Share News

స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా... ఏపీఈఎంసీఎల్‌ సుస్థిర అడుగులు

ABN , Publish Date - Jun 05 , 2026 | 01:20 AM

అభివృద్ధి అంటే కేవలం రహదారులు, పరిశ్రమలు, పెట్టుబడులు మాత్రమే కాదు... పర్యావరణాన్ని కాపాడుతూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత...

స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా... ఏపీఈఎంసీఎల్‌ సుస్థిర అడుగులు

అభివృద్ధి అంటే కేవలం రహదారులు, పరిశ్రమలు, పెట్టుబడులు మాత్రమే కాదు... పర్యావరణాన్ని కాపాడుతూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో సుస్థిర అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఆ అభివృద్ధిలో పరిశ్రమలది కూడా కీలక పాత్ర. అందుకే చంద్రబాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహిస్తూ పెట్టుబడుల దిశగా పలు పరిశ్రమలను ఆహ్వానిస్తున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో పర్యావరణహిత విధానాలు మరింత వేగవంతంగా అమలవుతున్నాయి. వారిరువురి ఆధ్వర్యంలో ఎన్నో పరిశ్రమలు మన రాష్ర్టంలోకి వచ్చి, అటు అభివృద్ధికీ ఇటు ఉపాధి కల్పనకూ దోహదం చేస్తున్నాయి.

అయితే, ఆ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను సమర్థంగా నిర్వహించడమన్నది సవాళ్లతో కూడుకున్న పని. ఆ వ్యర్థాలను ఇష్టానుసారంగా నదుల్లో వదిలేయడం, నేలపైన పారబోయడం వల్ల పర్యావరణానికి జరిగే హాని అంతా ఇంతా కాదు. ఆ దుష్ప్రభావాలను మనమే అనుభవించాల్సి ఉంటుంది. అందుకే పారిశ్రామిక వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ఏపీఈఎంసీఎల్‌)ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. పారిశ్రామిక, హానికర వ్యర్థాలను సేకరించి, సురక్షితంగా నిర్వహణ ప్లాంట్లకు తరలించేలా చూడటమే ఈ కార్పొరేషన్ ప్రాథమిక విధి.

గత ఆర్థిక సంవత్సరంలో 6.32లక్షల టన్నుల ప్రమాదకర వ్యర్థాలను డంపింగ్ యార్డులు, రీసైక్లింగ్ యూనిట్లు, సిమెంట్ పరిశ్రమలకు కో–ప్రాసెసింగ్ కోసం తరలించడం విశేషం. అదేవిధంగా 21.05 లక్షల కిలోలీటర్ల ద్రవ వ్యర్థాలను శుద్ధి కేంద్రాలకు పంపగా, 1.02 కోట్ల టన్నుల ఫ్లై యాష్‌ను ఇటుక తయారీ, సిమెంట్ పరిశ్రమల్లో వినియోగించేలా సమన్వయం చేసింది ఏపీఈఎంసీఎల్‌. అలాగే 43.61 లక్షల కిలోలీటర్ల శుద్ధి చేసిన వ్యర్థ జలాలను ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నుంచి సముద్రంలోకి వదిలింది. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కావు... పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రం తీసుకుంటున్న బాధ్యతాయుత చర్యలకు నిదర్శనం. గతంలో నియంత్రణ లేకుండా పారబోసిన పారిశ్రామిక వ్యర్థాలపై ఇప్పుడు డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలు అమల్లోకి రావడం పెద్ద మార్పు. ఏపీఈఎంసీఎల్‌ అభివృద్ధి చేసిన ఏపీ ఆన్‌లైన్‌ వేస్ట్ ఎక్స్ఛేంజ్‌ పోర్టల్‌ ద్వారా వ్యర్థాల సేకరణ నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్లకు తరలించే వరకు ప్రతి దశను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తున్నారు. వ్యర్థాలను తరలించే వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్ అమలు చేయడం ద్వారా అక్రమ డంపింగ్‌కు అడ్డుకట్ట పడుతోంది.


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర విజన్–2047కు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తోంది ఏపీఈఎంసీఎల్‌. పర్యావరణ పరిరక్షణను అభివృద్ధితో సమన్వయం చేస్తూ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్‌ను అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి ఏపీఈఎంసీఎల్‌ ఒక బలమైన వేదికగా నిలుస్తోంది. సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడమే అందుకు నిదర్శనం. అందుకే ‘వేస్ట్ టు వెల్త్’ భావనతో వ్యర్థాలను వనరులుగా మార్చే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోంది.

వ్యర్థ జలాలను శుద్ధి చేశాక నీటి వనరుల్లోకి వదిలేలా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చేపట్టిన పటిష్ఠ ఏర్పాట్లలో కీలకమైంది మెరైన్ అవుట్ ఫాల్ ప్రక్రియ. అంటే పరిశ్రమల్లోని ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లలో వ్యర్థ జలాలను శుద్ధి చేశాక నదులు, సముద్రాల్లోకి వదిలేయడం. అందుకోసం ఏపీఈఎంసీఎల్‌ మెరైన్‌ అవుట్ ఫాల్ యాప్‌ను రూపొందించింది. ఫార్మా, ఇతర రసాయన వ్యర్థాలను విడుదల చేసే పరిశ్రమలు... వ్యర్థ జలాల నమూనాలను సేకరించడానికీ, వాటి ఫలితాలను తెలుసుకోవడానికీ, ఆ జలాలను నదులు, సముద్రాల్లో వదలడానికి ఈ యాప్ ద్వారానే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిని సంప్రదిస్తాయి. ఎంతో పారదర్శంగా జరిగే ఈ ప్రక్రియకు కావాల్సిన సాంకేతికతను అందించి అటు పరిశ్రమలకూ, ఇటు పర్యావరణానికి ఏపీఈఎంసీఎల్ తన వంతు కృషి చేస్తోంది. అంతేకాదు, ఈ వ్యవస్థ దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కొన్ని పరిశ్రమలకు వ్యర్థ జలాలను శుద్ధి చేసే ప్లాంట్లు ఉన్నాయి. అలా లేని వాటికోసం ప్రైవేటుగా నిర్మించిన కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. అయినా ఏపీఈఎంసీఎల్ ఔత్సాహిక పరిశ్రమల కోసం సొంతంగా ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించే దిశగా ప్రణాళికలు వేసుకుంది.

నిర్వహణ పరంగా పరిశ్రమలు కావచ్చు, కాలుష్య నిబంధనల మానిటరింగ్ విషయంలో ప్రభుత్వం కావచ్చు... ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా, దాని ఫలితం ఎందరో సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడమే. అందుకు ఉదాహరణే గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ ఘటన. దానివల్ల ఎందరో అమాయకులు బలయ్యారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఏపీఈఎంసీఎల్ నిరంతరం శ్రమిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ కార్పొరేషన్‌కు అండగా ఉంటూ పరిశ్రమలకు ఊతమిస్తున్నారు. కాబట్టే ఆయా పరిశ్రమల యజమానులు మెరుగ్గా తమదైన రంగంలో రాణించగలుగుతున్నారు. పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ... ఈ మూడు పరస్పర విరుద్ధాలు కావని, సమన్వయంతో ముందుకు తీసుకెళ్లవచ్చని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి నిరూపిస్తోంది. పరిశ్రమలకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను ప్రోత్సహిస్తూనే కాలుష్య నియంత్రణలో కఠిన ప్రమాణాలు అమలుచేయడం సమతుల అభివృద్ధికి సంకేతం.


ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిదీ. ప్రభుత్వం రూపొందిస్తున్న హరిత విధానాలకు ప్రజల భాగస్వామ్యం కూడా తోడైతేనే స్వచ్ఛమైన, సుస్థిరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుంది. సాంకేతికత, పారదర్శకత, పర్యావరణ బాధ్యత... ఈ మూడు సూత్రాలతో ముందుకు సాగుతున్న ఏపీఈఎంసీఎల్‌ రాష్ట్రానికి ఒక గ్రీన్ గ్రోత్ మోడల్‌గా నిలుస్తోంది.

పోలంరెడ్డి దినేశ్‌రెడ్డి

చైర్మన్, ఏపీఈఎంసీఎల్

ఇవి కూడా చదవండి...

రెండేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరించండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం

బలమైన భారత్‌ కోసం యువత ఎదురుచూపు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 01:20 AM