Share News

కొత్తగా పెళ్లైన యువతి వాలకం చూసి భర్తకు డౌట్! ఫోన్ చెక్ చేస్తే..

ABN , Publish Date - May 24 , 2026 | 06:45 PM

కొత్తగా పెళ్లైన ఒక యువతి నిత్యం ఫోన్‌లో బిజీగా ఉండటం చూసిన ఆమె భర్తకు డౌటొచ్చింది. భార్య ఫోన్ చెక్ చేయగా ఆమె చేసిన మోసం బయటపడింది. నిర్ఘాంతపోయిన అతడు పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

కొత్తగా పెళ్లైన యువతి వాలకం చూసి భర్తకు డౌట్! ఫోన్ చెక్ చేస్తే..
marriage fraud case in Madhyapradesh

ఇంటర్నెట్ డెస్క్: అతడికి ఇటీవలే పెళ్లైంది. అయితే, భార్య నిత్యం ఎవరితోనో చాటింగ్‌లో బిజీగా ఉండటం చూసి డౌటొచ్చింది. ఒక రోజు అతడు ఆమె ఫోన్‌ను చెక్ చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్యకు అంతకుముందే పెళ్లి అయ్యిందని తెలిసి అతడు నిర్ఘాంతపోయాడు. ఆమె భర్త ఎవరో తెలిసి మరింత షాకయ్యాడు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.

మీడియా కథనాల ప్రకారం, గ్వాలియర్‌కు (మధ్యప్రదేశ్) చెందిన రతన్ శర్మ జబల్‌పూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు అతడికి సంబంధాలు చూసే ప్రయత్నంలో ఉండగా వారికి పొరుగింటి సోనూ తివారీ ద్వారా మొరీనాకు చెందిన సోనూ అలియాస్ అజయ్ చౌహాన్‌ పరిచయమయ్యాడు. తనకు రాధ అనే (అసలు పేరు దీక్షా ముద్గల్) సవితి చెల్లె ఉందని, ఆమె కోసం సంబంధాలు వెతుకుతున్నట్టు చౌహాన్ రతన్ కుటుంబానికి చెప్పాడు. ఆమె ఫొటో, ఇతర వివరాలను కూడా ఇచ్చాడు.


రతన్ కుటుంబానికి అమ్మాయి నచ్చడంతో వారు పెళ్లికి ఒకే చెప్పారు. ఏప్రిల్ 27న గ్వాలియర్‌లో వారి పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి చౌహాన్ హాజరయ్యాడు. పెళ్లి ఏర్పాట్లు, వధువు కుటుంబానికి బహుమతుల కోసం వరుడి కుటుంబం రూ.7 లక్షలకు పైగా ఖర్చుపెట్టింది. వధువు తల్లిగా చెప్పుకున్న మాయా దేవి అనే మహిళ కన్యాదానం చేసింది. శిల్పీ పార్మర్, రాఘవేంద్ర పార్మర్, సత్యేంద్ర చౌహాన్‌లు కూడా తాము వధువు బంధువులమంటూ పెళ్లికి వచ్చారు.

పెళ్లైన తరువాత యువతి తీరు చూసి రతన్ కుటుంబంలో అనుమానాలు మొదలయ్యాయి. ఆమె నిత్యం ఫోన్‌లో చాటింగ్ చేస్తుండటం చూసి వారికి డౌటొచ్చింది. ఈ క్రమంలో ఒక రోజు రతన్ ఆమె ఫోన్‌ను చెక్ చేయగా అందులో చౌహాన్‌తో ఆమె చేసిన చాటింగ్ కనిపించింది. రాధకు సవితి సోదరుడిగా పరిచయం చేసుకున్న చౌహానే ఆమె భర్త అన్న విషయం తెలిసి రతన్ మరింతగా షాకైపోయాడు. రాధ వెంట ఉన్న వారందరూ ఒక ముఠాగా ఏర్పడి తనను మోసం చేశారని అతడికి అర్థమైంది. దీంతో, వెంటనే రాధను పోలీసులకు అప్పగించి జరిగిన మోసం గురించి చెప్పాడు. పెళ్లి పేరిట తమ డబ్బును దోచుకునేందుకు వారంతా ప్రయత్నించారని ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో రాధ అలియాస్ దీక్షా ముద్గల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరిపైనా కేసు నమోదు చేశారు. చౌహాన్‌ను కూడా అరెస్టు చేసిన పోలీసులు మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలనూ చదవండి:

కానిస్టేబుల్‌ హత్యకు న్యాయవాది కుట్ర

బీఆర్‌ఎస్‌ నాయకుడి దారుణ హత్య

Updated Date - May 24 , 2026 | 07:00 PM