అమెరికా రాజకీయాల్లో ‘సోషలిస్ట్’ హవా!
ABN , Publish Date - Aug 14 , 2026 | 03:42 AM
ఒకటిన్నర దశాబ్దం తర్వాత అమెరికా భారీ రాజకీయ కుదుపునకు లోను కాబోతున్నదా? చాపకింద నీరులాగా డెమోక్రాట్లలో తమ ప్రాబల్యం పెంచుకుంటున్న డెమోక్రటిక్ సోషలిస్టులు అమెరికా రాజకీయ విధాన స్వరూపాలను...
ఒకటిన్నర దశాబ్దం తర్వాత అమెరికా భారీ రాజకీయ కుదుపునకు లోను కాబోతున్నదా? చాపకింద నీరులాగా డెమోక్రాట్లలో తమ ప్రాబల్యం పెంచుకుంటున్న డెమోక్రటిక్ సోషలిస్టులు అమెరికా రాజకీయ విధాన స్వరూపాలను పునర్నిర్వచించే బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించనున్నారా? డెమోక్రాట్ల ప్రైమరీస్ ఎన్నికలలో నమోదవుతున్న కొన్ని విజయాలు ఈ ప్రశ్నలు రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ సోషలిస్టులు గెలుస్తున్నారు. వారి గళం కొత్త నినాదాలను లేవనెత్తుతున్నది. ఆ స్వరాల సంఖ్య ప్రస్తుతానికి పరిమితమే కానీ, తమ వాదనల ద్వారా వారు సంప్రదాయ డెమోక్రాట్లలో కూడా మద్దతును కూడగట్టుకుంటున్నారు.
మిషిగన్‌లో ప్రైమరీస్ ఎన్నికలలో అబ్దుల్ ఎల్ సయీద్ విజయం ఇందుకు తాజా ఉదాహరణ. డెమోక్రాట్ సోషలిస్ట్ అయిన సయీద్ అయిదుసార్లు కాంగ్రెస్ ఉమన్‌గా ఉన్న హేలీ స్టీవెన్స్‌ను స్వల్ప మెజారిటీతో ఓడించారు. డిస్ట్రిక్ట్ ప్రైమరీస్‌లో ఠాణేదార్‌ను డెమోక్రాట్ సోషలిస్టు డొనావన్ మెకిన్నీ ఓడించారు. అలాగే తాజా విజయాలు నమోదు చేసిన రషిదా త్లయిబ్, క్రిస్ గ్లిమర్ హిల్‌లు కూడా డెమోక్రటిక్ సోషలిస్టులే. ఈ విజయాలన్నీ డెమోక్రాట్లలో సోషలిస్టుల ఆధిపత్యం పెరుగుతోందన్న వాదనకు కొనసాగింపు మాత్రమే. న్యూయార్క్ సిటీ మేయర్ జొహ్రాన్ మందానీ వీరిలో ప్రముఖుడు. డెమోక్రాట్ సోషలిస్టుల భావజాలంతో కూడిన ప్రకటనలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి కూడా.
అమెరికాను మరింత సోషలిజం వైపు తీసుకెళ్లాలనే వాదన డెమోక్రాట్లలో పెరుగుతోంది. ప్రైవేట్ హెల్త్ కేర్ రంగాన్ని సమూలంగా తొలగించడం, పోలీసులకు నిధులను తగ్గించడం వంటివి వీరు ప్రధానంగా తెరమీదకు తెస్తున్నారు. సొంత ఇంటి కల కోసం తాకట్టులు పెట్టాల్సిన పరిస్థితి ఉండదనే ప్రజాకర్షక ప్రకటనలతో వీరు ముందుకు వస్తున్నారు. అంతేకాదు, సెనేట్, ప్రెసిడెన్సీ, సుప్రీంకోర్టు వ్యవస్థలలో కూడా భారీ మార్పులు రావాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
సాధారణంగా అమెరికాలో రాజకీయ నాయకుల మాటలు, ప్రకటనలు, వాగ్దానాలు రెండు రకాలు. ప్రజల్లోంచి ఎన్నికవడానికి పార్టీ అభ్యర్థిగా వచ్చినప్పుడు ఒకరకమైన వాగ్దానాలు ఉంటాయి. పార్టీ అభ్యర్థిగా ఎంపికవడానికి ప్రైమరీస్ ఎన్నికల్లో పోటీచేసినప్పుడు ఆ మాటలు మరో రకంగా ఉంటాయి. సాధారణ ఎన్నికలంటే అన్ని వర్గాల, భిన్న ఆలోచనా ధోరణులకు చెందిన ప్రజల ఓట్లను రాబట్టేలా మాటలు ఉండాలి. కానీ ప్రైమరీస్ అలా కాదు. ప్రైమరీస్ ఎన్నికల్లో తమ పార్టీ కార్యకర్తలను ఆకట్టుకోవడమే ప్రధానం. పార్టీలో ఇంచుమించుగా తమ భావజాలానికి చెందినవారే కార్యకర్తలుగా ఉంటారు. కాబట్టి సారూప్యత ఉన్న తమ భావజాలంలోనే, కొన్ని అతివాద ధోరణులను ప్రదర్శించడం ద్వారా వారిని ఆకట్టుకోవాలి. డెమోక్రాట్ సోషలిస్టులు చేస్తున్నది అదే. ‘మరింత సోషలిజం– మరింత సమానత్వం’ దిశగా తమ ఎజెండాను ప్రొజెక్ట్ చేస్తూ డెమోక్రాట్ పార్టీ ప్రైమరీస్‌లో వీరు నెగ్గుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో సమూల మార్పులు తేవడం, పని అవసరం తక్కువ చేయడం, జరిమానాలు, అప్పులు, తాకట్టులు లేని సమాజం, అందరికీ సమానమైన– ప్రభుత్వపరమైన ఆరోగ్యభద్రత లాంటివి వీరి ఎజెండా అంశాలు. డెమోక్రాటిక్ సోషలిస్టులు వ్యాప్తిచేస్తున్న భావజాలంలో, యుద్ధాలు లేని సమాజం, జాతి లింగ వివక్షలను రూపుమాపడం వంటివీ ఉన్నాయి. ఇరాన్, క్యూబా, వెనెజువెలా వంటి దేశాలతో ఆంక్షలు లేని, నియంత్రణలు లేని సంబంధ బాంధవ్యాలు కావాలనే డిమాండ్ కూడా ఉంది.
ఈ పరిణామాలను విశ్లేషకులు బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో రిపబ్లికన్ పార్టీలో మొదలైన టీపార్టీ ఉద్యమంతో పోలుస్తున్నారు. అప్పట్లో ఒబామా పాలన నాటి హెల్త్ కేర్ సంస్కరణలు, ప్రభుత్వ వ్యయాలు, పన్నుల విధానాలను కొందరు కన్జర్వేటివ్ నాయకులు వ్యతిరేకించారు. వారు నిరసనలతో ఆగలేదు. తమ బలమైన వ్యతిరేకతతో ఏకీభవించే వారినే రిపబ్లికన్ ప్రైమరీస్‌లో పోటీచేయించారు. ఆ పార్టీలో అప్పటికే గుర్తింపు పొందిన అభ్యర్థి కంటే, మరింత కన్జర్వేటివ్ ఆలోచనలున్న అభ్యర్థులకే ఈ టీపార్టీ ఉద్యమకారుల అండ లభించింది. ‘డెమోక్రాట్లను ఓడించడం మాత్రమే కాదు, రిపబ్లికన్ పార్టీ గమనాన్ని కూడా మరింత కన్జర్వేటివ్‌గా పునర్నిర్దేశిస్తాం’ అన్నట్టుగా వారి ధోరణి సాగింది. వీరు 63 సీట్లు గెలిచి రిపబ్లికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నియంత్రణ మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. సెనేట్‌లో 6 సీట్లు గెలిచినా మెజారిటీ దక్కలేదు. అప్పటివరకు ఉదారవాద– కన్జర్వేటివ్ భావజాలాల మిశ్రమంగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఎక్కువ కన్జర్వేటివ్‌గా మారింది.
టీపార్టీ ఉద్యమం ద్వారా బలపడిన కన్జర్వేటివ్ వాదులు రిపబ్లికన్ పార్టీలో క్రమంగా ఆధిపత్యం సాధించిన తీరు, ఇప్పటి డెమోక్రటిక్ పార్టీలో సోషలిస్టుల ప్రాబల్యం పెరుగుతుండడానికి దగ్గరగా ఉంది. ఈ క్రమంలో డెమోక్రటిక్ పార్టీ అతివాద సోషలిస్టుల చేతిలోకి పూర్తిగా వెళ్లిపోతే గనుక, అమెరికా భవిష్యత్ రాజకీయ విధానాల్లోనే భారీ కుదుపు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ సోషలిస్టు ఎజెండాను అమెరికా పౌరసమాజం ఎలా స్వీకరిస్తుందో చూడాలి.
కృష్ణమోహన్ దాసరి
పాత్రికేయుడు, డల్లాస్
ఇవి కూడా చదవండి..
మావోయిస్టు క్యాంప్ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు..
మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక..