స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:42 AM
స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పీవీ నరసింహారావు నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీలు, మండల...
స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పీవీ నరసింహారావు నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు అన్ని రంగాల్లో సంక్షేమం అభివృద్ధిని సాధించాలని ఆశించారు. పారిశుధ్యం, రక్షిత మంచినీటి సరఫరా, వ్యవసాయ, విద్య, ప్రజారోగ్యం, పశుపోషణ మొదలగు బాధ్యతలతో పాటు ఆర్థిక పరిపుష్టి కొరకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆస్తి పన్ను, ఇంటి పన్ను, వాటర్ చార్జీలు, మార్కెట్ ఫీజు, వాహనాలపై పన్నులు, ల్యాండ్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ వాల్యూయేషన్ ఫీజు, వృత్తి పన్ను మొదలైనవి స్థానిక సంస్థలు వసూలు చేసుకుని వాటి అవసరాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టుకునే వెసులుబాటును రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ప్రభుత్వాలు పంచాయతీరాజ్ వ్యవస్థలకు సరైన సమయంలో ఎన్నికలు జరిపి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా తగిన నిధులను సమకూర్చి ఆ సంస్థల స్వయంప్రతిపత్తినీ కాపాడడానికి కృషి చేశాయి.
అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాలనలో తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నామమాత్రంగా మిగిలిపోయింది. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే దారి మళ్లించింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చే ప్రక్రియకు స్వస్తి చెప్పింది. ఆస్తి పన్ను, వృత్తి పన్ను, రిజిస్ట్రేషన్ మైనింగ్ మార్కెటింగ్ మొదలగు వనరులను రాష్ట్ర ప్రభుత్వమే వాడుకుంది. సర్పంచులు నిధుల కొరత ఎదుర్కోలేక, అభివృద్ధి కార్యక్రమాల చెల్లింపులు, విద్యుత్తు దీపాల బిల్లులు, పారిశుధ్య కార్మికుల జీతాలు చెల్లించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వంలో కీలక పదవులలో ఉన్న నాయకుల వ్యాపార ప్రయోజనాల కోసం జిల్లాలను, మండలాలను అశాస్త్రీయంగా విభజించి అభివృద్ధిని అడ్డుకున్నారు. మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలూ చేపట్టలేక నామమాత్రంగా మిగిలిపోయాయి. ఎన్నికైన సర్పంచులు, మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు దాదాపు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. వారిని ఎన్నుకున్న ప్రజల మన్ననలు పొందలేకపోయారు.
గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు సమకూర్చి గతంలో నిర్వీర్యమైన స్థానిక సంస్థలను మళ్లీ బలోపేతం చేయాలి. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా కేవలం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే కాక ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి.
ప్రొ. కూరపాటి వెంకట్‌నారాయణ
ఇవి కూడా చదవండి
మచిలీపట్నంలో భారీ చోరీ.. ఉపాధ్యాయురాలి ఇంట్లో 50 తులాల బంగారం దొంగతనం
మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి..