శ్రీ పరాభవ నామ సంవత్సరం.. మేష రాశి ఫలితాలు..
ABN , Publish Date - Mar 19 , 2026 | 08:30 AM
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు.
మేషం
(అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం)
ఆదాయం: 11,వ్యయం: 5; రాజపూజ్యం: 2, అవమానం: 4
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగంలో, వ్యాపారంలో మార్పులకు ఈ ఏడాది అనుకూలం. బదిలీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు శుభప్రదం. పెండింగ్‌లో ఉన్న కోర్టు పనుల్లో కాస్త కదలిక మొదలవుతుంది. పరిశోధనలు, విదేశీ ప్రయాణాలకు అనుకూలం. వాహనాలు కొనుగోలు చేస్తారు. భూమి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఈ ఏడాది గురువు 3,4.5 స్థానాలలో సంచరిస్తున్న ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామా లుంటాయి. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం అందుకుంటారు. స్టేషనరీ, రవాణా, పాఠశాలలు, మార్కెటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరం. విదేశీ ప్రయాణాలకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో చిన్నపాటి మార్పులు చేస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగు పడుతుంది. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదివేందుకు అనుకూలం. ఫలితంగా ఖర్చులు పెరుగుతాయి. రుణబాధలు తగ్గుతాయి. డిసెంబరు 13 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రగమనంలో ఉన్నందున ఆ సమయంలో వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో నిదానం పాటించాలి. విద్యార్థులు చదువుల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపాలి. వృత్తి, వ్యాపారాల్లో కొంత నిరుత్సాహంగా ఉంటుంది. ఉద్యోగ యత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆడిటింగ్, క్రీడలు, సినిమా, టెలివిజన్ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి.
12వ స్థానంలో శని సంచారం వల్ల వాహనాలు, భూముల కొనుగోలుకు అనుకూలం. పరిశోధనా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదే శాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అఽధికం. అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. జూలై 27 నుంచి డిసెంబరు 11 వరకు శని వక్రగమనంలో ఉంటాడు. ఆ మాసాల్లో ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పట్టుదలతో ప్రయత్నించి లక్ష్యాలు సాధిస్తారు.
ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచారం కారణంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఉన్నతవిద్యకై చేసే యత్నాలు వాయి దావేసుకోవడం మంచిది. స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహించాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చేముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త స్నేహాలకు దూరంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి. షేర్లు, భాగస్వామ్యాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. సన్నిహితుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
శ్రీకృష్ణ భగవానుడి ఆరాధన శుభప్రదం.