పురపాలక చట్టాలను సవరిస్తేనే రిజర్వేషన్లకు న్యాయం!
ABN , Publish Date - Aug 11 , 2026 | 01:46 AM
పట్టణ స్థానిక సంస్థలైన నగర పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలలో చైర్‌పర్సన్, మేయర్ పోస్టులకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలకు రిజర్వేషన్ కల్పించిన...
పట్టణ స్థానిక సంస్థలైన నగర పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలలో చైర్‌పర్సన్, మేయర్ పోస్టులకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 123 పట్టణ స్థానిక సంస్థలలో 4 షెడ్యూల్డు తెగలకు, 17 షెడ్యూల్డు కులాలకు, 40 వెనుకబడిన తరగతులకు కేటాయించారు. ఆయా స్థానిక సంస్థలలో ఉన్న మొత్తం సీట్లలో– రిజర్వేషన్లతో కూడా కలిపి 50 శాతానికి తగ్గకుండా మహిళలకు కేటాయించాలని నిబంధనలు చెబుతున్నాయి. అలాగే, నగర పంచాయతీలు, మునిసిపాలిటీలలో వార్డు మెంబర్లకు, నగరపాలక సంస్థలలో కార్పొరేటర్ల పదవులకు రొటేషన్ పద్ధతిన రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల చట్టం–1965, సవరించిన ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థల చట్టం– 1994 ప్రకారం... పట్టణ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేయాలనే నిబంధనలు లేకపోయినా, 74వ, భారత రాజ్యాంగ సవరణ చట్టం ‘ఆర్టికల్ 243–టి’ ప్రకారం నగర పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలలో ఆయా ప్రత్యేక వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారు.
ప్రస్తుతం జీవో 59, తేది 10.09.2021 ప్రకారం, రాష్ట్రంలోని నగర పంచాయతీలు, మున్సిపాలిటీలలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. అదే విధంగా జీవో 60, తేది 10.09.2021ని అనుసరించి ప్రస్తుతం నగరపాలక సంస్థలలో ఆయా కేటగిరీలకు చెందినవారికి రిజర్వేషన్లు కేటాయిస్తున్నారు. ఈ రిజర్వేషన్లు ఆయా వర్గాల జనాభాకు తగినట్లుగా దామాషా ప్రకారం రొటేషన్ పద్ధతిలో ఉండాలనీ, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనీ అమలులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు తెలియజేస్తున్నాయి.
పట్టణ స్థానిక సంస్థలలో చైర్‌పర్సన్, మేయర్ పోస్టులకున్నట్టుగా వైస్ చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్ పోస్టులకు రిజర్వేషన్లు లేని కారణంగా, అసలు రిజర్వేషన్ పాలసీ అనే దానికే అర్థం లేకుండాపోతోంది. ఎందుకంటే– ఏదైనా ఒక మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ సీటు షెడ్యూల్డు కులాలకు కేటాయించినప్పుడు, ఏదైనా కారణంతో... అంటే చైర్‌పర్సన్ అనారోగ్యం లేదా పదవికి రాజీనామా చేయటం వంటి కారణాల వల్ల ఆ పదవికి తాత్కాలికంగా ఖాళీ ఏర్పడితే, ఆ పదవిలో కూర్చునే వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తే అయివుండాలి. అలాగే, షెడ్యూల్డ్ తెగలకు, వెనుకబడిన కులాలకు, మహిళలకు కేటాయించిన చైర్‌పర్సన్ పోస్టుల విషయంలో కూడా, ఆయా పదవులకు తాత్కాలికంగా ఖాళీ ఏర్పడితే, ఆయా వర్గాలకు సంబంధించిన వ్యక్తులే ఆ పదవులను అలంకరించాలి. కానీ, వాస్తవ పరిస్థితులలో అలా జరగటం లేదు.
రాష్ట్రంలో చాలా పట్టణ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ విధానం సక్రమంగా అమలు జరగటం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీల స్థానంలో ఆయా వర్గాలకు చెందనివారు, మహిళల స్థానంలో పురుషులు అధికారం పంచుకుంటున్నారు. ఇది రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్ స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకం, ఆయా వర్గాల వారికి అన్యాయంగా భావించాల్సి ఉంటుంది.
పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలలో చట్టాలను ఏనాడో సవరించుకున్న ఫలితంగా అక్కడ డిప్యూటీ మేయర్ పదవికి కూడా మేయర్ పదవికి చెందిన కేటగిరీ ననుసరించి రిజర్వేషన్ వర్తిస్తుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పట్టణ స్థానిక సంస్థల చట్టాలు సవరణకు నోచుకోకపోవటంతో రిజర్వేషన్ స్ఫూర్తికి భంగం కలుగుతోంది. నిజానికి మన రాష్ట్రంలో కూడా 2021లో వైస్ చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్ పదవులకు రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం జరిగింది. అయితే, ఆ రిజర్వేషన్లు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా కాకుండా చట్ట సవరణ ద్వారానే జరగాలనే కారణంతో అప్పటి ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అదే సంవత్సరం జూలైలో జారీ చేసిన జీవో 66 ద్వారా మున్సిపాలిటీలలో ఇద్దరు వైస్ చైర్‌పర్సన్‌లు, నగరపాలక సంస్థలలో ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న వైస్ చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్ పదవుల విషయంలో పైన తెలిపిన పరిస్థితులు మారి, ఆయా వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరగాలంటే ప్రస్తుత చట్టాలను సవరించాలి. అప్పుడే రాజ్యాంగం ద్వారా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనుకబడిన వర్గాల మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన రిజర్వేషన్లు పక్కాగా అమలు అవుతాయి. దీంతో రిజర్వేషన్ల వెనకున్న అసలు ఉద్దేశ్యం పూర్తిగా నెరవేరుతుంది. ఈ సంవత్సరాంతంలో జరగనున్న ఎన్నికలలోనైనా ప్రతి పట్టణ స్థానిక సంస్థలలోనూ రెండో అత్యున్నత ప్రజాప్రతినిధి పదవికి కూడా ప్రత్యేక రిజర్వేషన్‌ను అమలుచేసి, ఆయా వర్గాలకు సముచితమైన అవకాశాలు, ప్రాతినిధ్యం కల్పించాలి. అప్పుడే రాష్ట్రంలోని నగర పంచాయతీలు, పురపాలక సంఘాలు నగరపాలక సంస్థల పాలనా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం సాధ్యమవుతుంది.
వి. రాజేంద్రప్రసాద్
పురపాలక శాఖ విశ్రాంత ప్రాంతీయ సంచాలకులు
ఈ వార్తలు కూడా చదవండి
ఈ జీవోకు, ఫార్చ్యూన్ ఇండియా కథనానికి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం క్లారిటీ
వైసీపీ నేత చింతాడ రవికుమార్‌కు బిగుస్తోన్న ఉచ్చు