Share News

ఆర్థిక మంత్రి వీడియోతో ఏఐ దుర్వినియోగం!

ABN , Publish Date - Feb 11 , 2026 | 01:28 AM

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ జమానాలో ఆర్థిక మోసాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల ఫేస్‌బుక్‌లో వెల్లువెత్తుతున్న ఒక రకం వీడియోలను ఇందుకు పరాకాష్ఠగా...

ఆర్థిక మంత్రి వీడియోతో ఏఐ దుర్వినియోగం!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ జమానాలో ఆర్థిక మోసాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల ఫేస్‌బుక్‌లో వెల్లువెత్తుతున్న ఒక రకం వీడియోలను ఇందుకు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. ఈ వీడియోల్లో కనపడేదీ మాట్లాడేదీ సామాన్యులు కాదు– దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జయశంకర్, ఇన్ఫోసిస్ సుధా మూర్తి... అంతెందుకు ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే కనపడి మాట్లాడతారు! ఏమని? ఆర్థికంగా నలిగిపోతున్న ప్రజల కోసం వికసిత్ భారత్‌లో భాగంగా ప్రభుత్వం ఒక పథకాన్ని మొదలుపెట్టిందనీ, ప్రారంభంలో 22,000 రూపాయలు డిపాజిట్ చేస్తే మీ ఆదాయం రోజువారీ పెరుగుతూ ఒక్క నెలలోనే మీరు లక్షాధికారులైపోతారని! ఈ మాయానరులు ఎంత నిజంగా ఉంటారంటే సామాన్యులకు ఏమాత్రం అనుమానం రాదు!

కృత్రిమ మేధ సృష్టిస్తున్న అద్భుతాల్లో మంచి ఎంత ఉందో, అంతకుమించి చెడూ ఉంది. ఇలాంటి నకిలీ వీడియోలు సృష్టిస్తున్న మోసగాళ్ళు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే మెజారిటీ ప్రజానీకాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారి అవసరాలను, బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు ఏకంగా మన ప్రధానమంత్రి, ఆర్థికమంత్రులనే ఎరగా వాడుకుంటున్నారు! రోజూ ఫేస్‌బుక్‌లో ఆర్థిక మంత్రితో ఈ నకిలీ వీడియోలు వస్తూనే ఉన్నాయి. అందులో ఆర్థిక మంత్రి ఏరోజుకారోజే మీరు డిపాజిట్లు చేయటానికి ఇదే చివరి తేదీ అని ప్రకటిస్తూనే ఉంటారు. కృత్రిమ మేధను ఉపయోగించి సాగిస్తున్న అతిపెద్ద కుంభకోణంలో ఎందరో సామాన్యులు ప్రతి రోజూ మోసపోతున్నారు.

నాతో సహా చాలామంది ఇవి బూటకపు వీడియోలని, వీటిని నమ్మి ఎవరూ మోసపోవద్దని ఆ వీడియోల కిందే కామెంట్లు పెడుతున్నాం. అలానే ఫేస్‌బుక్‌ యాజమాన్యాన్ని కూడా వీటిని తొలగించాలని కోరుతూనే ఉన్నాం. ఇలాంటివే ఎన్నో హైటెక్‌ మోసాలను సైబర్‌ క్రైమ్‌ ప్రత్యేక విభాగాల దృష్టికి తీసుకు వెళ్తున్నాం. అయినా ఇవి తగ్గుముఖం పట్టడం లేదు సరికదా, కొత్త మోసాలకు సరికొత్త ముఖాలు తొడుక్కుని ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి.


ఇదే కోవలో ఇటీవల ప్రత్యక్షమైన మరో వీడియోలో స్వయంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ఉన్నారు. ఈ వీడియోలో రాహుల్‌ గాంధీ పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు ఉంది. ఈ పథకం పేరుతో మీరు భారతదేశాన్ని మోసగించారనీ, మొబైల్ అప్లికేషన్ ద్వారా నెలకి రూ.20 లక్షల రహస్య ఆదాయాన్ని పొందుతున్నారని రాహుల్‌ ఆరోపిస్తూ, ఆర్థికమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటారు. దీనికి సమాధానంగా నిర్మలా సీతారామన్– ఇది గవర్నమెంట్ ప్రాజెక్టేనని, ఏమాత్రం రహస్యం కాదని, తాను అఫీషియల్‌గా దీన్ని ప్రకటిస్తున్నాననీ, రూ.22 వేలు డిపాజిట్ చేసే ప్రతి పౌరుడూ నెలకి 20 లక్షల రూపాయల ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని, రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారమైనవనీ, అబద్ధపు ప్రచారాలను ఆపాలని మాట్లాడతారు. ఇలా కృత్రిమ మేధ సాయంతో ఈ మోసగాళ్ళు ఏకంగా కృత్రిమ పార్లమెంటు సమావేశాలనే సృష్టిస్తున్నారు.

సామాన్య ప్రజలను దోచుకోవటానికి ఇంత పెద్ద ఎత్తున మోసం జరుగుతున్నా పాలకులు చోద్యం చూస్తూ ఉండటం మహా నేరం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని ఆయా శాఖలకు చెందిన ప్రభుత్వ యంత్రాంగం ఈ వీడియోలపై దృష్టిపెట్టాలి. వీటి మూలం ఎక్కడో కనుక్కొని నేరస్థులను కఠినంగా శిక్షించాలి. ప్రజలు ఇలాంటి వీడియోల బారిన పడి మోసపోకుండా పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి.

ముప్పాళ్ళ భార్గవశ్రీ

ఇవి కూడా చదవండి..

సవరణతో తిరిగి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విపక్షాలు

బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: యోగి ఆదిత్యనాథ్

Updated Date - Feb 11 , 2026 | 01:28 AM