Share News

శ్రీ పరాభవ నామ సంవత్సరం.. కర్కాటక రాశి ఫలితాలు..

ABN , Publish Date - Mar 19 , 2026 | 09:14 AM

కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం.. కర్కాటక రాశి ఫలితాలు..

కర్కాటకం

(పునర్వసు 4; పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం: 2, వ్యయం: 11; రాజపూజ్యం: 4, అవమానం: 7

కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతంది. తోబుట్టువుల ఆస్తి వ్యవహారాల్లో చిన్నపాటి చికాకులు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అంచనాలు మించుతాయి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


మీ జన్మరాశి నుంచి 12,1,2 స్థానాల్లో గురుగ్రహ సంచారం కారణంగా ఈ ఏడాది స్థిరచరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వ్యాపారాల్లో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీల వారికి శుభప్రదం. కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. డిసెంబరు 14 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రగమనంలో ఉంటాడు. ఆ సమయంలో ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. ఉద్యోగ, వ్యాపారాల్లో నిదానం పాటించాలి. రవాణా, కన్సల్టెన్సీ, విద్యారంగాల వారు జాగ్రత్తగా ముందడుగు వేయాలి. కోర్టు వ్యవహారాలు కలవరం కలిగిస్తాయి. ఈ సమయంలో కొత్త ప్రయోగాలు వాయిదా వేసుకోవడం మంచిది.


ఈ ఏడాది మీ జన్మరాశి నుంచి 9వ స్థానంలో శని సంచారం జరుగుతున్నందున విద్యార్థులకు అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్తులకు సంబంధించిన కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. జూలై 27 - డిసెంబరు 14 తేదీల మధ్య శని వక్రించిన కారణంగా ఏకాగ్రత, పట్టుదలతో అవరోధాలను అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పాటించాలి. విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ చూపాలి.


ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. డ్రైవింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అపనిందలకు గురికావాల్సి వస్తుంది. అన్ని విషయాల్లో దూకుడు తగ్గించాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. క్రయవిక్రయాలకు అనుకూలం కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆహార నియమాలు పాటించాలి.

పరమేశ్వరుడి ఆరాధన శుభప్రదం.

Updated Date - Mar 19 , 2026 | 09:14 AM