ఆచార్య ‘మాదిరాజు’ సాహిత్యోత్సవం!
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:50 AM
ప్రజాస్వామ్య భావన, మానవీయ దృక్పథం, సమానత్వం, స్వేచ్ఛాతత్వం, సృజన సంగమమై సాగిన సజీవ కవితాఝరి – ఆచార్య మాదిరాజు రంగారావుది. తన తొంభై సంవత్సరాల ప్రాయంలోను ఎత్తిన కలం దించకుండా...
ప్రజాస్వామ్య భావన, మానవీయ దృక్పథం, సమానత్వం, స్వేచ్ఛాతత్వం, సృజన సంగమమై సాగిన సజీవ కవితాఝరి – ఆచార్య మాదిరాజు రంగారావుది. తన తొంభై సంవత్సరాల ప్రాయంలోను ఎత్తిన కలం దించకుండా పుంఖానుపుంఖంగా ఇంత సుదీర్ఘకాలం మానవీయ స్వేచ్ఛాకవిత్వం రాసినవారు, మధ్య మధ్య తన పరిశోధనా ఫలంగా వెలుగులోకి తెచ్చిన అనేక అమూల్య అనుశీలనా వ్యాస సంకలనాలు – మొత్తం 127 గ్రంథాలు తెచ్చినవారు తెలుగునాట బహుశా మరొకరు లేరు.
ఇంతటి అరుదైన, అపురూపమైన, విశిష్ట కవి కన్నుమూసి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని వారి కుమారుడు మాదిరాజు సంతోష్‌కుమార్, మాదిరాజు రంగారావు సర్వసాహిత్యాన్ని సాహితీ పిపాసుల సౌకర్యార్థం పదకొండు బృహత్ సంపుటాలుగా ప్రచురించారు. ఈ సంపుటాల గర్భంలో సుమారు ఆరువేల ఎనిమిది వందల యాభై పేజీలలో విస్తరించి వారి అపూర్వమైన, అర్థవంతమైన, స్ఫూర్తిదాయకమైన సాహిత్యం ఉంది.
ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో అతి ప్రాచీనమైన శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ‘ఆచార్య మాదిరాజు రంగారావు సాహిత్యం–పరామర్శ’ అనే అంశంపై ఒకరోజు సదస్సును జూలై 4న ఉదయం 10గం. నుంచి సాయంత్రం 7గం. వరకు ఏర్పాటు చేసింది. ఈ సదస్సును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ వి.నిత్యానందరావు ప్రారంభిస్తారు. సాయంత్రం ముగింపు సభలో తెలంగాణ శాసనమండలి అధ్యక్షులు గుత్తా సుఖేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సదస్సు పత్రాలు తదితరాలతో ప్రచురించిన ‘ఆచార్య మాదిరాజు రంగారావు పరామర్శ’ బృహత్ గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు. ఈ రెండు సభలకు భాషా నిలయం అధ్యక్షులు డా. కె.వి. రమణ అధ్యక్షత వహిస్తారు.
ఆచార్య మాదిరాజు రంగారావు సాహిత్యంలోని వివిధ అంశాలపై డా. అమ్మంగి వేణుగోపాల్, విహారి, డా. నాళేశ్వరం శంకరం, డా. తిరునగరి శరత్‌చంద్ర, నెల్లుట్ల రమాదేవి, డా. సి.హెచ్.లక్ష్మణ చక్రవర్తి, ఆచార్య టి.గౌరీశంకర్, ఆచార్య వి.త్రివేణి, ఆచార్య మసన చెన్నప్ప, డా. గిరిజా మనోహర్‌బాబు ప్రభృతులు పత్రాలు సమర్పిస్తారు.
టి. ఉడయవర్లు
గౌరవకార్యదర్శి,
శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం.
ఇవి కూడా చదవండి
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది