శ్రీ పరాభవ నామ సంవత్సరం.. సింహరాశి ఫలితాలు..
ABN , Publish Date - Mar 19 , 2026 | 09:22 AM
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)
ఆదాయం: 5, వ్యయం: 5; రాజపూజ్యం: 7, అవమానం: 3
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. శ్రీవారు, శ్రీమతి చొరవతో ఆర్థికంగా లాభిస్తుంది. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పది మందికి సహకారం చేస్తారు. ఇతరుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
గురువు ఈ ఏడాది మీ జన్మరాశి నుంచి 11, 12, 1 స్థానాల్లో సంచారం చేస్తాడు. ఫలితంగా విద్య, న్యాయ, రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలాసాలకు ఖర్చులు అధికం. దూరప్రయాణాలకు అనుకూలం. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు. పరిశోధకులకు అనుకూల సమయం. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. డిసెంబరు 14 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రించి ఉంటాడు. ఫలితంగా ఆ సమయంలో ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి ముందడుగు వేయాలి. కొత్త పరిచయాల కారణంగా అనుకోని చిక్కులు ఎదురవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
శని 8వ స్థానంలో సంచారం చేస్తున్న ఫలితంగా ఈ ఏడాది ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించాలి. ఆస్తి వ్యవహారాల్లో ఆనుకోని చిక్కులు ఎదురవుతాయి. తోబుట్టువులతో లావాదేవీల్లో నిదానంగా వ్యవహరించాలి. మధ్యవర్తిత్వానికి, ష్యూరిటీ, గ్యారెంటీలకు దూరంగా ఉండటం మంచిది. పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. రుణబాధలు అధికం. మోకాళ్లు, కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి. జూలై27 నుంచి డిసెంబరు 11 వరకు శని వక్రగమనంలో ఉన్న సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఎక్కువైనా చివరకు విజయం సాధిస్తారు.
ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వల్ల మనస్పర్థలు ఏర్పడతాయి. శతృబాధ పెరుగుతుంది. భాగస్వామి విషయంలో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోతారు. వివాహం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి.
దుర్గాదేవి ఆరాధన వల్ల మేలు జరుగుతుంది.