‘చరిత్ర’పుటల్లో వందేళ్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:12 AM
శతాబ్ది ఆంధ్ర విశ్వవిద్యాలయం విస్తృత పరిశోధనలతో భారత చరిత్రను ఆవిష్కరించింది. ప్రపంచ చరిత్రకే దిశానిర్దేశం చేసింది. ఇక్కడ చరిత్ర, పురావస్తు విభాగాలు సుదీర్ఘ పరిశోధనా లక్ష్యాలతో...
శతాబ్ది ఆంధ్ర విశ్వవిద్యాలయం విస్తృత పరిశోధనలతో భారత చరిత్రను ఆవిష్కరించింది. ప్రపంచ చరిత్రకే దిశానిర్దేశం చేసింది. ఇక్కడ చరిత్ర, పురావస్తు విభాగాలు సుదీర్ఘ పరిశోధనా లక్ష్యాలతో ప్రముఖ కేంద్రాలుగా నిలిచాయి. చరిత్ర విభాగం 1931లో మొదలై స్వతంత్రంగా ఎదిగి, ఉన్నతస్థాయి బోధన, పరిశోధన, క్షేత్ర అధ్యయనాలకు కేంద్రబిందువుగా మారింది. ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య (1889–1982) తెలుగు, ఆంగ్ల భాషల్లో చేసిన రచనలు భారత స్వాతంత్య్రోద్యమం, ప్రజాస్వామ్యం, పాలన, సమాజ మార్పులు వంటి అంశాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆంధ్రా ప్రాంతంలో స్వాతంత్య్రోద్యమ చరిత్రను విశదీకరించిన ప్రామాణిక గ్రంథం ‘ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’. తెలుగులో ‘ఆంధ్రాలో స్వాతంత్య్ర సమరము’, ‘ఆంధ్రదేశంలో స్వాతంత్య్ర పోరాట చరిత్ర’ గ్రంథాలను రాయడమే గాక, సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశం ప్రధాన సంపాదకునిగా ఆచార్య వెంకటరంగయ్య వ్యవహరించారు. రాజకీయ, చారిత్రక అంశాలను కూడా సామాన్య పాఠకుడికి అర్థమయ్యే శైలిలో ఆయన రాశారు. ఆధునిక తెలుగు వ్యావహారిక భాషను పరిపుష్టం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నాడు ఆయన ఈ విభాగ అభివృద్ధికి పునాదిరాయి వేశారు. భారత ప్రభుత్వం ఈయన్ని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
ఆచార్య హిరేన్ ముఖర్జీ, మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి ప్రఖ్యాత చరిత్రకారులు తమ బోధన, పరిశోధనలతో విభాగంలో విమర్శనాత్మక చారిత్రక ఆలోచనలను ప్రోత్సహించారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి గణతంత్ర భారత తొలి దశాబ్ది వరకు విభాగాధిపతిగా పనిచేసిన ప్రొఫెసర్ గొర్తి వెంకటరావు, మధ్యయుగ భారత చరిత్రలో తన ప్రావీణ్యంతో విభాగాన్ని ఉన్నతస్థితికి తీసుకొచ్చారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన వెంకటరావు బోధనతో పాటు పరిశోధనలో నాణ్యతను పెంపొందించారు. పి.టి.శ్రీనివాస అయ్యంగార్ చేసిన ఆంగ్ల మూల రచనకు గొర్తి వెంకటరావు సంపాదకత్వం వహించారు. మల్లంపల్లి సోమశేఖరశర్మ ఆంధ్ర విశ్వవిద్యాలయంతో అనుబంధం కలిగిన గొప్ప చరిత్రకారుడు. ఆంధ్ర చరిత్ర పరిశోధనకు పునాది వేసిన శాసన విజ్ఞాని. ముసునూరి నాయకులు, రెడ్డి రాజ్యాల చరిత్రపై ఆధారభూతమైన, ప్రామాణిక గ్రంథాలను రచించిన మహావిద్వాంసుడు. 1970లో ఈయన ‘విజయనగర ఎంపైర్’ గ్రంథాన్ని రాశారు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ సర్వేపల్లి గోపాల్ అధ్యాపకునిగా ఇక్కడ సేవలందించారు. చిన్నప్పటి నుంచి స్వాతంత్రోద్యమకారులు, జాతీయ నాయకుల మధ్య పెరిగిన వ్యక్తి. 1975–1984 మధ్య కాలంలో జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్ర (మూడు సంపుటాలు) ప్రచురించారు. 1992లో తన తండ్రి రాధాకృష్ణన్ జీవిత చరిత్రను స్వాతంత్య్రోద్యమంతో అనుసంధానం చేస్తూ ప్రచురించారు.
1965లో ‘భారతదేశంలో బ్రిటిష్ విధానం 1858–1905’ సామ్రాజ్యవాద పాలనపై విశ్లేషణ చేశారు. 1953లో లార్డ్ రిప్పన్ వైస్రాయ్ పాలన 1880–84 మధ్యకాలంలో వలస పాలనా విధానాలపై పరిశోధనా గ్రంథాన్ని ప్రచురించారు. 1957లో ‘లార్డ్ ఇర్విన్ (1926–31) వైస్రాయ్ పాలన’, బాబ్రీ మసీదు–రామజన్మభూమి సమస్య (1991–92) ఘటనల మీద ప్రచురించిన సంకలనాలకు సంపాదకత్వం వహించారు. ‘బెంగాల్‌లో శాశ్వత భూస్థిరీకరణ విధానం–దాని ఫలితాలు (1949)’ అనే గ్రంథంలో భూ విధానంపై ప్రాథమిక పరిశోధనాత్మక సంకలనాన్ని ప్రచురించారు. ‘ఆధునిక భారతదేశం (1967)’, ‘భారత చరిత్రపై సంక్షిప్త అవలోకనం’ వంటి గ్రంథాలను రచించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర విభాగంలో మరో ముఖ్యమైన మలుపు ప్రొఫెసర్ ఓరుగంటి రామచంద్రయ్య పాత్ర. ఈయనే మొదటిగా ఆంధ్రవిశ్వవిద్యాలయం చరిత్ర విభాగం నుంచి పీహెచ్‌డీ పొందారు. అంతేగాక, కామన్‌వెల్త్ మాడిఫైడ్ ఓవర్సీస్ స్కాలర్‌షిష్ పొందిన వ్యక్తి. దీంతో ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీలో రెండేళ్ళు పురావస్తుశాస్త్రంలో ఉన్నత శిక్షణ పొందారు. ఆయన తిరిగి ఇక్కడకు వచ్చిన తరువాత విభాగంలో పురావస్తుశాస్త్ర బోధన మొదలయింది. ఈయన మార్గదర్శకత్వంలో డాక్టర్ ఎ.వి.నరసింహమూర్తి పీహెచ్‌డీ పొందారు. ప్రముఖ భారతీయ పురావస్తు శాస్త్రవేత్త, శాసన విజ్ఞాన నిపుణుడు, నాణేల శాస్త్రవేత్తగా ఆయన ఎదిగారు. ప్రొఫెసర్ కె.ఎ.నీలకంఠశాస్త్రి శిష్యుడైన ఈయన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో విశేష సేవలందించి ఆంధ్ర విశ్వవిద్యాలయ ఘనచరిత్ర చాటారు. ప్రొఫెసర్ రాయప్రోలు సుబ్రహ్మణ్యం ఈ చరిత్ర విభాగంలో అకడమిక్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లారు.
1953లో భారత చరిత్ర కాంగ్రెస్ 16వ వార్షిక సమావేశాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం నిర్వహించింది. దీనికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షత వహించారు. తర్వాత తరంలో ఆచార్య సి.సోమసుందరం, ఆచార్య కె.కమలవాసిని, ఆచార్య వై.శ్రీరామమూర్తి వంటి పరిశోధకులు ఈ విభాగాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దారు. సి.సోమసుందరం ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్, సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ల విభాగాల అధ్యక్షుడిగా వ్యవహరించారు. కె.కమలవాసిని ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని కళ, ఐకనోగ్రఫీ, దేవాలయ చరిత్రపై పరిశోధనలు చేసిన ప్రముఖ పండితురాలు. వై.శ్రీరామమూర్తి 18వ శతాబ్దం మచిలీపట్నం చరిత్ర (2000), తెన్నేటి విశ్వనాథం–ఒక చారిత్రక అధ్యయనం (2003) గ్రంథాలు రాశారు.
ఆచార్య మైనేని కృష్ణకుమారి మంచి పరిశోధన రచనలు చేశారు. మధ్యయుగ ఆంధ్రంలో అరుదైన కారైక్కాల్ అమ్మయ్యార్ శిల్పం, అలాగే ఎనిమిది సంఖ్యకు ఉన్న సామాజిక, మత ప్రాముఖ్యం వంటి కొత్త అంశాలను ఆమె వెల్లడించారు. ఒక చిత్రం వెయ్యి మాటలకు సమానం అనే భావనతో ప్రతిపాదించిన సిద్ధాంతాలు, వాదనల ఆధారంగా అనేక రేఖాచిత్రాల్ని ఆమె విశ్లేషించారు. ‘‘సెర్మన్ ఫ్రమ్ స్టోన్స్–కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆంధ్ర–ఆర్ట్, కల్చర్ అండ్ థాట్’’, ‘మృణాల్ పెయింటింగ్స్ ఆఫ్ ఆంధ్ర’, ‘ఐకనోగ్రఫీ అండ్ ఆర్ట్ ఆఫ్ ఆంధ్ర–లెసర్ నోన్ ఫ్యాక్ట్స్’, ‘మల్టిఫుల్ హెడెడ్ అండ్ హైబ్రీడ్ గాడ్స్–ఇన్ ది టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా’ పరిశోధన వ్యాస సంకలనాలను ఆచార్య కృష్ణకుమారి ప్రచురించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం ప్రాంతీయ చరిత్రను దేశచరిత్రలో శాస్త్రీయంగా పదిలపరిచింది. చరిత్ర, పురావస్తు విభాగం భారతీయ విశ్వవిద్యాలయాల చరిత్రలో నిరంతర పరిశోధనలను కొనసాగిస్తూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలిచింది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, చాళుక్యుల అధ్యయనాలతో పాటు, ఆధునిక రాజకీయ, సామాజిక ఉద్యమాల మీద విశేష పరిశోధనల్ని అందించింది. ఈ విభాగం నుంచి ఎంతో మంది విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదిగి ప్రపంచ విద్యారంగంలో తమదైన ముద్రవేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర, పురావస్తుశాఖలు సాధించిన పరిశోధన ప్రగతిని శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం.
డాక్టర్ సిహెచ్. మధుసూదనరావు
ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పొందూరు
ఇవి కూడా చదవండి..
నిలకడగా ఇంధన భద్రత, మరిన్ని నౌకలు వస్తున్నాయి.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం భరోసా
డీజిల్, పెట్రోల్‌కు ఎలాంటి కొరత లేదు: కేంద్రం ప్రకటన