర్థిక మండలాలు, రాబోయే పారిశ్రామిక కారిడార్లు. ఈ మొత్తం పారిశ్రామిక శక్తికి భోగాపురం సహజ వైమానిక కేంద్రంగా మారే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన నగరాలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఓడరేవు, విమానాశ్రయం, పరిశ్రమలు, లాజిస్టిక్స్... ఈ నాలుగు ఒకే ఆర్థిక వ్యవస్థగా పనిచేసినప్పుడే ఆ ప్రాంతం ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా ఎదుగుతుంది. భోగాపురం అదే అవకాశాన్ని ఉత్తరాంధ్రకు అందిస్తోంది. ఫార్మా రంగానికి సమయానికి సరుకు రవాణా అత్యంత కీలకం. అధిక విలువ కలిగిన ఔషధాలు, బయోటెక్ ఉత్పత్తులు, అత్యవసర వైద్య సరఫరాలు వేగవంతమైన ఎయిర్ కార్గోపై ఆధారపడతాయి. ఐటీ రంగానికి ప్రపంచంతో నిరంతర అనుసంధానం అవసరం. విదేశీ పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు, వ్యాపార ప్రతినిధుల రాకపోకలకు అంతర్జాతీయ విమాన సౌకర్యం కీలకం. విశాఖపట్నం పోర్టుకు చేరే అధిక విలువ కలిగిన సరుకులకు, సముద్ర–విమాన అనుసంధాన అవకాశాలను కూడా ఇది బలోపేతం చేస్తుంది. దేశ రక్షణ పరంగా కూడా తూర్పు నౌకాదళ కమాండ్ ఉన్న ప్రాంతానికి ఆధునిక అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన అంశమే. అందుకే భోగాపురాన్ని కేవలం ‘మరో విమానాశ్రయం’గా చూడటం సరైంది కాదు. ఇది ఉత్తరాంధ్రకు లాజిస్టిక్స్ హబ్‌గా, ఎగుమతుల కేంద్రంగా, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా, ప్రపంచ మార్కెట్లకు నేరుగా అనుసంధానించే ఆర్థిక ద్వారంగా మారే సామర్థ్యం కలిగిన మౌలిక సదుపాయం.
సాదినేని యామినిశర్మ
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
ఈ వార్తలనూ చదవండి:
పీఓకేలో దాడులపై తీవ్రంగా స్పందించిన భారత్
కరాచీలో ‘ధురంధర్’ సీన్ రిపీట్.. ఉజైర్ బలోచ్ సోదరుడిపై కాల్పులు