కూటమి పాలనలో ఆర్థిక పునరుజ్జీవనం
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:58 AM
తెలుగుదేశం కూటమి ప్రభుత్వ రెండేళ్ల ప్రస్థానంలో గర్వంగా చెప్పుకొనే అంశం లక్షల కోట్లతో పరిశ్రమల స్థాపన. వైసీపీ ఐదేళ్ల పాలనా కాలంలో దేశ విదేశీ పెట్టుబడులలో ఏపీ వాటా కేవలం 0.5శాతం కంటే...
తెలుగుదేశం కూటమి ప్రభుత్వ రెండేళ్ల ప్రస్థానంలో గర్వంగా చెప్పుకొనే అంశం లక్షల కోట్లతో పరిశ్రమల స్థాపన. వైసీపీ ఐదేళ్ల పాలనా కాలంలో దేశ విదేశీ పెట్టుబడులలో ఏపీ వాటా కేవలం 0.5శాతం కంటే తక్కువ. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన 24 నెలల్లోనే భారతదేశానికి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడులలో దాదాపు 26శాతం వాటాను ఏపీ సాధించింది. ఒక ప్రాంతం ఆర్థికంగా పునరుజ్జీవనం సాధించాలన్నా, పారిశ్రామికంగా నిలబడాలన్నా కేవలం భౌగోళిక వనరులు సరిపోవు; రాజకీయ పాలసీల స్పష్టత, పాలకుడిపై అంతర్జాతీయ సమాజానికి ఉండే విశ్వసనీయత అత్యంత అవసరం. గూగుల్, ఐబీఎం, రిలయన్స్, ఆర్సెలార్ మిట్టల్, బ్రూక్‌ఫీల్డ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఆక్సెంచర్, కేప్ జెమిని వంటి గ్లోబల్ దిగ్గజాలు క్యూ కట్టాయంటే కారణం– వ్యవస్థాగత విశ్వసనీయత. అంతర్జాతీయ వ్యాపార సమాజానికి ‘చంద్రబాబు నాయుడు’ అనే పేరు ఒక నమ్మకమైన ‘ఆర్థిక గ్యారంటీ’.
ఈ అద్భుత ప్రగతికి కారణం ప్రభుత్వం తెచ్చిన ‘ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0’తో పాటు సరికొత్త ఐటీ, గ్రీన్ ఎనర్జీ విధానాలు. గత పాలకుల రెడ్–టేపిజం స్థానంలో ‘రెడ్ కార్పెట్’ పరుస్తూ ప్రభుత్వం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ఫ్రేమ్‌వర్క్‌ను తెచ్చింది. కేవలం 14 నుంచి 21 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు లభించేలా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మూడు వ్యూహాత్మక ఆర్థిక క్లస్టర్లుగా విభజించి ప్రపంచ పరిశ్రమలను ఆకర్షించింది.
రూ.23లక్షల కోట్ల బృహత్తర పెట్టుబడులు ప్రధానంగా ఐదు రంగాలలో కేంద్రీకృతమయ్యాయి. క్లీన్ ఎనర్జీ– సస్టైనబిలిటీ రంగం రూ.12 లక్షల కోట్లతో సోలార్–విండ్ హైబ్రిడ్, పంప్డ్ హైడ్రో స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలకు విస్తరించింది. భారీ కోర్ పరిశ్రమలు, ఉత్పాదక రంగం రూ.4 లక్షల కోట్ల కమిట్‌మెంట్లతో ఉక్కు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీలను కలిగి ఉంది. సముద్ర పోర్టుల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ రంగానికి మరో రూ.4 లక్షల కోట్లు కేటాయించబడగా, డిజిటల్ ఎకానమీ రంగం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది.
ఉత్తరాంధ్ర క్లస్టర్ ఐటీ, భారీ పరిశ్రమల హబ్‌గా మారుతూ ఏపీ డిజిటల్, కోర్ ఎకానమీలను శాసించబోతోంది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా వైజాగ్‌లో గూగుల్ 1 గిగావాట్ డేటా సెంటర్‌ను, రిలయన్స్–బ్రూక్‌ఫీల్డ్ సంయుక్తంగా 1.5 గిగావాట్ గ్రీన్ ఎనర్జీ ఐటీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తుండగా, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ డీప్–టెక్ స్టార్టప్‌లకు ప్రధాన నోడ్‌గా నిలవనుంది. భారీ పరిశ్రమల విభాగంలో ఆర్సెలార్ మిట్టల్ రూ.1.25 లక్షల కోట్లతో ఉక్కు కర్మాగారాన్ని స్థాపిస్తుండగా, హిందుజా గ్రూప్ తన ప్లాంట్‌ను మరో 1,600 మెగావాట్ల సామర్థ్యంతో విస్తరిస్తోంది. ఏఎమ్ గ్రీన్ గ్రూప్ రూ.10,000 కోట్లతో సెకండ్ జనరేషన్ ఇథనాల్ బయో–రిఫైనరీలు, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాంట్ ద్వారా ‘ఫార్మ్–టు–ఫ్లైట్’ పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తోంది. ఇక ఐటీ రంగంలో కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఆక్సెంచర్, కేప్ జెమిని సంస్థలు ఉమ్మడిగా 45,000 కోడింగ్ ఉద్యోగాలను తెస్తున్నాయి. తద్వారా రాష్ట్రానికి భారీగా పన్ను ఆదాయం రానుంది.
కాకినాడ మొదలుకుని నెల్లూరు వరకు విస్తరించి ఉన్న కోస్తా ఆంధ్రా ప్రాంతం కీలక ఇంధన జోన్‌గా, పోర్ట్ ఆధారిత అభివృద్ధికి కేంద్రంగా నిలిచింది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. క్లీన్ ఎనర్జీ పెట్టుబడులలో 78.5 గిగావాట్ల సోలార్, 35 గిగావాట్ల విండ్ ఎనర్జీ సింహభాగం ఈ ప్రాంతానికే దక్కుతుండగా, కాకినాడ సమీపంలోని ఉప్పాడ వద్ద ‘ఏఎమ్ గ్రీన్ గ్రూప్’ రూ.44,000 కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద ‘గ్రీన్ అమ్మోనియా’ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. కృష్ణా జిల్లా, మల్లవల్లిలో హిందుజా గ్రూప్ ఎలక్ట్రిక్ బస్సులు, మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్ రక్షణరంగ నౌకల తయారీ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయి. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా ఐబీఎం 50 ఎకరాల్లో దేశంలోనే మొదటి కమర్షియల్ 156–క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ హబ్‌ను నిర్మిస్తోంది. దీనికి తోడు నెల్లూరు–తిరుపతి బోర్డర్‌లో రూ.25,000 కోట్ల పెట్టుబడులతో దేశంలోనే మొదటి ‘ట్విన్ స్పేస్ సిటీ’ల నిర్మాణానికి పునాది పడింది.
రాయలసీమ క్లస్టర్ ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ పరిశ్రమలకు హబ్‌గా మారుతోంది. కడప కొప్పర్తి నోడ్‌లో మొబైల్ విడిభాగాలు, సెమీకండక్టర్ అసెంబ్లీలు విస్తరిస్తుండగా, అదానీ గ్రూప్ రూ.12,297 కోట్లతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఓర్వకల్లు వద్ద 300 ఎకరాల్లో సమగ్ర డ్రోన్ సిటీకి పునాది పడగా, తిరుపతి క్లస్టర్ మెడికల్ ఎక్విప్‌మెంట్ హబ్‌గా మారుతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.51,300 కోట్ల భారీ సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఆమోదం లభించగా, కియా మోటార్స్ సమీపంలో రేమండ్ లిమిటెడ్ రూ.1,201 కోట్లతో ఆటో–కాంపోనెంట్ యూనిట్‌ను, రిలయన్స్ ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్ రూ.15,000 కోట్లతో 4 గిగావాట్ల క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుండగా, అనంతపురం, తిరుపతిలలో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటు కాబోతున్నాయి.
ఈ పారిశ్రామిక విప్లవానికి తగ్గట్టుగా దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ‘స్కిల్ సెన్సస్’ చేపట్టారు. దీని ద్వారా పరిశ్రమల తక్షణ అవసరాలకు అనుగుణంగా యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చేందుకు టాటా ఇన్నోవేషన్ హబ్స్, స్కిల్ యూనివర్సిటీలను అనుసంధానించారు. అలాగే, స్థానిక ఉపాధిని పెంచే ఎంఎస్ఎంఈ రంగానికి గత ప్రభుత్వం బకాయిపడిన వందల కోట్ల ఇన్సెంటివ్‌లను విడుదల చేయడమే కాకుండా, రూ.500 కోట్లతో ప్రత్యేక ‘ఎంఎస్ఎంఈ ఫండ్’ ఏర్పాటు చేసి చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం ఊపిరి పోసింది. ఐటీ, పారిశ్రామిక శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యూహం అంతా ‘Persevere–Pursue –Peruse–Patience’ అనే అచంచలమైన మంత్రం చుట్టూ సాగింది. రాబోయే మూడేళ్లలో ఈ మూడు క్లస్టర్ల ద్వారా 3,00,000 ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయి. రాష్ట్ర జీఎస్టీ అసాధారణ వృద్ధిని నమోదు చేసింది. మే 2026లో ఏపీ జీఎస్టీ 16.2శాతం వృద్ధి రేటుతో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది.
గత పాలకులు ‘అప్పు తెచ్చి పప్పు కూడు’ అన్న చందంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడితే, చంద్రబాబు ‘సంపద సృష్టి– ఉద్యోగాల కల్పన– పన్నుల రాబడి’ అనే త్రిశూల వ్యూహంతో ఏపీని దేశంలోనే నంబర్ వన్ ఆర్థిక శక్తిగా మారుస్తున్నారు.
నీలయపాలెం విజయ్‌కుమార్
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి
ఇవి కూడా చదవండి..
ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా కూటమి నేతలు..
మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయి: ఏఐసీసీ చీఫ్ ఖర్గే..