అసూయపడదగిన సౌందర్యాత్మక అనుభూతి!
ABN , Publish Date - Feb 08 , 2026 | 01:30 AM
ఆధునిక భారతీయ సామాజిక శాస్త్రం ఆంద్రే బెటీల్ (30 సెప్టెంబర్ 1934– 3ఫిబ్రవరి 2026)తో ఆరంభమయింది. భారతీయ గ్రామీణ సమాజాన్ని మౌలిక దృక్పథంతో అధ్యయనం చేసి, భావితరాలకు ఒక...
ఆధునిక భారతీయ సామాజిక శాస్త్రం ఆంద్రే బెటీల్ (30 సెప్టెంబర్ 1934– 3ఫిబ్రవరి 2026)తో ఆరంభమయింది. భారతీయ గ్రామీణ సమాజాన్ని మౌలిక దృక్పథంతో అధ్యయనం చేసి, భావితరాలకు ఒక విశాల విద్యాద్వారాన్ని తెరిచిన విద్వజ్ఞుడు బెటీల్. భారతదేశ సామాజిక నిర్మాణంలో కరడుగట్టిన సంప్రదాయ వ్యవస్థ నుంచి కులం, వర్గం, అధికారం ఆలంబనతో మరింత విభిన్నమైన, అసమానతల వ్యవస్థ ప్రభవించిన తీరుతెన్నులను 1965లో ప్రచురితమైన ఆయన పుస్తకం ‘Caste, Class and Power: Changing Patterns of Social Stratification in a Tanjore Village’ (కులం, వర్గం, అధికారం: తంజావూరు గ్రామంలో మారుతున్న వర్గీకరణ సంబంధాలు) ప్రతిభావంతంగా విశ్లేషించింది. ఇది, కేవలం మరొక గ్రామీణ సమాజ అధ్యయనం మాత్రమే కాదు, భారత రాజకీయాలను, సార్వత్రిక సామాజిక సిద్ధాంతంతో అనుసంధానించిన పరిశోధన అది. స్థానిక వాస్తవికతను సార్వత్రిక నియమబద్ధ ఆదర్శాలతో సమతుల్యం చేసిన మేధా కృషికి అదొక తార్కాణం. తమిళనాడులో బ్రాహ్మణ ఆధిపత్యంలోని ఒక గ్రామంలో ద్రావిడోద్యమ రాజకీయాలలో ప్రభవిస్తోన్న ధోరణులు, కుల పరమైన చైతన్యశీలత, ఆర్థిక, రాజకీయ సంఘటనల పర్యవసానాలు అన్నిటినీ బెటీల్ తన అధ్యయనంలో ఏకీకరించారు. వాటి పరిశీలనకు ఒక సమగ్ర భావనా చట్రాన్ని రూపొందించారు. మత, రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాలు ఇంకెంత మాత్రం ఏకకేంద్రంగా లేని గ్రామీణ భారతంలో ‘సంచిత అసమానతల నుండి చెదరగొట్టబడిన అసమానతలకు’ (From Cumulative to dispersed inequalities) పరివర్తనను అర్థం చేసుకోవడానికి ఆయన పరిశోధన గ్రంథం.. ‘కులం, వర్గం, అధికారం’ ఇప్పటికీ విశేషంగా తోడ్పడుతున్నది. గ్రామీణ సమాజ గతిశీలతను ‘సంచిత అసమానతల నుండి చెదరగొట్టబడిన అసమానతలకు’ అన్న భావన ప్రతిభావంతంగా సంగ్రహపరిచింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఒకే సమూహం అన్ని అధికారాలను కలిగి ఉన్న వ్యవస్థ విచ్ఛిన్నమై, వివిధ సమూహాలు వివిధ రకాల అధికారాలను కలిగి ఉన్న వ్యవస్థగా మారిన రీతిని అది వివరిస్తుంది. గ్రామీణ భారతదేశంలో ఇప్పటికీ అసమానతలు తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ వాటి స్వభావం మారిపోయింది. కులపరమైన నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఒకే వ్యక్తులు అగ్రస్థానంలో ఉండడం, ఒకే వ్యక్తులు దిగువున ఉండే పరిస్థితి అనేది సమసిపోయినందున అసమానతలు చెల్లాచెదురైపోయాయని బెటీల్ పరిశోధన విశ్లేషించింది.
భారతదేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాలలో కూడా ఒక ఉత్కృష్ట మేధావిగా బెటీల్ గౌరవాదరాలు పొందారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలో మేధాసంపన్నమైన ఉపన్యాసాలను వెలువరించారు. ఈ విశ్వమేధావి హృదయం, మేధ సదా భారతీయతతో స్పందిస్తూ ఉండేవి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విశ్వవిద్యాలయాలు ఆయనను బోధన విధులు, పరిశోధనల నేతృత్వానికి ఆహ్వానించినప్పటికీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (డీఎస్‌ఈ)లో మాత్రమే బోధించేందుకు ఆయన ఇష్టపడ్డారు. తన అధ్యాపక జీవితమంతా ఆ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలోనే గడిపారు. సమున్నతమైన బాధ్యతలు నిర్వహించేందుకు అమెరికా, యూరోపియన్ దేశాలు ఆహ్వానించినప్పటికీ ఆయన భారత్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. ఇదే విషయాన్ని ఆయన్ను ఎంతోమంది అడుగుతుండేవారు. డీఎస్‌ఈకే ఎందుకు ప్రాధాన్యమిచ్చారని నేనూ ఒకసారి ప్రశ్నించాను. అక్కడ బోధించడం, పనిచేయడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు ఆయన. అంతకుమించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అసలు నా ప్రశ్న పరిశీలనకు అనర్హమైనదిగా కొట్టివేస్తున్నట్టు ఆయన మాట ధ్వనించింది. తాను జాతీయవాదిననే ఘనమైన మాటలను ఆయన తన సమాధానంలో ఉపయోగించలేదు. ఒక సరళసత్యాన్ని అంతే నిరాడంబరంగా చెప్పారు: ‘ఇక్కడ నేను సంతృప్తి పొందుతున్నాను’. ఆ సమాధానంలోని భావం నాకు అర్థమయింది. అవును, ఆ సంతృప్తి మేధాపరమైన సంతృప్తి. బెటీల్ వంటి సమున్నత విద్యావేత్తలు మాత్రమే అటువంటి సంతృప్తిని ఆకాంక్షిస్తారు.
బెటీల్ తరచు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు వ్యాసాలు రాస్తుండేవారు. ఈ విషయంలో ఆయనొక పథనిర్దేశకుడు. గూఢమైన సామాజికశాస్త్ర అధ్యయనాంశాలను ప్రజల ఆసక్తులు, ఆందోళనలతో మిళితం చేసి ఆయన రాసిన వ్యాసాలు పాఠకులను బాగా ప్రభావితం చేసేవి. ప్రజా చర్చల ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడేందుకు బెటీల్ విశేషంగా దోహదం చేశారు. ఆయన రచనాశైలి సమ్మోహనంగా ఉండేది. ప్రసంగ బాణీ సమ్ముగ్థపరిచేది. ఆయన వ్యాసాలు చదవడానికి పాఠకులు, ప్రసంగాలు వినడానికి శ్రోతలు ఆరాటపడేవారు. ఆయన వాక్యాలు చాలా స్ఫుటంగా ఉండేవి, అర్థస్ఫోరకంగా ఉండేవి, రమ్యంగా ఉండేవి. అసూయపడదగిన సౌందర్యాత్మక అనుభూతినిచ్చే శైలి ఆయనది. ప్రజా వేదికలపై ఆయన వెలువరించే ఉపన్యాసాలు వినడానికి ఎంతో మంది వచ్చేవారు. మంచి సామాజిక శాస్త్రవేత్త కావాలని ఆకాంక్షించే యువ పరిశోధకులకు బెటీల్ ఒక సర్వోత్కృష్టమైన నమూనా.
దీపాంకర్ గుప్తా
సామాజిక శాస్త్రవేత్త
(ఇండియన్ ఎక్స్‌ప్రెస్)
ఇవి కూడా చదవండి..
మలేసియాలో త్వరలో కొత్త కాన్సులేట్.. ప్రవాస భారతీయల సమావేశంలో మోదీ
భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్