బాలికలతో అసభ్య ప్రవర్తన.. టీచర్‌పై పోక్సో కేసు
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:57 AM
విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేయగా.. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
ఖమ్మం ఖానాపురంహవేలి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేయగా.. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మరోవైపు జిల్లా విద్యాశాఖాధికారి ఆయనను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన శనివారం ఖమ్మంలో జరిగింది. నగరంలోని ఖాజీపుర పాఠశాలలో ఎండీ హర్షద్ పాషా (2024 డీఎస్సీ బ్యాచ్) హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా ఆయన విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో భయపడిన బాలికలు, రానురాను పాషా వేధింపులు మితిమీరడంతో విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. శనివారం కొందరు తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి హర్షద్ పాషాకు దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న ఖమ్మం వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.