శ్రీ పరాభవ నామ సంవత్సరం.. వృశ్చిక రాశి ఫలితాలు..
ABN , Publish Date - Mar 19 , 2026 | 09:49 AM
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారం రంగంలోని వారు మెరుగైన లాభాలు ఆర్జిస్తారు.
(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయం: 11, వ్యయం: 5; రాజపూజ్యం: 2, అవమానం: 6
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారం రంగంలోని వారు మెరుగైన లాభాలు ఆర్జిస్తారు. పై ఉద్యోగుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్లు లభిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేస్తారు. ఆస్తి వ్యవహారాల్లో చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. న్యాయ, రక్షణ, బోధన రంగాల వారు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ రంగాల వారు మంచి ఫలితాలు అందుకుంటారు.
గురువు 8, 9, 10 స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలం. సంతానప్రాప్తికి అనుకూలం. రవాణా, ప్లానింగ్, శిక్షణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. పెద్దల సహకారంతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. డిసెంబరు 14 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రించినందున మీ పురోగతి చూసి అసూయపడేవారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిళ్లు పెరుగుతాయి. లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. మీ గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగే ప్రమాదం ఉంది.
ఈ ఏడాది 5స్థానంలో శని సంచారం కారణంగా సంతానయోగం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమాను బంధాలు బలపడతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆడిటింగ్, టెలివిజన్ అడ్వర్టయిజ్‌మెంట్ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. శతృబాధ అధికం. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. జూలై 27 - డిసెంబరు 11 తేదీల మధ్య శని వక్రించిన ఫలితంగా విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. వ్యాపారాల విస్తరణకు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలం కాదు. ప్రియతములతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. టెలివిజన్, కళలు, క్రీడల రంగాల వారికి అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి.
ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా ఉద్యోగ వ్యవహారాల్లో పై అధికారుల కారణంగా చికాకులు ఎదురవుతాయి. బదిలీలు, మార్పుల కారణంగా ఒత్తిడికి లోనవుతారు. లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలి. డ్రైవింగ్‌కు దూరంగం ఉండటం మేలు. కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి.
శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించడం మంచిది.