అప్పుల పునాదులపై ఆశల సౌధం
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:51 AM
సొంతిల్లు.. సామాన్యుడి జీవితంలో అతిపెద్ద కల. కానీ ఆ గూడు కట్టుకునే క్రమంలో మధ్యతరగతి ప్రజలు తమ బతుకుల్ని, పిల్లల భవిష్యత్తును ఎలా తాకట్టు పెడుతున్నారన్నది ఇప్పుడు తీవ్ర ఆందోళన...
సొంతిల్లు.. సామాన్యుడి జీవితంలో అతిపెద్ద కల. కానీ ఆ గూడు కట్టుకునే క్రమంలో మధ్యతరగతి ప్రజలు తమ బతుకుల్ని, పిల్లల భవిష్యత్తును ఎలా తాకట్టు పెడుతున్నారన్నది ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం. ‘అందరికీ సొంతిల్లు’, ‘సులభమైన వాయిదాలు’ అంటూ ఊరిస్తున్న ప్రకటనల వెనుక.. రక్తం పీల్చుతున్న ఈఎంఐల వాస్తవ పరిస్థితులు మన కళ్ల ముందే కదలాడుతున్నాయి. ఒకప్పుడు రిటైర్మెంట్ వయసుకు దగ్గర పడుతున్నప్పుడు మాత్రమే సొంతింటి గురించి ఆలోచించేవారు. నేటి కార్పొరేట్ కల్చర్, బ్యాంకులు ఇస్తున్న భారీ రుణాలు, సమాజంలో పెరుగుతున్న పోటీతత్వం యువతను పాతికేళ్లకే ఇంటి రుణాల వైపు నెడుతున్నాయి. స్తోమతకు మించి భవిష్యత్తులో రాబోయే జీతాన్ని ముందే లెక్కలేసుకుని లక్షలకు లక్షలు అప్పులు చేస్తున్నారు.
నెలసరి వాయిదాలు చెల్లింపుల కోసం మధ్యతరగతి కుటుంబాలు తమ ప్రాథమిక అవసరాలను సైతం త్యాగం చేస్తున్నాయి. కొందరు పిల్లలను మంచి స్కూళ్లలో చదివించలేక సాధారణ పాఠశాలలకు మారుస్తున్నారు. చిన్నపాటి జబ్బులొస్తే ఆసుపత్రికి వెళ్లకుండా మెడికల్ షాపుల్లో మందులు, మాత్రలు తెచ్చుకుని సర్దుకుపోవాల్సిన సందర్భాలు అనేకం. కరోనా తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు, వ్యాపారాల్లో నష్టపోయిన వారు ఈఎంఐలు కట్టలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఒక్క నెల వాయిదా దాటితే చాలు.. బ్యాంకుల నుంచి వరుస ఫోన్ కాల్స్. పరువు పోతుందనే భయంతో, ఆ క్షణానికి గట్టెక్కడానికి అప్పుల మీద అప్పులు, క్రెడిట్ కార్డుల మీద నగదు విత్ డ్రాలు చేస్తూ ఊబిలో కూరుకుపోతున్నారు.
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అందమైన భావోద్వేగం, కానీ అది మన ప్రశాంతతను హరించేదిగా మారకూడదు. తమ ఆదాయం, భవిష్యత్ అవసరాలను కచ్చితంగా అంచనా వేసుకుని మాత్రమే ఇంటి బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. కలలు కనడం తప్పు కాదు, కానీ ఆ కలల సాకారం మన వర్తమానాన్ని, భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేదిగా ఉండకూడదు. అప్పుల ఊబిలో కూరుకుపోకుండా, వాస్తవిక ఆర్థిక ప్రణాళికతో అడుగులు వేసినప్పుడే ‘సొంతింటి కల’ నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.
నీలేష్
ఈ వార్తలనూ చదవండి:
దోషులను కఠినంగా శిక్షించాలి.. రామ్ మందిర్ విరాళాల వివాదంపై ఆర్ఎస్ఎస్..
గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటుకు కుట్ర.. 8 మంది అరెస్ట్..