Share News

శ్రీ పరాభవ నామ సంవత్సరం.. తులా రాశి ఫలితాలు..

ABN , Publish Date - Mar 19 , 2026 | 09:41 AM

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి పురోగతి కనిపిస్తుంది.

శ్రీ పరాభవ నామ సంవత్సరం.. తులా రాశి ఫలితాలు..

(చిత్త 3,4; స్వాతి; విశాఖ 1,2,3 పాదాలు)

ఆదాయం: 5, వ్యయం: 14; రాజపూజ్యం: 6, అవమానం: 3

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేసేందుకు ఈ ఏడాది అనుకూలం. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళతారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టినా తగిన జాగ్రత్తలు తీసుకుని బయటపడతారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగ్‌ రంగాల వారు, రక్షణ, బోధన, ప్రచురణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


గురువు ఈ ఏడాది మీ జన్మ రాశి నుంచి 9, 10, 11 స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపార రంగంలోని వారు లాభాలు అందుకుంటారు. అధికారం, హోదా, గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయరంగంలోని వారు ఉన్నత పదవులు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. డిసెంబరు 14 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రించినందున అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆస్తినష్టం జరుగుతుంది. శతృబాధ అధికం. ఉద్యోగులు పైఅధికారుల నుంచి మాటపడాల్సి వస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలకు ఇది తగిన సమయం కాదని గ్రహించాలి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.


శని ఈ సంవత్సరం 6వ స్థానంలో సంచరిస్తున్న ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. శతృబాధ తగ్గుతుంది. పెద్దలు, సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఇతరులకు మంచి చేసేందుకు ప్రయత్నించి మాటపడతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉదర సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. జూలై 27 - డిసెంబరు 10 తేదీల మధ్య శని వక్రించిన ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వైద్యం, ఫార్మా రంగాల వారికి ప్రోత్సాహకరం.


ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా ఆర్థికంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. ప్రేమవ్యవహారాలకు దూరంగా ఉండాలి. క్రయవిక్రయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒత్తిళ్లు అధికమౌతాయి. పెద్దల అభిప్రాయం తెలుసుకుని అందుకు అనుగుణంగా నడుచుకుంటే మంచి జరుగుతుంది.

ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మేలు జరుగుతుంది.

Updated Date - Mar 19 , 2026 | 09:42 AM