Share News

శ్రీ పరాభవ నామ సంవత్సరం.. మిథునరాశి ఫలితాలు..

ABN , Publish Date - Mar 19 , 2026 | 09:00 AM

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశివారికి ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

శ్రీ పరాభవ నామ సంవత్సరం.. మిథునరాశి ఫలితాలు..

మిథునం

(మృగశిర 3,4; ఆరుద్ర; పునర్వసు 1,2,3 పాదాలు)

ఆదాయం: 8, వ్యయం: 11; రాజపూజ్యం: 1, అవమానం: 7

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశివారికి ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కోరుకున్న చోటికి బదిలీ అవుతారు. వాహనయోగం ఉంది. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. కమ్యూనికేషన్లు, రవాణా, టీచింగ్‌, బ్యాంకింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కన్సల్టెన్సీలు, ఆడిటింగ్‌ రంగాల వారు పురోగతి సాధిస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.


ఈ ఏడాది గురువు మీ జన్మరాశితో పాటు 2, 3 స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు ఫలిస్తాయి. సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాంధవ్యాలు బలపడతాయి. విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక, రాజకీయరంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. కుటుంబం విస్తరిస్తుంది. డిసెంబరు 14 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రగమనంలో ఉంటాడు. ఆ సమయంలో ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు అధికం. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి.


మీ జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచారం కారణంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు అందుకుంటారు. బదిలీలకు అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిళ్లు ఉన్నా ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. శని వక్రగమనంలో ఉన్న జూలై 27 - డిసెంబరు 11 తేదీల మధ్య ఉద్యోగంలో ఒత్తిళ్లు అధికం. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.


ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా బదిలీలు జరుగుతాయి. బదిలీల వల్ల మొదల్లో చిన్న ఇబ్బందులు ఎదురైనా ఆ తరువాత పరిస్థితి సర్దుకుంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకు ఖర్చులు అధికం. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. డ్రైవింగ్‌లో నిదానం పాటించాలి. బంధుమిత్రుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. రవాణా రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

శ్రీ దక్షిణామూర్తి ఆరాధన మేలు చేస్తుంది.

Updated Date - Mar 19 , 2026 | 09:18 AM