Share News

శ్రీ పరాభవ నామ సంవత్సరం.. ధనుస్సు రాశి ఫలితాలు..

ABN , Publish Date - Mar 19 , 2026 | 09:57 AM

ధనుస్సు రాశివారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ఇంట్లో వేడుకలు, శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

శ్రీ పరాభవ నామ సంవత్సరం.. ధనుస్సు రాశి ఫలితాలు..

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)

ఆదాయం: 14, వ్యయం: 11; రాజపూజ్యం: 5, అవమానం: 6

ధనుస్సు రాశివారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ఇంట్లో వేడుకలు, శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెంపొందించు కుంటారు. రుణాలు మంజూరవుతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాల వల్ల ప్రయోజనం పొందుతారు.


ఈ ఏడాది 6, 7, 8 స్థానాల్లో గురుసంచారం ఫలితంగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. శ్రీవారు, శ్రీమతి విషయాలలో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులు లక్ష్య సాధనలో సహకరిస్తారు. స్పెక్యులేషన్లు, షేర్ల లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. రుణాలు తీర్చగలుగుతారు. ఉమ్మడి వ్యాపారం కలిసివస్తుంది. విద్యార్థులకు శుభప్రదమైన కాలం. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ప్రకటనలు, ఏజెన్సీ రంగాల వారికి అనుకూలం. రాజకీయ, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం. డిసెంబరు 14 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రించిన ఫలితంగా వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.


ఈ ఏడాది 4వ స్థానంలో శని గ్రహ సంచారం ఫలితంగా కుటుంబ వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకున్న చోటికి బదిలీ అవుతారు. ప్రమోషన్లు అందుకుంటారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం వారికి ప్రోత్సాహకరం. హార్డ్‌వేర్‌, కలప, ఫర్నిచర్‌, పెట్రోలు, ఇనుము వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అర్ధాష్టమ శని కారణంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. శని వక్రించిన జూలై 27 - డిసెంబరు 11 తేదీల మధ్య వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. ఓరిమితో అందరినీ ఒప్పించేందుకు యత్నించి విజయం సాధిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే యత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.


ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బదిలీలు, మార్పులకు అనుకూలం. ఉన్నత విద్య కోసం ఖర్చులు అంచనాలు మించిపోతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. తోబుట్టువులు, బంధుమిత్రులతో అనుకూలంగా ఉంటుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో నిదానం అవసరం.

పార్వతీ దేవిని ఆరాధించడం మంచిది.

Updated Date - Mar 19 , 2026 | 09:57 AM