Share News

శ్రీ పరాభవ నామ సంవత్సరం.. కుంభ రాశి ఫలితాలు..

ABN , Publish Date - Mar 19 , 2026 | 10:10 AM

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. స్నేహబాంధవ్యాలు పెరుగుతాయి.

శ్రీ పరాభవ నామ సంవత్సరం..  కుంభ రాశి ఫలితాలు..

(ధనిష్ఠ 3,4; శతభిషం; పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఆదాయం: 2, వ్యయం: 8; రాజపూజ్యం: 4, అవమానం: 2

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. స్నేహబాంధవ్యాలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు అందుకుంటారు. పరిశ్రమలు, వ్యవసాయ రంగాలవారు మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పరిశోధనల్లో రాణిస్తారు. నేరపరిశోధన రంగంలోని వారు మంచి పేరు గడిస్తారు. నిర్మాణరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది.


5,6,7 స్థానాల్లో గురువు సంచారం ఫలితంగా ఈ ఏడాది ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేస్తారు. శాస్త్ర, విజ్ఞానరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లల విద్య, వృత్తి, వివాహ విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. స్నేహానుబంధాలు బలపడతాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, విద్యాసంస్థలు, సినిమాలు, ప్రకటనలు, టెలివిజన్‌, క్రీడలు, సృజనాత్మక రంగాల వారు సత్ఫలితాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. డిసెంబరు 14 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్ర గమనంలో ఉన్న సమయంలో విద్యార్థులు చదువుల పట్ల అశ్రద్ధ చూపే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. లక్ష్య సాధనలో పెద్దల సహకారం లోపిస్తుంది. ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి.


జన్మరాశి నుంచి 2వ స్థానంలో శని సంచారం ఫలితంగా ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మందగిస్తుంది. పై అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతాయి. వేతనాలు పెరుగుతాయి. అందుకు తగ్గట్టుగానే ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సి రావచ్చు. అకారణంగా కలహాలు పెరుగుతాయి. ఫలితంగా కష్టాలు ఎదుర్కొంటారు. శ్రమకు తగిన ఫలితం కనిపించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సన్నిహితులతో విరోధం ఏర్పడే ప్రమాదం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. జూలై 27-డిసెంబరు 11 మధ్య శని వక్రించిన ఫలితంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారంలో మొదట ఇబ్బందులు ఎదురైనా చివరకు మంచి ఫలితాలు సాధిస్తారు.


ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా వైవాహిక జీవితంలో చికాకులు, మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. పందాలు, పోటీల్లో నష్టపోయే ప్రమాదం ఉంది. ఆర్థికపరమైన అంశాల్లో వేరే వారి జోక్యం కారణంగా నష్టపోతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వాహన ప్రయాణాలకు దూరంగా ఉండాలి. పెద్దల సలహా మేర నడుచుకుంటూ నష్ట తీవ్రతను తగ్గించుకునే వీలుంటుంది.

శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన మేలు చేస్తుంది.

Updated Date - Mar 19 , 2026 | 10:10 AM