Share News

‘ఏఐ’ బూచిని చూపి అందరూ భయపెట్టేవారే!

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:04 AM

న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచస్థాయి ఏఐ (కృత్రిమ మేధ) ఇంపాక్ట్ సమ్మిట్ నేపథ్యంలో వార్తా పత్రికలలోనూ, సోషల్‌ మీడియాలోనూ ఏఐపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. పది కోట్ల ఉద్యోగాలు పోతాయి అని...

‘ఏఐ’ బూచిని చూపి అందరూ భయపెట్టేవారే!

న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచస్థాయి ఏఐ (కృత్రిమ మేధ) ఇంపాక్ట్ సమ్మిట్ నేపథ్యంలో వార్తా పత్రికలలోనూ, సోషల్‌ మీడియాలోనూ ఏఐపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. పది కోట్ల ఉద్యోగాలు పోతాయి అని ఒకరు, నలభై కోట్ల ఉద్యోగాలు ఊడతాయని ఇంకొకరు, ఏకంగా 90శాతం ఉద్యోగాలు ఉండవని మరొకరు... ఇలా భయపెడుతున్నారు. మనిషి చేసే ప్రతి పనీ ఏఐ చేస్తుందనీ ఇకపై ఏ కొద్దిమందో తప్పితే ఎవరూ పని చేయాల్సిన అవసరమే లేదనీ, ఈ విధంగా సృష్టించబడ్డ సంపద 90శాతం ప్రజల దగ్గర ఉంటుందనీ, తక్కినవారికి ప్రభుత్వమే బతుకుదెరువుకు కావాల్సిన డబ్బులు అందజేస్తుందనీ... ఇలా నానారకాలుగా మాట్లాడుతున్నారు. ఏఐ మీద పుస్తకం రాసిన చరిత్రకారుడు యువల్ నోవా హరారే ఒక టాక్ షోలో మాట్లాడుతూ– ఏఐ సామర్థ్యం ఉన్న ఏజెంట్లు కోట్లకొద్దీ వస్తాయనీ, వాటంతట అవే నిర్ణయాలు తీసుకుంటాయనీ, అవి తీసుకునే నిర్ణయాల మీద వాటిని తయారు చేసిన మనిషికి కూడా ఎలాంటి నియంత్రణ ఉండదనీ, వీటితో ఎన్నో చెడు పరిణామాలు దాపురించే అవకాశం ఉందనీ ఉద్ఘాటించారు. మొత్తంమ్మీద అతి త్వరలో జరిగే ఒక అనర్థంగా అందరూ పేర్కొంటున్న అంశం పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోవడం.

ఇప్పటికే ఏఐను చిత్రాలు గీయడంలో, సినిమాలు తీయడంలో, పాటలు రాయడంలో, కథలు రాయడంలో, ఇతర కళా రంగాల్లో విరివిగా వాడుతున్నారు. బెంగళూరులో అయితే ఏఐతో తీసిన సినిమాని థియేటర్లలో కూడా రిలీజ్ చేశారు. వైద్య రంగంలో రోగనిర్ధారణ పనులలో ఏఐ చాలా అద్భుతంగా పనిచేస్తున్నదని వైద్యులే చెబుతున్నారు. విద్యా రంగంలో అయితే అసలు ఏఐ చేయలేని పని అంటూ ఏదీ లేదు. కానీ ఇంకా కొన్ని రంగాలలో ఉదాహరణకు రవాణా రంగంలో, వ్యవసాయ రంగంలో, వస్తువులను వినియోగదారులకు చేరవేసే రంగంలో, లోడింగ్ అన్‌లోడింగ్ వంటి పనులలో, ఇంటి పనుల్లో, నర్సులు చేసే పనుల్లో, వంటలో... ఇలాంటి రంగాల్లో ఏఐ ప్రవేశించాలంటే ముందు రోబోల తయారీ జరగాలి. ఈ రోబోలు, డ్రోన్స్, వీటిని నియంత్రించే కంప్యూటర్లు, ఇతర సామగ్రి తయారు చేసేందుకు మాత్రం ఖనిజాలు, ఎలక్ట్రానిక్ చిప్స్, అవి తయారు చేసే యంత్రాలు కావాల్సి ఉంటుంది. వీటిని తయారు చేసేందుకు మనుషులు కావాల్సిందే. ప్రపంచం మొత్తం మీద ఇలాంటి యంత్రాలు వందల కోట్లలో అవసరం ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ తయారు చేసేందుకు కావలసిన కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అది కూడా అన్ని దేశాల్లోనూ చేయాలి. కాబట్టి ఇంత త్వరలో మనుషులకు పని లేకుండా పోతుంది అని భయపడవలసిన అవసరం లేదు. ఉదాహరణకు, మన దేశంలో వ్యవసాయ సంబంధిత రంగాలలో పనిచేసే వాళ్ళు 30 కోట్లమంది వరకూ ఉంటారు. పరిశ్రమల్లో పనిచేసేవాళ్లు, వస్తువులను చేరవేసేవాళ్లు, నర్సులు... ఇలాంటి వాళ్లను కూడా కలుపుకుంటే మొత్తం జనాభాలో సగంమంది కంటే ఎక్కువే. వీళ్ళందరూ చేసే పనులన్నింటినీ చేసేందుకు అవసరమైన రోబోలు కావాలంటే అసలు భూమి మీద ఉన్న ఖనిజాలు సరిపోవు. అయినప్పటికీ ఈ మేధావులు ఇలా ఎందుకు భయపెడుతున్నారో అర్థం కాదు.


ఐటీ రంగం మన దేశంలోకి ప్రవేశించి అరవై సంవత్సరాలు దాటింది. అయినా ఇప్పటివరకు ఈ ఐటీ రంగాల్లో ఉన్నవారు సృష్టించే ఆదాయం మన జాతీయాదాయంలో 10శాతం కూడా లేదు. ఇకపోతే నిజంగా ఏఐతో గనుక ఇంతమంది ఉద్యోగాలు పోతే, ఏ దండకారణ్యంలోనో ఉండి కొట్లాడవలసిన అవసరం లేదు, ప్రజలే తిరగబడి ఇలాంటి దారుణాన్ని ఆపేస్తారు.

ప్రజలు చేసే పనులు వారి జీవితానికి అర్థాన్ని ఇస్తాయి, వారికి జీవిస్తున్నాం అనే అనుభవాన్ని కలిగిస్తాయి. ఊరికే జీతాల కోసమే ఎవరూ పనిచేయరు. ‘పనే పరమార్థం’ అని మన సంస్కృతి చెప్తున్నది. స్వీడన్‌లో, స్విట్జర్లాండ్‌లో చాలా మందికి ప్రభుత్వం– డబ్బులు ఇస్తాం, పని చేయవలసిన అవసరం లేదని ఒక అవకాశం ఇచ్చింది. అయినా ఒక్కరు కూడా ఉచితంగా డబ్బులు తీసుకుని బతికేందుకు ముందుకు రాలేదు. అన్ని విషయాల్లో లాగా మనిషి పనికి కూడా అలవాటు పడిపోతాడు. మన దేశంలో ఎంతోమంది రైతులు లాభాలు లేకున్నా, నష్టాలు వస్తున్నా అన్ని కాలాల్లోనూ పొలాల్లో పని చేస్తుంటారు. వేరే పనికి పొమ్మన్నా పోరు. అలాంటిది అసలు పని చేయవద్దు అంటే అది సాధ్యమా?

ఎంతసేపూ ఏఐ వచ్చేస్తూందీ, ఉద్యోగాలు పోతాయీ అని చెప్తున్నారే కానీ, ఇంతవరకు ప్రభుత్వాలు గానీ, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు గానీ ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయీ, అందులో ఏ పనులు ఏఐ రాకతో బలవుతాయీ, అలా జరగకుండా ఆ ఉద్యోగులకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పాలీ, నేర్చుకోలేని వారికి ఎలాంటి భద్రత కల్పించాలి... ఈ దిశగా ఏ చర్చా జరగటం లేదు, ఏ ప్రణాళికలూ రూపుదిద్దుకోవటం లేదు. ప్రభుత్వాధినేతలు గానీ, ఆయా రంగాల నిష్ణాతులు గానీ సవివరంగా ఉదాహరణలతో గణాంకాలతో దేన్నీ వివరించటం లేదు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ ఉపద్రవం గురించి వంద దేశాల ప్రతినిధులు ఒక చోట కలిసి ఇంత తీవ్రంగా చర్చించినప్పుడు, ప్రజలకు కావాల్సింది ఆ ఉపద్రవం నుంచి తప్పించుకునే ఉపాయమే కానీ, ఆ ఉపద్రవం వచ్చాక ప్రభుత్వపరంగా చేయూతనిస్తాం అని చెప్పడం కాదు. ఇది ఆలోచనారాహిత్యమే కాదు, నాయకత్వ లోపం కూడా.

డాక్టర్ మండువ హనుమంతు ప్రసాద్‌రావు

ఇవి కూడా చదవండి

మచిలీపట్నంలో భారీ చోరీ.. ఉపాధ్యాయురాలి ఇంట్లో 50 తులాల బంగారం దొంగతనం

మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Feb 26 , 2026 | 03:04 AM