Share News

బీసీ చట్టం.. దుర్వినియోగం కాకూడదు!

ABN , Publish Date - Mar 24 , 2026 | 02:02 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన (తెలంగాణలో ఇంకా డిమాండ్‌గానే మిగిలిపోయింది) ‘బీసీ రక్షణ చట్టం’ (బీసీ అట్రాసిటీ యాక్ట్) బీసీల ఆత్మగౌరవానికి, భద్రతకు ఒక...

బీసీ చట్టం.. దుర్వినియోగం కాకూడదు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన (తెలంగాణలో ఇంకా డిమాండ్‌గానే మిగిలిపోయింది) ‘బీసీ రక్షణ చట్టం’ (బీసీ అట్రాసిటీ యాక్ట్) బీసీల ఆత్మగౌరవానికి, భద్రతకు ఒక ముఖ్యమైన అడుగు. గతంలో బీసీ మహాజన సమితి వేదికగా అమరుడు ఉ.సా. (యు. సాంబశివరావు) వంటి ఉద్యమకారులతో కలిసి ఈ డిమాండ్‌ను రూపొందించే ప్రక్రియలో భాగస్వామినైన నేను, ఈ సందర్భంగా కొన్ని అంశాలు ప్రస్తావించదల్చుకున్నాను.

ఇటీవల అలహాబాద్ హైకోర్టు ‘కేవలం ఎస్సీ/ఎస్టీ అని చెప్పినంత మాత్రాన ఎఫ్ఐఆర్ నమోదు చేయనవసరం లేదు’ అని వ్యాఖ్యానించింది. భారతీయ సామాజిక వాస్తవాల్లో బాధితులకు న్యాయం అందకపోవడమే ప్రధాన సమస్యగా ఉన్నప్పుడు, ఇలాంటి వ్యాఖ్యలు అగ్రవర్ణ ఆధిపత్యానికి ఊతమిచ్చేవిగా మారుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా ‘బహిరంగంగా అవమానించినప్పుడే అట్రాసిటీ’ అని పరిమితులు విధించడం వల్ల, బాధితులు తమపై జరిగిన అవమానాలను నిరూపించుకోవడం కష్టతరమవుతోంది.

ఈ చట్టం ద్వారా బీసీలపై జరిగే దాడులు, వేధింపులు, సామాజిక బహిష్కరణలను అరికట్టవచ్చని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హామీ ఇస్తోంది. అయితే, ఈ చట్టం కేవలం అగ్రవర్ణాల నుంచి వచ్చే దాడులకే పరిమితం కాకుండా, బీసీల్లోని ఒక అభివృద్ధి చెందిన కులం మరో బలహీన ఉపకులంపై లేదా దళితవర్గాలపై చేసే దాడులకు కూడా వర్తించేలా శిక్షా నిబంధనల్లో స్పష్టత ఉండాలి. అలాగే, ఎస్సీ/ఎస్టీ చట్టం తరహాలోనే డీఎస్పీ స్థాయి అధికారిచే విచారణ జరిపించాలి తప్ప, ఇన్‌స్పెక్టర్‌ స్థాయికి పరిమితం చేస్తే కేసు తీవ్రత తగ్గే ప్రమాదం ఉంది. చట్టాలు సామాజిక మార్పునకు సాధనాలుగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ఇప్పటికే అమల్లో ఉన్న నేపథ్యంలో, కొత్తగా రాబోయే బీసీ రక్షణ చట్టం పీడిత వర్గాల మధ్య విభజన రేఖగా మారకూడదు. బీసీల స్వయం గౌరవానికి భంగం కలిగిస్తే కఠిన శిక్షలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, శిక్షలు మాత్రమే సరిపోవు. ఎస్సీ/ఎస్టీ చట్టంలో ఉన్నట్లుగా బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం, పునరావాసం ప్యాకేజీలు కూడా ఈ చట్టంలో అంతర్భాగం కావాలి.


అగ్రకులాలు ఇప్పటికే దళిత అట్రాసిటీ చట్టాన్ని తప్పుడు మార్గాల్లో నిర్వీర్యం చేస్తున్నాయి. రేపు బీసీ చట్టం వస్తే, దాన్ని దళిత చట్టానికి వ్యతిరేకంగా ‘ప్రతీకార కౌంటర్–కేసుల ఆయుధం’గా వాడే ప్రమాదం ఉంది. అంటే, ఒక దళితుడు అట్రాసిటీ కేసు పెడితే, ప్రతిగా ఒక బీసీ వ్యక్తితో దళితుడిపై కేసు పెట్టించడం ద్వారా రెండు చట్టాల స్ఫూర్తిని దెబ్బతీసి, ఆధిపత్య పెత్తందారులు తప్పించుకునే కుట్రలను అడ్డుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను భయపెట్టడం, నామినేషన్లను అడ్డుకోవడం వంటి రాజకీయ హక్కులపై దాడులను కూడా ఈ అట్రాసిటీ చట్టం పరిధిలోకి తీసుకురావాలి. క్షేత్రస్థాయిలో కేసులు విచారించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. ‘బీసీలు దళితులపై దాడులు చేయకూడదు. అలాగే తమలోని ఇతర బీసీలపై కుల వివక్ష ప్రదర్శించరాదు’. దళిత అట్రాసిటీల గురించి మౌనం వహిస్తూ కేవలం తమ కులం (బీసీల) గురించి మాత్రమే మాట్లాడటం సామాజిక బాధ్యతారాహిత్యం అవుతుంది. గ్రామాల్లో త్రివర్ణ–త్రిశూద్ర ఆధిపత్య కులాల ప్రోద్బలంతో జరిగే (దళిత–బీసీ–గిరిజన) ఘర్షణలు కేవలం ‘మిత్ర వైరుధ్యం’గా చూస్తూ ఆ ఘర్షణల పరిష్కారం కొరకు కృషి చేయాలి. అలాగే, కొత్త చట్టం ద్వారా ఈ ఘర్షణలను ‘దళితులు వర్సెస్ బీసీలు’ అనే శత్రుత్వ రేఖగా మార్చడానికి ప్రయత్నించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బీసీ అట్రాసిటీ చట్టం అనేది దళిత అట్రాసిటీ చట్టాన్ని బలహీనపరిచేదిగా కాకుండా, దానికి బలాన్ని పెంచేలా, సమాజంలోని అట్టడుగు వర్గాలందరికీ రక్షణ కవచంలా ఉండాలి.

పాపని నాగరాజు,

సత్యశోధక మహాసభ

ఇవి కూడా చదవండి..

5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నాం.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదు: ఇరాన్

Updated Date - Mar 24 , 2026 | 02:02 AM