తెలంగాణ అస్తిత్వ పునరుజ్జీవ శిల్పి
ABN , Publish Date - Oct 07 , 2026 | 02:17 AM
తెలంగాణ ముద్దుబిడ్డ బి.నర్సింగరావుకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను నేడు ప్రదానం చేస్తున్నది. మహోన్నత...
తెలంగాణ ముద్దుబిడ్డ బి.నర్సింగరావుకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను నేడు ప్రదానం చేస్తున్నది. మహోన్నత బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం అదే ఆయనను తెలంగాణ అస్తిత్వ పునరుజ్జీవ శిల్పిగా చేసింది. మరుగునపడిన తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో ఆయన పాత్ర అనిర్వచనీయం.
ఆయన అసాధారణ సృజనాత్మక పయనం భారతీయ సినిమా రంగానికే వన్నె తెచ్చింది. సరికొత్త రంగులు అద్దింది. తెలుగులో సమాంతర సినిమాను తెరపైకి తీసుకువచ్చింది. అది సాహిత్యం, నాటకం, దృశ్య కళలు, సంగీత పర్యవేక్షణ, ఫొటోగ్రఫీలకూ విస్తరించింది. తెలంగాణ మట్టి పరిమళాన్ని విశ్వవ్యాప్తం చేసిన మట్టిమనిషి ఆయన. ఆకాశమంత ఎత్తు ఎదిగినా... అణకువ ఆయన సొంతం.
బి.నర్సింగరావు 1946 డిసెంబర్ 26న సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అల్వాల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో చేరి చిత్రకళను అభ్యసించారు. అక్కడ మొదలైన ఆయన సృజనాత్మకత ఆ తరువాత హద్దులను అధిగమించింది. ఏ ఒక్క కళకో ఆయన పరిమితం కాలేదు. ఎన్నో కళల్లో నైపుణ్యం ఆయన సొంతం. పల్లెటూరి ప్రశాంత వాతావరణం, అక్కడి మనుషుల జీవితాలు, తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం ఆయన మనసుపై బలమైన ముద్ర వేశాయి. తదనంతర కాలంలో ఆయన ఎంచుకున్న కథల వైవిధ్యానికి పునాదిగా నిలిచాయి.
మఖ్దూం మొహియుద్దీన్ వంటి కవులతో ఉన్న సాన్నిహిత్యం ఆయన సామాజిక స్పృహకు మరింత పదును పెట్టింది. నాటకరంగంతో పరిచయం ఆయనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా తిప్పింది. తన నాటక బృందంతో కలసి ఆయన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. జానపద సంగీతంపై ఉన్న అభిమానం ఆయనను పల్లెబాట పట్టించింది. పల్లె సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అధ్యయనం చేయించింది. సినిమా, ఫొటోగ్రఫీ, చిత్రకళలో అది మనకు కనిపిస్తుంది.
1960లలో నర్సింగరావు హైదరాబాద్‌లో ఆర్ట్ లవర్స్ అసోసియేషన్‌ను స్థాపించారు. సాహిత్యం, నాటకరంగం, దృశ్య కళలు, సినిమాలలో ప్రయోగాలను ఈ అసోసియేషన్ ప్రోత్సహించేది. యువ ప్రతిభావంతులను తీర్చిదిద్దేది. తెలంగాణలో ఒక సరికొత్త సాంస్కృతికోద్యమానికి అది తెరతీసింది. అసోసియేషన్ నిర్వహించే చర్చలు, ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జానపద సంగీతం, ప్రాంతీయ వ్యక్తీకరణలకు పట్టం కట్టేవిగా ఉండేవి.
తెలుగు సమాంతర సినిమాలో నర్సింగరావు అగ్రగణ్యుడిగా నిలిచారు. తెలంగాణ పల్లె అందాలు, మాండలికాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను, కష్టజీవుల జీవితాలను తెలంగాణ తాత్వికతతో వెండితెరపై మొదటగా ఆవిష్కరించింది ఆయనే. ఆయన సినిమాలలో దేన్ని తీసుకున్నా అందులో చెప్పే విషయంపై దృశ్య రూపక సాధికారత అడుగడుగునా కనిపిస్తుంది. ఆయా చలనచిత్రాల్లో కనిపించే భావోద్వేగాలు గుండెల్ని పిండేస్తాయి. సాధారణ జీవితాలను అసాధారణ స్థాయిలో తెరకెక్కించిన ఘనత ఆయనది. 1979లో ఆయన నిర్మించిన ‘మా భూమి’లో దీన్ని పతాకస్థాయిలో చూడవచ్చు. తెలంగాణ గ్రామీణ సమాజం చారిత్రక అనుభవాలను, రైతాంగ పోరాటాన్ని తెరకెక్కించడం ద్వారా ఆ సినిమా ప్రాంతీయ కథల సార్వత్రిక స్పందనను చాటిచెప్పింది. భారతీయ సినిమా చరిత్రలో అది ఒక మైలురాయిగా నిలిచింది.
గ్రామీణ జీవితం, సామాజిక వాస్తవికతలు, ఆత్మగౌరవం, సమూహాల మధ్య ఉండే సంక్లిష్టతలు నర్సింగరావు సినిమాల్లో తెరపై జీవం పోసుకుంటాయి. రంగుల కల (1983), ది సిటీ (1987), మా ఊరు (1987), దాసి (1988), ఆకృతి (1989), మట్టి మనుషులు (1990), హరివిల్లు (2003) ఆయనకు బాగా పేరు తెచ్చాయి. దర్శకుడు, రచయిత, చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్, నాటకరంగ నిపుణుడు, సంగీత సృజనకారుడు, సాంస్కృతిక ఉద్యమకారుడు, కొన్ని సందర్భాల్లో నటుడిగా తెరపై కూడా కనిపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన.
ఫీచర్, నాన్ ఫీచర్ సినిమాలలో నర్సింగరావు కృషికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందాయి. గ్రామీణ జీవితాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన ఒక సాంస్కృతిక స్మృతి ‘మా ఊరు’. బెస్ట్ ఆంత్రపొలాజికల్ ఎథ్నోగ్రఫిక్ ఫిల్మ్ విభాగంలో ఆ చిత్రం నేషనల్ ఫిల్మ్ అవార్డు పొందింది. ఆయన డాక్యుమెంటేషన్ ‘బోనాలు–మహంకాళి జాతర’ 128 ఫొటోగ్రాఫ్‌లతో బోనాల పండుగ సందడికి అద్దం పడుతుంది. పండుగ ఆచారాలు, మనుషులు, సంప్రదాయాలు, నమ్మకాలు, సామూహిక భాగస్వామ్యం... అన్నీ కళ్లకు కనపడతాయి.
పుస్తకాలు, విజువల్ ప్రాజెక్టుల ద్వారా ఆయన తెలంగాణ కళాత్మక వారసత్వాన్ని జాతీయ, అంతర్జాతీయ వేదికలకు తీసుకెళ్లారు. ఆయన సంపాదకత్వంలో వచ్చిన ‘Art @ Telangana’ తెలంగాణ చిత్రకారులకు చక్కటి వేదికగా నిల్చింది. నర్సింగరావు ఐదు నేషనల్ ఫిల్మ్ అవార్డులు, నంది అవార్డులతో సహా పలు రాష్ట్ర పురస్కారాలు, అంతర్జాతీయ గుర్తింపులు పొందారు. ఆయన ఎన్నో ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు జ్యూరీగా వ్యవహరించారు. బి.నర్సింగరావు తన సినిమాలు, పెయింటింగ్స్, ఫొటోగ్రాఫ్స్, రచనలు, క్యూరేటివ్ వర్క్ ద్వారా తెలంగాణ అందం, ఆనందం, కష్టసుఖాలు, అనుబంధాలు, వేషభాషలు, సంక్లిష్టత, సృజనాత్మకతను యావత్ ప్రపంచం గుర్తించేలా చేశారు.
నర్ల వంశీమోహన్
జర్నలిస్ట్
ఈ వార్తలు కూడా చదవండి
నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు..
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్