ఉత్తరాంధ్ర వికాసంలో నూతన అధ్యాయం!
ABN , Publish Date - Aug 01 , 2026 | 01:14 AM
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చరిత్రలో 2026 ఆగస్టు 1 నూతన అధ్యాయానికి నాంది పలకబోతున్నది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, భోగాపురంలో నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని...
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చరిత్రలో 2026 ఆగస్టు 1 నూతన అధ్యాయానికి నాంది పలకబోతున్నది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, భోగాపురంలో నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని’ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. సాధారణంగా విమానాశ్రయాలు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తాయి. కానీ కొన్ని ప్రాజెక్టులు మాత్రమే ఒక ప్రాంత ఆర్థిక రూపురేఖలను పూర్తిగా మార్చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సరిగ్గా అటువంటి ప్రాజెక్టే!
మౌలిక సదుపాయాల కల్పన ఏ ప్రాంత ఆర్థికాభివృద్ధికైనా పునాది వంటిది. రోడ్లు గ్రామాలను అనుసంధానిస్తే, రైల్వేలు పరిశ్రమలను కలుపుతాయి. ఓడరేవులు దేశాల మధ్య వ్యాపారాన్ని విస్తరిస్తే, విమానాశ్రయాలు ప్రపంచ స్థాయి అవకాశాలను ముంగిట్లోకి తీసుకొస్తాయి. నేటి గ్లోబల్ ఎకానమీలో అంతర్జాతీయ స్థాయి ఏవియేషన్ రవాణా వ్యవస్థ ఉంటేనే విదేశీ పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక ఎగుమతులు, రియల్ ఎస్టేట్, ఉద్యోగావకాశాలు విస్తరిస్తాయి. ఈ ఆలోచనా సరళితోనే కూటమి ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయాన్ని అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దింది.
దశాబ్దాలుగా విశాఖపట్నం ఉత్తరాంధ్రకు ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లుతున్నా, ప్రస్తుతం ఉన్న విశాఖ విమానాశ్రయం పూర్తిస్థాయి పౌర విమానాశ్రయం కాదు. దీంతో ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థలు విశాఖకు తగినన్ని సర్వీసులు నడపలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. విశాఖపట్నం ఐటీ, ఫార్మా, వైద్యం, విద్య పర్యాటక రంగాల్లో అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా ఎదుగుతున్న వేళ, ఒక పూర్తిస్థాయి పౌర అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఏర్పడింది.
2014లో విశాఖ సమీపంలోని భోగాపురాన్ని గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి అనువైన ప్రాంతంగా గుర్తించారు. 2019 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కేవలం విమానాశ్రయమే కాకుండా ఏరోసిటీ, విమానాల మరమ్మతులు, పైలట్ శిక్షణ కేంద్రాలతో కూడిన లాజిస్టిక్స్ హబ్‌గా దీనిని డిజైన్ చేశారు. భూసేకరణ చేపట్టి, ఇళ్లు కోల్పోయిన 390 కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు ప్రత్యేక కాలనీలు నిర్మించారు.
తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. గత ప్రభుత్వం ఈ ఒప్పందాలను తిరగదోడి, జీఎంఆర్ సంస్థకు కేటాయించిన 2,703 ఎకరాల్లో 500 ఎకరాలను వెనక్కి తీసుకుని విమానాశ్రయం సమగ్ర రూపురేఖలను దెబ్బతీసింది. ఐదేళ్ల కాలంలో కేవలం 26శాతం పనులే పూర్తిచేసి కాలయాపన చేసింది. కానీ, 2024లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఈ ప్రాజెక్టు మళ్లీ శరవేగంగా పట్టాలెక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించగా, కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు క్షేత్రస్థాయిలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ రోజుకు 5,000 మంది కార్మికులతో 24 గంటలూ రాత్రింబవళ్లు పనులు జరిగేలా చర్యలు తీసుకున్నారు. దీనికి తోడు ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇస్తున్న ప్రాధాన్యంతో, అనుకున్న గడువు కంటే ముందే ఈ భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. జనసేన పార్టీ మొదటి నుంచీ ప్రాంతీయ అసమానతలు తొలగిపోవాలని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి ప్రాంతాలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించింది.
సుమారు రూ.4,700 కోట్ల భారీ వ్యయంతో 2,700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం దేశంలోనే అత్యంత ఆధునిక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులలో ఒకటి. ఇక్కడ నిర్మించిన 3.8 కిలోమీటర్ల సుదీర్ఘ ‘కోడ్ 4ఈ’ రన్‌వే ద్వారా భారీ అంతర్జాతీయ విమానాలు కూడా సునాయాసంగా ల్యాండ్ అవుతాయి. 40 చెక్–ఇన్ కౌంటర్లు, 200 ప్యాసింజర్ సర్వీస్ కౌంటర్లతో పాటు ప్రాథమికంగా ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేలా ఈ టెర్మినల్ రూపుదిద్దుకుంది. పటిష్ఠమైన డ్రైనేజీ వ్యవస్థతో ప్రకృతి విపత్తులను సైతం తట్టుకునేలా అత్యున్నత ప్రమాణాలతో దీనిని నిర్మించారు. భోగాపురం కేంద్రంగా ఒక సమగ్ర ‘ఏవియేషన్ ఈకోసిస్టమ్’ రూపుదిద్దుకోబోతున్నది. ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల ఏరోసిటీ, లాజిస్టిక్స్ పార్కులు, కార్గో టెర్మినల్స్, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, వాణిజ్య సముదాయాలు ఏర్పడనున్నాయి. ఉత్తరాంధ్రలోని ఫార్మా, సీఫుడ్, పండ్లు, పూలు, వస్త్ర పరిశ్రమల ఎగుమతులకు అవకాశాలు పెరగడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం సాధిస్తున్న మౌలిక వసతుల విప్లవంలో భోగాపురం ప్రాజెక్టు ఒక మచ్చుతునక! జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల అనుసంధానం ద్వారా దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే క్రమంలో ఇది మరో చరిత్రాత్మక విజయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భోగాపురం అనేది కేవలం ఒక కనెక్టివిటీ మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసానికి, సరికొత్త అవకాశాలకు, ఉన్నత ఆశయాలకు సంకేతం. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌కు, పారిశ్రామిక ఆవిష్కరణలకు ఉత్తరాంధ్ర సిద్ధంగా ఉందనే బలమైన సందేశాన్ని ఇది ప్రపంచానికి చాటిచెబుతున్నది.
లింగమనేని రమేశ్
రాజ్యసభ సభ్యులు
ఈ వార్తలనూ చదవండి:
పీఓకేలో దాడులపై తీవ్రంగా స్పందించిన భారత్
కరాచీలో ‘ధురంధర్’ సీన్ రిపీట్.. ఉజైర్ బలోచ్ సోదరుడిపై కాల్పులు