‘1/70’ తీసేయమని కాదు, సమీక్షించమని!
ABN , Publish Date - Sep 29 , 2026 | 03:26 AM
‘ఆర్థిక స్వేచ్ఛ పేరుతో 1/70 చట్ట సమీక్షా?!’ శీర్షికన డా. పల్లా త్రినాథరావు గారు రాసిన ఆర్టికల్ చూస్తే (తేది: 09.09.26), ఆ చట్టంపై ‘గిరిజనులకు మేలు చేయని ౧/70’ శీర్షికన నేను...
‘ఆర్థిక స్వేచ్ఛ పేరుతో 1/70 చట్ట సమీక్షా?!’ శీర్షికన డా. పల్లా త్రినాథరావు గారు రాసిన ఆర్టికల్ చూస్తే (తేది: 09.09.26), ఆ చట్టంపై ‘గిరిజనులకు మేలు చేయని ౧/70’ శీర్షికన నేను రాసిన ఆర్టికల్‌ను (తేది: 02.09.26) ఆయన సరిగా అర్థం చేసుకోలేదనిపించింది. నేను రాసిన ఆర్టికల్‌లో నా ప్రశ్నలు స్పష్టంగానే ఉన్నాయి. మొదటి ప్రశ్న: 1/70 చట్టం అమలయ్యాక గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల భూములు ఏ మేరకు పెరిగాయి? వారి ఆస్తులు ఏ మేరకు అభివృద్ధి చెందాయి? రెండో ప్రశ్న: ఈ చట్టం నిజంగా గిరిజనులకు మంచి చేసేదే అయితే, ఆర్థికంగా కొంత అభివృద్ధి చెందిన గిరిజనులు ఇక్కడ భూమి తక్కువ ధరకు లభిస్తున్నా కొనుక్కోవడానికి ఇష్టపడక మైదాన ప్రాంతాల్లో ఎందుకు కొంటున్నారు?
త్రినాథరావు తన వ్యాసంలో– వ్యవసాయ భూమిని కేవలం జీవనాధారం అంటున్నారు. అది సరి కాదు. రైతుకు వ్యవసాయ భూమి కేవలం బతుకుతెరువు మాత్రమే కాదు. అది వారి ఆస్తి. ఆపద వచ్చినప్పుడు, అవసరం ఏర్పడినప్పుడు– పిల్ల పెళ్లికో, పిల్లవాడి చదువుకో, తండ్రి వైద్యానికో, తల్లి అవసరానికో అమ్మి సొమ్ము చేసుకోగలిగే ఆస్తి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 300ఎ ప్రకారం దేశ పౌరులకు సంక్రమించిన ఆస్తి హక్కును ఈ 1/70 చట్టం హరించి, వారి ఆర్థిక స్వేచ్ఛను కాలరాస్తున్నది. అంతేగాక, అదే ప్రాంతంలో వందల ఏళ్ళుగా నివసిస్తున్న బడుగు, బలహీన వర్గాల ప్రజలను గిరిజనేతరుల పేరుతో వేరు చేసి రాజ్యాంగం ద్వారా వారికి సంక్రమించిన హక్కులు, అవకాశాలను కూడా కాలరాస్తున్నది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 300ఎ, ఆర్టికల్ 19(1)(జి) ప్రకారం భారత పౌరులు చట్టబద్ధంగా దేశంలో ఎక్కడైనా ఆస్తులను కొనుక్కోవచ్చు, చట్టబద్ధమైన పరిమితుల్లో వాటిని అమ్ముకోవచ్చు. తమ వృత్తిని, వ్యాపారాన్ని ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు. అయితే 1/70 చట్టం అమలులో ఉన్న గిరిజన ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న 70–75శాతం గిరిజనేతరులకు ఇటువంటి హక్కులు లేవు. వంశపారంపర్యంగా వస్తున్న తమ సొంత భూమిని అమ్ముకునే హక్కు లేదు. తమ కుటుంబ స్వార్జిత భూమిలో పరిశ్రమలు స్థాపించడానికి, వ్యాపారాలు నిర్వహించడానికి, కోల్డ్ స్టోరేజ్, పౌల్ట్రీ వంటి వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడానికి కూడా అవకాశం లేదు. కనీసం ఒక పెట్రోల్ బంక్ పెట్టాలన్నా గిరిజనేతరులకు అవకాశం లేదు. ఆ ప్రాంతంలో సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం కూడా అక్కడ నివసిస్తున్న ఈ 70–75 శాతానికి పైగా ప్రజలకు లేదు.
నా వాదన ఏమిటంటే– గిరిజన ప్రజలను ఉద్ధరిస్తామని 1/70 చట్టం తెచ్చారు. కానీ 55 ఏళ్ళ తర్వాత కూడా ఆ చట్టం ఆ ప్రాంత గిరిజనులను ఆర్థికంగా ఉద్ధరించకపోగా, ఆ ప్రాంతంలో వందల ఏళ్ళుగా నివసిస్తున్న గిరిజనేతరులను రెండవ తరగతి పౌరులుగా మార్చింది. వారికి ఎటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక హక్కులు, అవకాశాలు లేకుండా బతికేలా చేస్తున్నది. ఇలా చేయటం స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం వారికి కల్పించిన ప్రాథమిక జీవన హక్కులను కాలరాయడం కాదా?
నిజంగా ప్రభుత్వం ఈ ప్రాంతంలో గిరిజనులు మాత్రమే ఉండాలి, ఇక్కడ ఉన్న సాగుభూమి మొత్తంపై హక్కుదారులు గిరిజనులు మాత్రమే అని భావించినట్లయితే, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనేతర ప్రజలకు సమానమైన భూమిని, ఆస్తిని మైదాన ప్రాంతంలో చూపించి అక్కడికి పంపించవచ్చు. లేదా వందల ఏళ్ళ నుండి అదే ప్రాంతంలో నివసిస్తున్న ఎస్సీ, బీసీ, ఓసీ కులాల వారిని కూడా ట్రైబ్స్‌గా గుర్తించి సమాన హక్కులు ఇవ్వాలి. బైట నుండి ఆ ప్రాంతానికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళని మాత్రమే గిరిజనేతరులుగా భావించాలి. అది సాధ్యపడుతుందా? ప్రభుత్వం ఆ పని చేయగలదా?
1959లో ఉన్న చట్టం ప్రకారం షెడ్యూల్ ఏరియాలో ఉన్న గిరిజనుల భూమిని గిరిజనేతరులు కొనకూడదు. గిరిజనుల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్న గిరిజనేతరులు అక్రమంగా వారి భూమిని తక్కువ రేటుకు కొని వారిని షెడ్యూల్ ఏరియా నుండి వెళ్ళగొడతారన్న కారణంతో ఈ చట్టం తెచ్చారు. ఆ తరువాత 1/70 చట్టం తెచ్చి ఆ ప్రాంతంలోని గిరిజనేతరులు కూడా వారి భూమిని గిరిజనులకే అమ్మాలి తప్ప వేరే వాళ్ళకి అమ్మకూడదు, వారు వారి భూముల్లో పరిశ్రమలు పెట్టకూడదు, వ్యాపారాలు చేయకూడదు అని సవరణ చేసారు. ఇది ఆ ప్రాంతాల్లో ఉన్న గిరిజనేతరులకు సొంత ఆస్తిపై స్వేచ్ఛా లావాదేవీలను దెబ్బతీసింది. వారి ఆర్థిక పరిస్థితిని కుదేలు చేసింది. అంతేగాక, ఈ చట్టం షెడ్యూల్ ఏరియాలో గిరిజనులకు గిరిజనేతరులకు మధ్య గోడ కట్టి, వారి మధ్య వైషమ్యాలు సృష్టించింది.
1/70 చట్టాన్ని ఏ ప్రాంతంలో ఏ ప్రజల అభివృద్ధి కోసం చేసారో, ఆ ప్రాంతంలో ఆ ప్రజలు సాధించిన అభివృద్ధి ఏమిటి? ఆ చట్టం లేని ప్రాంతాల్లో ఆ ప్రత్యేక తరగతి ప్రజలు పొందిన లాభం ఏమిటి? అదే సమయంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఇతర ప్రజల పరిస్థితులపై కూడా అధ్యయనం చేసి, చట్టాన్ని అవసరమైన మేరకు సమీక్షించాలి అనేది నా అభిమతం. అంతే కానీ, త్రినాథరావు భావించిన విధంగా నేను ఈ చట్టాన్ని ఎత్తివేయాలని చెప్పడం లేదు.
మంధనపు రామారావు
Also Read:
హెల్త్‌కేర్ సెక్యూరిటీ.. కొత్త తరం ఆర్థిక ప్రణాళిక
ఎలుగుబంటిని నిద్ర లేపినందుకు రూ.5లక్షల ఫైన్