Share News

శ్రీ పరాభవ నామ సంవత్సరం.. మకరరాశి ఫలితాలు..

ABN , Publish Date - Mar 19 , 2026 | 10:04 AM

మకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వ్యాపారాల ప్రారంభానికి, నూతన భాగస్వామ్యాలకు అనుకూలం.

శ్రీ పరాభవ నామ సంవత్సరం.. మకరరాశి ఫలితాలు..

(ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం; ధనిష్ఠ 1,2 పాదాలు)

ఆదాయం: 2, వ్యయం: 8; రాజపూజ్యం: 1, అవమానం: 2

మకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వ్యాపారాల ప్రారంభానికి, నూతన భాగస్వామ్యాలకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, హోటల్‌ రంగాల వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా కొంత నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.


మీ జన్మరాశి నుంచి 6, 7, 8 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా విద్యలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆటపాటలపై దృష్టి సారించి విద్యను ఆశ్రద్ధ చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆస్తి కొనుగోలు ఆలోచనలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం మందగిస్తుంది. కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. డిసెంబరు 14 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రించిన సమయంలో ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో చేసే యత్నాలు సఫలమవుతాయి. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. హోటల్‌, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆస్పత్రులు, కేటరింగ్‌, నిత్యావసరాల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఉన్నత చదువుల్లో విజయం సాధిస్తారు. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. రుణాలు తీర్చగలుగుతారు.


మీ జన్మరాశి నుంచి 3వ స్థానంలో శని సంచారం ఫలితంగా బదిలీలు, సీట్ల మార్పిడి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు, స్థలం కొనుగోలు చేస్తారు. తోబుట్టువులు, సన్నిహితులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. శని వక్ర గమనంలో ఉన్న జూలై 27- డిసెంబరు 11 తేదీల మధ్య కుటుంబ విషయాల్లో చికాకులు అధికం. సంతానం విషయాలు ఆందోళన కలిగిస్తాయి. విద్యార్థులకు చదువుల పట్ల అశ్రద్ధ పెరుగుతుంది. విలాసాలకు వెచ్చిస్తారు. ఆస్తి సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లో, కార్యాలయంలో బాధ్యతలు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. తోబుట్టువులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.


ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా క్రయవిక్రయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్థికంగా పురోగతి ఉన్నా డబ్బు చేతిలో నిలబడదు. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగం మారే ఆలోచన ఉంటే దాన్ని వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో ప్రయోగాలకు తగిన సమయం కాదు. ఆస్తిపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి.

శ్రీ దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.

Updated Date - Mar 19 , 2026 | 10:07 AM