మానవుడిక మహనీయుడూ మాననీయుడు కాదా?
ABN , Publish Date - Sep 25 , 2026 | 03:43 AM
ప్రకృతిని జయించటం, అనుభవించటం అన్నవి మనిషి ఆలోచనలను 250 ఏళ్లపాటు తీవ్రంగా ప్రభావితం చేశాయి. చరాచర ప్రపంచంతో పాటు సమస్త జంతు, వృక్ష సంపద మనుషుల అవసరాలు, ఆనందాల కోసమే...
ప్రకృతిని జయించటం, అనుభవించటం అన్నవి మనిషి ఆలోచనలను 250 ఏళ్లపాటు తీవ్రంగా ప్రభావితం చేశాయి. చరాచర ప్రపంచంతో పాటు సమస్త జంతు, వృక్ష సంపద మనుషుల అవసరాలు, ఆనందాల కోసమే ఉందన్నట్లుగా పరిగణించటం పారిశ్రామిక విప్లవం తర్వాత కనీవినీ ఎరగని రీతిలో ఊపందుకుంది. హద్దులూ, అవధులూ లేకుండా మనిషి జైత్రయాత్ర ప్రకృతిపై సాగుతూనే ఉంటుందని ఎందరో శాస్త్రవేత్తలూ తత్వవేత్తలూ ప్రగతి గానాలు చేశారు. మరెందరో కవులూ, కళాకారులూ వాటితో గొంతు కలిపారు. ‘మానవుడే మహనీయుడు.. శక్తియుతుడు.. యుక్తిపరుడు.. మానవుడే మాననీయుడు.. జీవకోటి సర్వములో శ్రేష్ఠతముడు.. మానవుడే మహనీయుడు.. మహనీయుడు..’ అంటూ ప్రముఖ కవి ఆరుద్ర 1972లో బాలభారతం సినిమాలో రాసిన పాట దీన్నే గుర్తుచేస్తుంది. ‘గ్రహరాశులనధిగమించి.. ఘనతారల పథం నుంచి.. గగనాంతర రోదసిలో.. గంధర్వగోళతతుల దాటి.. బొందితో భువికి తిరిగి రాగలిగే’ ఘనశక్తి మనిషికే ఉందని గొప్పగానూ శ్లాఘించారు. ‘మెదడన్నది మనకున్నది.. అదిసరిగా పనిచేస్తే.. విశ్వరహః పేటికా విపాటన జరగక తప్పదు’ అని శ్రీశ్రీ మానవమేధ ఔన్నత్యానికీ, ఆధిక్యానికీ అక్షరరూపమిచ్చారు. సృష్టికి ప్రతిసృష్టి చేసే శక్తి మనిషి మెదడుకు ఉండటమే అద్భుతమని అనుకున్న దశ నుంచీ ఆ ప్రతిసృష్టిని చూసి భయపడే స్థితికి మనం చేరుకోవటం ఇప్పుడు సవాల్‌గా పరిణమించింది. కృత్రిమమేధ (ఏఐ)తో మనిషి తన ఆధిపత్యానికి తనే మరణశాసనం రాసుకుంటున్నట్లుగా భావించే విపరీత వ్యాఖ్యానాలతో పాటు ఆర్థికరంగంలో అది చూపించే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆ సవాల్‌ను అంత తేలికగా తీసుకోలేం.
ఇప్పటివరకూ మనం శాస్త్రసాంకేతిక రంగంలో ఎన్నో విప్లవాలను చూశాం. అవన్నీ మనుషుల సౌకర్యాలను, సంతోషాలను గణనీయంగా పెంచి అంతేస్థాయిలో పర్యావరణాన్ని దెబ్బతీశాయి. అందుకే 1970ల నుంచి పర్యావరణ చైతన్యం క్రమేపీ బలపడి అభివృద్ధి పేరుతో, ప్రకృతిని జయించటం పేరుతో దేన్నైనా చేయొచ్చనే ధోరణికి బంధనాలు వేయటానికి ఎన్నో విధానాలు రూపొందాయి. మనుషులు భద్రంగా బతకటానికి అవసరమైన పర్యావరణం ఉండాలంటే పారిశ్రామిక యుగం కంటే ముందున్న భూ ఉష్ణోగ్రతలను రెండు డిగ్రీల సెల్సియస్ మించకుండా చూడాలని ప్యారిస్ వాతావరణ ఒప్పందం తీర్మానించటానికి కూడా ఈ నేపథ్యమే కారణం. గతంలోని శాస్త్ర సాంకేతిక విప్లవాలు ఏవీ మనుషుల నియంత్రణను దాటిపోయే ప్రమాదాన్ని తీసుకురాలేదు. అపరిమిత లాభాల కోసమూ, కంపెనీలు, దేశాల మధ్య ఆధిపత్యం కోసమూ శాస్త్రసాంకేతిక రంగాలను దుర్వినియోగం చేసి యుద్ధాలనూ పర్యావరణ విధ్వంసాలనూ కొనితెచ్చినా, అవసరమనుకున్నప్పుడు ఆ రంగాలను అదుపులో పెట్టగలిగే పరిస్థితి ఎంతో కొంత ఉండేది. ఏఐని అలా అదుపులో ఉంచే పరిస్థితి ఉండదనీ మనిషి అదుపాజ్ఞలను అది తోసిపుచ్చి, స్వయం నిర్ణయాలను తీసుకునే తీవ్ర ప్రమాదాన్ని కొట్టిపారేయలేమనే వ్యాఖ్యానాలు బలంగా వినపడుతున్నాయి. ఏఐ రంగంలో అగ్రగాములుగా ఉన్న నిపుణులు, కంపెనీల అధినేతల నుంచే ఇలాంటి భయాలు వెల్లడికావటంతో అంతర్జాతీయస్థాయిలో ఏఐపై నియంత్రణ ఉండాలనే భావన బలం పుంజుకుంటోంది. మానవ అస్తిత్వానికీ, మనిషి సహజశక్తులకూ భంగం కలగని రీతిలో ఏఐని కట్టడిచేయటానికి ప్రయత్నాలు జరగకపోతే కలిగే అనర్థాలు చాలా ఉంటాయి. ఇప్పటికే ఏఐ పేరుతో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. అగ్రశ్రేణి కంపెనీలే వరసపెట్టి లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా ప్రకారం 40శాతం ఉద్యోగాలు (మరో అంచనా ప్రకారం అది 60శాతం వరకూ ఉండొచ్చు) ఏఐతో ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. డేటా ఎంట్రీ, కస్టమర్ సర్వీస్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్, లా, అకౌంటింగ్, మెడిసిన్, టీచింగ్, జర్నలిజం, గ్రాఫిక్ డిజైనింగ్– కంటెంట్ క్రియేషన్, ట్రాన్స్‌లేషన్ లాంటి రంగాల్లో ఉద్యోగాల కోతలు తీవ్రంగా ఉంటాయి. టీచింగ్, జర్నలిజం లాంటి రెండు రంగాలను ఉదాహరణగా తీసుకుంటే ఏఐ ప్రభావం ఎలా ఉంటుందో తేలికగానే ఊహించొచ్చు. ఒక్క ఏఐ ట్యూటర్ వేలమంది టీచర్లు చేసే పనిని అతి తేలికగా చేయగలదు. విద్యార్థుల స్థాయినీ, వారు చేసే తప్పులనూ, వారు లేవనెత్తే ప్రశ్నలనూ నిమిషాల్లో గుర్తించగలదు. ప్రతి విద్యార్థికి సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాన్ని స్పష్టం చేయగలదు. ఇక జర్నలిజానికి అవసరమైన అనేక విషయాలను సంగ్రహపరచి పాఠకులకు అర్థమయ్యేరీతిలో కథనాలను తేలికగా తయారు చేస్తుంది. క్రీడా విశేషాలూ, ఫైనాన్షియల్ మార్కెట్లూ, ఆర్థిక వ్యవస్థకూ సంబంధించిన న్యూస్‌నూ, వీడియోలను అనుసరించి కావాల్సిన భాషల్లో లిఖిత రూపంలో ఇవ్వటమూ, అనువాదాన్ని అందించటమూ, వివిధ పరిణామాలనూ సంక్షిప్త– దీర్ఘవార్తలుగా తీర్చిదిద్దటమూ, గణాంకాలనూ– డేటానూ అవసరాలకు తగ్గట్టుగా విశ్లేషించి– వర్గీకరించటమూ నిమిషాల్లో చేయగలగటంతో జర్నలిజంలో మానవవనరుల వినియోగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
ఉద్యోగాలను దెబ్బతీయటం ఏఐ ఏ స్థాయిలో చేయగలదో ఇంకా పూర్తిగా స్పష్టం కావటం లేదు. గతంలోనూ కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చినప్పుడు దాని ప్రభావాన్ని అంచనా వేయటానికి చాలాకాలమే పట్టింది. క్యాపిటలిజంగా మనం పిలిచే ఆర్థిక వ్యవస్థలో మార్పులు అనూహ్యంగా వస్తాయి. మలుపులు కూడా అనూహ్యంగా ఉంటాయి. దాని సాధారణ స్వరూపమూ, నడవడిక గురించి అవగాహన ఉన్నా నిర్దిష్టంగా జరిగే మార్పులు ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటాయి. అయితే ఒకటి మాత్రం స్పష్టం. క్యాపిటలిజాన్ని దాని మానాన దాన్ని వదలివేస్తే విపరీత పర్యావరణ విధ్వంసానికీ, గుత్తాధిపత్యానికీ దారితీస్తుంది. ఏఐ కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తోంది. ఏఐకి ఎంతో కీలకమైన డేటా సెంటర్లు పర్యావరణంపై కలగచేసే ప్రతికూల వాతావరణం గురించి ఇప్పటికే పెద్ద చర్చ మొదలైంది. అమెరికాలోనే వాటిపై వ్యతిరేకత ఆరంభమైంది. కొన్నిచోట్ల స్థానిక ప్రభుత్వాలు వాటి ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఇది కనపడుతోంది. ఇక ఏఐతో గుత్తాధిపత్యం మరింతగా పెరిగే అవకాశాన్ని ఏ విధంగానూ కొట్టేయలేం. ఏఐకి సంబంధించిన అయిదు పెద్ద కంపెనీలు ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 240 బిలియన్ డాలర్లను (రూ.23 లక్షల కోట్లు) సేకరించాయి. చరిత్రలో ఒక అయిదు కంపెనీలు స్వల్పకాలంలో ఇంత పెద్ద మొత్తంలో నిధుల సమీకరణ చేయలేదు.
గుత్తాధిపత్యంతో మార్కెట్‌పై అదుపు సంపాదించటానికి ఎంతగా అవకాశం ఉన్నా అది అన్ని సందర్భాల్లోనూ అనుకున్నట్లుగా సాగదు. పెద్ద కంపెనీల మధ్య పోటీని పూర్తిగా నివారించలేం. క్యాపిటలిజంలో ఉన్న మౌలిక లక్షణమే అది. కంపెనీలు గుత్తాధిపత్యంతో సంతృప్తి చెందితే ఐటీ విప్లవం వచ్చేది కాదు. ఈనాటి ఏఐ అభివృద్ధి అయ్యేదీ కాదు. అపరిమిత లాభాపేక్ష కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను సృష్టిస్తుంది. దీనికితోడు కొత్తవి సృష్టించాలనే మనుషుల తపన వల్ల ఏదో ఒక స్థాయిలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు ఊపిరిపోసుకుంటూనే ఉంటాయి. గుత్తాధిపత్యం అంటే పెద్ద కంపెనీల మధ్య సమానత్వం ఉన్నట్లు కాదు. వాటి మధ్య ఉన్న అసమానతలు కూడా పోటీకీ, అధిక లాభాన్వేషణకూ దారితీస్తాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అనే అస్త్రంతోనే ప్రత్యర్థి కంపెనీలపై పైచేయి సాధించటానికి ప్రయత్నిస్తాయి. అయితే ఈ పోటీ ఏఐ యుగంలో హద్దులు దాటితే సృష్టికర్తల నియంత్రణే జారిపోయే ప్రమాదం ఉంటుంది. అదంటూ జరిగితే ఏ విపరిణామాలు తలెత్తుతాయో ఇప్పటికిప్పుడు ఊహించటం కష్టం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మనుషులు సృష్టించిన ఏఐ మానవ నియంత్రణలో ఉంటుందా? అని 2014లోనే ప్రశ్నించారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్ ప్రధానంగా మనం ఇచ్చే ఆదేశాలను అమలుచేసేవనీ, ఏఐ మనుషుల నిర్ణయాలనే ప్రభావితం చేయగలదంటూ యూవాల్ నోవా హరారి చేసిన వ్యాఖ్యానంలో నిజం లేకపోలేదు. ఏఐ మీద విపరీతంగా ఆధారపడే మనం సమాచారాన్ని మొత్తం ఏఐ గుప్పిట్లో పెడుతున్నాం. మన భయాలు, కోరికలు, బలహీనతలు, భావోద్వేగాలను అర్థంచేసుకుని మన నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయికి ఏఐ చేరుకుంటోందనీ దీన్ని ‘హ్యాకింగ్ హ్యూమన్స్’గా హరారి వ్యాఖ్యానించారు. మనుషులు తమ నిర్ణయాధికారాన్ని ఏఐకి అప్పగించుకుంటూ పోతే క్రమేపీ మేధోపరమైన వివేచనా శక్తులనే కోల్పోతారన్న భయాన్నీ హరారే వ్యక్తంచేశారు. మనుషులతో కాకుండా ఏఐతో ఉద్వేగ సంబంధాలను ఏర్పరచుకుంటే మానవ సామాజిక అస్తిత్వమే బలహీనపడుతుంది. సజీవ మనుషులతో సంబంధాలు సన్నగిల్లితే కళలూ, సాహిత్యాలూ చిన్నబోతాయి. దీంతో మానవ సారమే పలచబడిపోతుంది. మనిషి సజీవతత్వాన్ని తెలుసుకునే మార్గమే మూతపడిపోతుంది.
హరారే లాంటి వాళ్లు ఏఐ ప్రమాదాల గురించి చెబుతున్న దానిపై ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం. ఏఐతో ఉద్యోగాలు పోయి, నాలుగైదు కంపెనీల గుత్తాధిపత్యం పెరిగితే ఆదాయంలోనూ సంపదలోనూ అసమానతలు విపరీతంగా పెరిగిపోతాయి. ఉద్యోగాలను కోల్పోతే వస్తువులకూ సేవలకూ డిమాండు తగ్గిపోతుంది. ఆర్థిక వ్యవస్థ ఒడుదుడుకులకు లోనవుతుంది. ఏఐ వల్ల ఈ విపరిణామాలు పెరిగిపోతే నిరుద్యోగులకూ కనీస ఆదాయం కల్పించాల్సిన పరిస్థితి ప్రభుత్వాలకు ఏర్పడుతుంది. అందరికీ కనీస ఆదాయ కల్పనను చేపట్టటానికి ప్రభుత్వాలు పెద్దఎత్తున పన్నుల ద్వారా ఆర్థిక వనరులను పెంచుకోవాల్సి వస్తుంది. రోబోలపైనా, ఏఐలు అందించే సేవలపైనా పన్నులు విధించాల్సి వస్తుంది. రోబోలను మనుషులుగా పరిగణించి వాటి ద్వారా లభించే ఆదాయాలపై పన్నులు వేయాలని బిల్‌గేట్స్ చాలా కాలం క్రితమే సూచన చేశారు. ఉద్యోగాల్లేకుండా కూర్చోబెట్టి కనీస ఆదాయాన్ని అందించినా మనిషిమనిషిగా ఉండలేడు. తననకంటూ విలువైన పని ఒకటి లేనప్పుడు వ్యక్తిత్వం విలవిలలాడుతుంది. మనిషి తన శ్రమ, సృజన శక్తులతో తయారయ్యే ఉత్పత్తులపై అజమాయిషీని కోల్పోవటమే ఆధునికయుగ విషాదంగా కారల్ మార్క్స్ 1840ల్లో చెప్పింది ఏఐతో మరింత నిజంగా కనిపిస్తోంది! అదుపులేని లాభాపేక్షా, సామాజిక నియంత్రణలు లేని సాంకేతిక పరిజ్ఞానమూ మనుషుల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందన్నదీ వాస్తవంగానే గోచరిస్తోంది! అపరిమిత కోరికలు అపరిమిత దుఃఖానికి హేతువులనే బుద్ధుడి మాటలూ ఇప్పుడు మళ్లీ గుర్తుకురాకమానవు!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఈ వార్తలనూ చదవండి:
ఆ భయంకర సాఫ్ట్‌వేర్‌ని రద్దు చేయండి.. ఈసీఐనెట్ యాప్‌పై శశిథరూర్
కుల వివక్ష ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌కు మాజీ చీఫ్ మద్దతు