Share News

నాడు విధ్వంసం... నేడు నాటకం!

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:47 AM

అమరావతి నిర్మాణాన్ని అడ్డుకొని మరణశాసనం రాసినవారు నేడు ‘పరిరక్షణ’ పేరుతో ప్రదర్శనలు చేసినంత మాత్రాన వారి పాపాలు పరిహారం అవుతాయా? రాజధాని... రాష్ట్ర భవిష్యత్తుకు పునాది, కోట్లాది ప్రజల ఆకాంక్షలకు...

నాడు విధ్వంసం... నేడు నాటకం!

అమరావతి నిర్మాణాన్ని అడ్డుకొని మరణశాసనం రాసినవారు నేడు ‘పరిరక్షణ’ పేరుతో ప్రదర్శనలు చేసినంత మాత్రాన వారి పాపాలు పరిహారం అవుతాయా? రాజధాని... రాష్ట్ర భవిష్యత్తుకు పునాది, కోట్లాది ప్రజల ఆకాంక్షలకు ప్రతీక, వేలాది మంది రైతుల త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం. అలాంటి అమరావతిని స్వార్థ రాజకీయ కోసం విధ్వంసం చేసి ఇప్పుడు పరిరక్షణ పేరుతో మొసలి కన్నీరు కార్చడం ప్రజలను మోసం చేసే మరో ప్రయత్నమే. రాజధాని విధ్వంసం రైతుల విశ్వాసంపై, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై, ప్రజల ఆకాంక్షలపై, రాష్ట్ర ప్రతిష్ఠపై జరిగిన దాడి. ఇవన్నీ పరిరక్షణ నాటకాలతో ప్రాయశ్చిత్తం అయ్యేవి కావు. అమరావతిని విధ్వంసం చేసినవారు, ఇప్పుడు దాని అభివృద్ధిని చూసి ఓర్వలేకనో, లేక రాజకీయంగా మనుగడ సాగించడానికో మాట్లాడుతున్న మాటలు. వాటిని ప్రజలు గుర్తించలేరని అనుకోవడం వారి భ్రమే.

ఐదేళ్లపాటు అమరావతిని నిర్వీర్యం చేసి, ఇప్పుడు ‘మావిగన్‌’ అంటూ కొత్త పాట అందుకొన్న జగన్‌, అమరావతి రైతుల పరిరక్షణ కమిటీ పేరిట రాజధాని రైతుల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు మొదలుపెట్టారు. అమరావతికి ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ ‘మావిగన్‌’ ఏర్పాటు చేయాలని ఉచిత సలహా ఇచ్చిన జగన్‌. అకస్మాత్తుగా తన పార్టీ నేతలను అమరావతిపై దండయాత్రకు పంపారు. అమరావతి వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదని, 2029లో అధికారంలోకి వచ్చిన వెంటనే మావిగన్‌ను జగన్‌ రాజధానిగా ప్రకటిస్తారని చెబుతూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ‘పరిరక్షణ’ పేరుతో అమరావతికి వెళ్లడంతో రైతులు తిరగబడ్డారు. అమరావతిని నానా విధాలా తూలనాడి రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు అడ్డుపడ్డారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు తీసారు. రాజధాని ఉద్యమంలో మహిళా రైతులను రాయలేని విధంగా దుర్భాషలాడారు. 1631 రోజులు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు, మహిళలు రాత్రి పగలు ఆందోళన చేసినా పట్టించుకోలేదు. రైతుల పాదయాత్రను అడ్డుకొన్నారు. ఇటువంటి మహాపాపులు అమరావతి పరిరక్షణ పన్నాగంతో ఇప్పుడు రైతులపై ప్రేమ ఒలకబోస్తున్నారు. ఎవరు అమరావతి నిర్మాణం మొదలుపెట్టారో, అభివృద్ధి చేస్తున్నారో, ఎవరు విధ్వంసం చేశారో, ఎవరు ఇప్పుడు కపట నాటకాలు ఆడుతున్నారో ప్రజలకు బాగా తెలుసు.

నీరుకొండ ప్రసాద్

ఇవి కూడా చదవండి

టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు

కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది

Updated Date - Jul 03 , 2026 | 12:47 AM